Asianet News TeluguAsianet News Telugu

WIPL: ఐపీఎల్-16 సీజన్ కంటే ముందే ఉమెన్స్ ఐపీఎల్..? వచ్చే నెలలో కీలక ప్రకటన!

WIPL: క్రికెట్ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉమెన్స్ ఐపీఎల్ కు బీసీసీఐ తుదిరూపునిస్తున్నది. వచ్చే ఏడాది  ప్రారంభంకానున్న ఈ మెగా ఈవెంట్ పై తాజాగా  పలు ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 
 

Women s IPL to be played before IPL 2023, Reports
Author
First Published Aug 12, 2022, 6:44 PM IST

భారత్‌లో ఐపీఎల్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. 2007లో మొదలైన ఈ మెగా ఈవెంట్ ‘ఇంతింతై వటుడింతై’ అన్నట్టుగా ఎదిగింది.  పురుషుల ఐపీఎల్ విజయవంతంగా కొనసాగుతుండటంతో బీసీసీఐ.. మహిళల ఐపీఎల్ మీద దృష్టి పెట్టింది. వచ్చే ఏడాది ఉమెన్స్ ఐపీఎల్‌ను ప్రారంభించేందుకు ఇప్పటికే గ్రౌండ్ వర్క్   పూర్తవగా తాజాగా దానికి తుదిరూపునిచ్చే పనిని చేపట్టింది బీసీసీఐ. పురుషుల ఐపీఎల్ సీజన్ (మార్చి చివర్లో) కంటే ముందే ఉమెన్స్ ఐపీఎల్ ను  ఆడించాలని భావిస్తున్నది. 

అచ్చం ఐపీఎల్ మాదిరిగానే ఉమెన్స్ ఐపీఎల్ ఉండనుంది. ఆరు ఫ్రాంచైజీలతో ఈ లీగ్ ను నిర్వహించేందుకు బీసీసీఐ సన్నాహాలు చేస్తున్నది.  ఐపీఎల్ లో ఇప్పటికే  ఫ్రాంచైజీ ఓనర్లుగా ఉన్న పలువురు బడా కార్పొరేట్లే ఉమెన్స్ ఐపీఎల్ లో కూడా  ఫ్రాంచైజీలను కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉన్నారని తెలుస్తున్నది. 

ఇదే విషయమై బీసీసీఐకి చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఉమెన్స్ ఐపీఎల్ ను మార్చిలో నిర్వహించాలని భావిస్తున్నాం. ఇంటర్నేషనల్ షెడ్యూల్స్ అనుగుణంగానే గాక లాజిస్టికల్ గా కూడా ఇది మాకు సాయపడుతుంది. ఇది ముగిసిన వెంటనే ఐపీఎల్ నూ ప్రారంభించొచ్చు..’ అని తెలిపాడు. గతంలో బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 

 

ఉమెన్స్ ఐపీఎల్ గురించి.. 

- ఆరు ఫ్రాంచైజీలతో ఆడనున్నారు. ఐపీఎల్ లో ఫ్రాంచైజీలను దక్కించుకున్న ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటికే ఫ్రాంచైజీలను దక్కించుకోవడానికి ఆసక్తి చూపుతున్నాయి. బీసీసీఐ కూడా వాళ్లకే తొలి ప్రాధాన్యం అని తెలిపింది. ఈ ఏడాది చివర్లో వేలం జరిగే అవకాశమున్నట్టు సమాచారం. 
- త్వరలోనే ఫ్రాంచైజీల బిడ్ ఉండనున్నట్టు సమాచారం. ఐపీఎల్ లో వేలం మాదిరిగానే ఇక్కడ కూడా  ప్లేయర్లను యాక్షన్ ద్వారా తీసుకోనున్నారు. 
- రెండు వారాలు సాగే ఈ టోర్నీలో 19 మ్యాచులు ఉండనున్నాయి. 
- ఒక్కో జట్టు  రెండు మ్యాచులు ఆడుతుంది. లీగ్ దశ, ప్లేఆఫ్స్, ఫైనల్ దశలో మ్యాచులుంటాయి. 
- లీగ్ దశలో టాప్-4గా నిలిచిన జట్లు ప్లేఆఫ్ చేరతాయి. అందులో టాప్-2 టీమ్స్ ఫైనల్ ఆడతాయి. 

 

బీసీసీఐ సెప్టెంబర్ లో  వార్షిక సమావేశం (ఏజీఎం) జరపనుంది. ఈ సమావేశంలో ఉమెన్స్ ఐపీఎల్ కు సంబంధించిన  పలు విషయాలపై స్పష్టత రానుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios