Davanagere : దావణగెరె దక్షిణ ఎమ్మెల్యే షామనూర్ శివశంకరప్ప దావణగెరె బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వరకు వంట చేయ‌డం మాత్ర‌మే వ‌చ్చంటూ చేసిన‌ వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. మ‌హిళ‌ల‌ను చిన్న‌చూపు చేసి కామెంట్స్ చేయ‌డం పై భార‌త స్టార్ షట్ల‌ర్ సైనా నెహ్వాల్ స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.  

Saina Nehwal : లోక్ సభ ఎన్నికల ప్రచారంలో మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు, విద్వేషపూరిత ప్రసంగాలపై భార‌త స్టార్ ష‌ట్ల‌ర్, ఒలింపిక్స్ మెడ‌ల్ విజేత సైనా నెహ్వాల్ గళం విప్పారు. 2012 లండన్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన ఈ బ్యాడ్మింటన్ స్టార్ కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ నేతపై తీవ్రస్థాయిలో విరుచుకుప‌డ్డారు. మహిళలు వంటగదికే పరిమితం కావాలని కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నేత షామనూరు శివశంకరప్ప చేసిన కామెంట్స్ పై మండిప‌డ్డారు.

కాంగ్రెస్ నాయ‌కుడి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు.. 

దావణగెరె నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి గాయత్రి సిద్దేశ్వర్‌కు వంట చేసే అర్హత మాత్రమే ఉందంటూ దావణగెరె దక్షిణ ఎమ్మెల్యే శామనూరు శివశంకరప్ప వివాదం సృష్టించారు. శివశంకరప్ప ప్రకటనపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లాలోని బంట్స్ భవన్‌లో జరిగిన కాంగ్రెస్ నేతల సమావేశంలో మాట్లాడిన శివశంకరప్ప.. ప్రత్యర్థి అభ్యర్థికి ప్రజల ముందు ఎలా మాట్లాడాలో కూడా తెలియదన్నారు. ఆమెకు వంట చేయడానికి మాత్రమే అర్హత ఉంది. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందే ముందు దావణగెరె సమస్యలను అర్థం చేసుకోవాలంటూ కామెంట్స్ చేశారు. అలాగే, "దావణగెరె నుంచి గెలిచిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీకి కమలం అర్పిస్తానని బీజేపీ అభ్యర్థి చెబుతున్నారు. ఇంతకుముందు కూడా గెలిచింది మీరు (జీఎం సిద్దేశ్వర్) కాదా? అప్పుడే పువ్వు పంపావా? మోడీకి పూలు పంపితే అభివృద్ధి జరగదు. అభివృద్ధి పనులు జరగాలి. మోడీ మోడీ అన్నంత మాత్రాన అభివృద్ధి జరగదు" అని అన్నారు.

గాయత్రి సిద్దేశ్వర కౌంటర్.. 

శామనూరు శివశంకరప్ప తన మాటలతో మహిళలను అవమానించారని గాయ‌త్రి సిద్దేశ్వ‌ర అన్నారు. మహిళలు నేడు వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగాల్లో విజయాలు సాధిస్తున్నార‌ని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో సమర్ధవంతంగా రాణిస్తున్న విష‌యం ఆయ‌న‌కు తెలియ‌దంటూ మండిప‌డ్డారు. 'వంట చేయడంలో, సహాయం చేయడంలో ఉన్న ప్రేమ వాళ్లకు తెలియదు. ఒక స్త్రీ కూడా వంట చేసి ఆకాశంలో ఎగురుతుంది. మహిళా సాధికారతకు మోడీ పెద్దపీట వేస్తున్నారు. కానీ, ఇలాంటి వారు మహిళలను అవమానిస్తారు' అని శివశంకరప్ప పై మండిప‌డ్డారు.

శివ‌శంక‌ర‌ప్ప పై సైనా నెహ్వాల్ ఫైర్.. 

మ‌హిళ‌ల‌ను కించ‌ప‌రిచే విధంగా వివాదాస్ప వ్యాఖ్య‌లు చేసిన శివ‌శంక‌ర‌ప్ప‌పై భార‌త స్టార్ ష‌ట్ల‌ర్ సైనా నెహ్వాల్ స్పందిస్తూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. 'మహిళలు వంటింటికే పరిమితం కావాలి' అని కర్ణాటకకు చెందిన ప్రముఖ నేత శామనూరు శివశంకరప్ప అన్నారు. 'లడ్కీ హమ్, లడ్ సక్తి హమ్' (నేను అమ్మాయిని, నేను పోరాడగలను) అని చెప్పే పార్టీ నుంచి ఇది ఊహించలేదని' అన్నారు. 2020లో బీజేపీలో చేరిన సైనా.. అంతర్జాతీయ విజయాలు సాధించి, క్రీడల్లో భారత్‌కు పతకాలు సాధించినప్పుడు కాంగ్రెస్ ఏం చేస్తుందని ఆశించిందని ప్రశ్నించారు. అందరు యువతులు, మహిళలు తమకు నచ్చిన ఏ రంగంలోనైనా ఘనత సాధించాలని కలలు కంటున్నప్పుడు ఇలాంటి వ్యాఖ్య‌లు ఎందుకు వ‌స్తున్నాయి. ఇలాంటి స్త్రీద్వేషపూరిత మాటలు స‌రికాద‌ని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును మన ప్రధాని మోడీ నాయకత్వంలో ఆమోదించారు, మరోవైపు మహిళా శక్తిని అవమానించే వారు, స్త్రీ ద్వేషపూరిత వ్యక్తులు ఉన్నారు. ఇది నిజంగా నిరాశపరిచింది' అని సైనా పేర్కొన్నారు.

Scroll to load tweet…

IPL 2024: శ్రేయాస్ అయ్యర్‌తో మిస్టరీ గర్ల్.. ఎవ‌రీ త్రిషా కులకర్ణి? ఫొటోలు వైర‌ల్ !