టీమిండియా మాజీ క్రికెటర్, బిజెపి ఎంపీ గౌతమ్ తన మంచి మనసును మరోసారి చాటుకున్నాడు. ఓ మహిళ సోషల్ మీడియా ద్వారా సాయాన్ని కోరగా వెంటనే స్పందించాడు. ఆపదలో వున్న సదరు మహిళ కుటుంబాన్ని ఆదుకోడానికి సిద్దమయ్యాడు. ఈ సంఘటనతో అతడు తన నియోజకవర్గ ప్రజలకే కాదు అభిమానులకు మరింత దగ్గరయ్యాడు. 

డిల్లీకి చెందిన ఉన్నతి మదన్ అనే మహిళ తండ్రి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. శరీరంలోని అవయవాలన్ని పాడయిపోయిన అతడు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. దీంతో  కుటుంబసభ్యులు అయన్ని ఎయిమ్స్ కు తరలించారు.  అయితే అక్కడ రెండు రోజుల పాటు చికిత్స కొనసాగించిన సిబ్బంది ఆ తర్వాత అర్థాంతరంగా పంపించేశారు.  ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించే స్తోమత లేకపోవడంతో అతడి ఆరోగ్యం మరింత క్షీణించింది. 

దీంతో ఎయిమ్స్ సిబ్బంది నిర్లక్ష్యాన్ని స్థానిక ఎంపీ గంభీర్ దృష్టికి తీసుకెళ్లిన సదరు మహిళ తన తండ్రిని కాపాడాలంటూ వేడుకుంది.  '' గత రెండు రోజులుగా నా తండ్రి  తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్ లో చికిత్స పొందాడు. కానీ అతడి ఆరోగ్యం మెరుగుపడక ముందే అక్కడి సిబ్బంది సౌకర్యాలు లేవంటూ బయటకు పంపించేశారు. ఇతర ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా ఆయన్ని చేర్చుకోవడం లేదు. దయచేసి మీరే ఆయన్ని కాపాడాలి.'' అంటూ గంభీర్ ను ట్విట్టర్ ద్వారా వేడుకుంది. 

ఆమె ట్వీట్ కు గంభీర్ వెంటనే స్పందించాడు. ''మీ పోన్ నంబర్  నాకు వెంటనే పంపండి.'' అంటూ సదరు ట్వీట్ కు రిప్లై ఇచ్చాడు. ఇలా ఓ పేద కుటుంబానికి అండగా నిలిచి ఆదుకోడానికి సిద్దమైన గంభీర్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. గంభీర్ మాటలు ఎంత కఠినంగా వుంటాయో మనసు అంత సుతిమెత్తగా వుంటుందంటూ అభిమానులు పొగుడుతున్నారు.