Asianet News TeluguAsianet News Telugu

PAKvsENG: ఇదేం కొట్టుడు..? అసలు ఆడుతున్నది టెస్టేనా..? ఒక్కరోజే 500+ పరుగులా..!

Pakistan Vs England 1st Test: రాక రాక పాకిస్తాన్ పర్యటనకు వచ్చిన ఇంగ్లాండ్.. రావల్పిడి వేదికగా జరుగుతున్న  తొలిటెస్టులో రికార్డుల దుమ్ము దులిపింది. ఆట తొలిరోజే నలుగురు బ్యాటర్లు సెంచరీలు చేయడంతో  ఒక్కరోజే 506 పరుగులు చేయగలిగింది. 

With Top 4 Batters Hundreds England Cross 500 Mark in 1st Day Of Rawalpindi Test Against Pakistan
Author
First Published Dec 1, 2022, 6:49 PM IST

‘రావల్పిండి టెస్టుకు ముందు ఒక్కరోజే 14 మంది ఇంగ్లాండ్ ఆటగాళ్లకు అస్వస్థత..’, ‘అంతుచిక్కని వైరస్ తో బాధపడుతున్న ఇంగ్లీష్ క్రికెటర్లు..’, ‘అసలు  ఇంగ్లాండ్ - పాకిస్తాన్ తొలి టెస్టు జరిగేనా..?’ అన్న అనుమానాల నడుమ   రావల్పిండి వేదికగా రెండు జట్ల మధ్య  మొదలైన తొలి టెస్టులో ఇంగ్లాండ్ రికార్డుల దుమ్ముదులిపింది. తమ ఫిట్నెస్ పై అనుమానం వ్యక్తం చేసిన పాకిస్తాన్ మాజీలకు దిమ్మ తిరిగే సమాధానం చెప్పింది.  ఒక్కరోజే ఏకంగా 500 కు పైగా రన్స్ స్కోరు చేసి  ‘ఇది మా బజ్ బాల్ అప్రోచ్’ అంటే అని చెవులు దద్దరిల్లిపోయేలా చాటి చెప్పింది. 

17 ఏండ్ల తర్వాత పాకిస్తాన్  పర్యటన (టెస్టు)కు వచ్చిన ఇంగ్లాండ్ రావాల్పిండి టెస్టులో  తొలిరోజే రెచ్చిపోయింది. 75 ఓవర్ల పాటు సాగిన మొదటి రోజు ఆటలో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఏకంగా 506 పరుగులు చేసింది. టెస్టు క్రికెట్ లో  ఒక్కరోజు 500 ప్లస్ స్కోరు చేసిన తొలి జట్టుగా  ప్రపంచ రికార్డు సృష్టించింది.  

ఈ టెస్టులో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ తమ కొత్త అప్రోచ్ ‘బజ్ బాల్’ (దూకుడుగా ఆడటం) ను పాకిస్తాన్ కు రుచి చూపించింది.  ఓపెనర్లు జాక్ క్రాలే (111 బంతుల్లో 122, 21 ఫోర్లు), బెన్ డకెట్ (110 బంతుల్లో 107, 15 ఫోర్లు)   తొలి వికెట్ కు 35.4 ఓవర్లలోనే  233 పరుగులు జోడించారు. ఇద్దరూ కలిసి సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

లంచ్ తర్వాత  సెంచరీ పూర్తి చేసుకుని  బెన్ డకెట్ నిష్క్రమించాడు. వెంటనే జాక్ క్రాలే కూడా పెవిలియన్ చేరాడు.  వన్ డౌన్ లో వచ్చిన ఓలీ పోప్ (104 బంతుల్లో 108, 14 ఫోర్లు) కూడా ఓపెనర్ల జోరు కొనసాగించాడు.   జో రూట్ (23) విఫలమైనా  హ్యరీ బ్రూక్ (81 బంతుల్లో 101 నాటౌట్, 14 ఫోర్లు, 2 సిక్సర్లు) తో కలిసి  ఇంగ్లాండ్ స్కోరును రాకెట్ స్పీడ్ తో పరిగెత్తించాడు. పోప్ - బ్రూక్ లు కలిసి మూడో వికెట్ కు 176 పరుగులు జోడించారు.  

సెంచరీ పూర్తయ్యాక  ఓలీ పోప్  ఔటైనా..   కెప్టెన్ బెన్ స్టోక్స్ (15 బంతుల్లో 34 నాటౌట్, 6 ఫోర్లు, 1 సిక్స్) సాయంతో   బ్రూక్ ధాటిగా ఆడాడు. 81 బంతుల్లోనే  సెంచరీ పూర్తి చేసుకున్నాడు.  74 వ ఓవర్లో ఇంగ్లాండ్ స్కోరు  488 పరుగుల వద్ద ఉండగా మహ్మద్ అలీ వేసిన 75వ ఓవర్లో  స్టోక్స్.. 4, 6, 4 కొట్టడంతో ఇంగ్లాండ్ స్కోరు 500 చేరింది.  ఇంగ్లాండ్ 506-4 పరుగుల వద్ద తొలిరోజు ఆట ముగిసింది.  

 

చరిత్రలో తొలిసారి.. 

టెస్టు క్రికెట్ చరిత్రలో ఆట తొలిరోజే 500 పరుగులు స్కోరు చేసిన తొలి టీమ్ గా ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది.   గతంలో ఆస్ట్రేలియా చేసిన 494 పరుగుల రికార్డును ఇంగ్లాండ్ బద్దలుకొట్టింది. ఆ జాబితాను ఓసారి చూస్తే..

- ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (2022) -  506 పరుగులు 
-  ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (1910) - 494 
- ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా (2012) - 482 
- ఇంగ్లాండ్ వర్సెస్ ఆస్ట్రేలియా (1934) - 475 
- ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా (1936) - 471 

 

పాక్ బౌలర్లు బేజారు.. 

ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ తో ఆడిన ఏ జట్టు కూడా  165 రన్స్ కొట్టలేదు.  షాహీన్ అఫ్రిది, హరీస్ రౌఫ్,  నసీమ్ షా, మహ్మద్ వసీం,  షాదాబ్ వంటి బౌలర్లు ప్రత్యర్థులను కట్టడి చేశారు. కానీ స్వంతగడ్డపై పాక్ బౌలర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల ధాటికి  బేజారయ్యారు. ఆరుగురు బౌలర్లు  వికెట్ల కోసం పడరాని పాట్లు పడ్డారు.  నసీమ్ షా, మహ్మద్ అలీ, హరీస్ రౌఫ్, జహీద్ మహ్మద్, అగా సల్మాన్, సౌద్ షకీల్ లు ధారాళంగా పరుగులిచ్చుకున్నారు. వీరిలో  ఏ ఒక్క బౌలర్ ఎకానమీ కూడా  5 కంటే తక్కువ లేదు.   జహీద్ మహ్మద్ కు రెండు..  హరీస్ రౌఫ్, మహ్మద్ అలీలకు తలా ఒక వికెట్ దక్కింది. 

Follow Us:
Download App:
  • android
  • ios