న్యూఢిల్లీ: ప్రపంచ కప్ విజయం టీమిండియా కోచ్ రవిశాస్త్రికి ఓ అబ్షెషన్. న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాలపై జరిగే ఆరు అంతర్జాతీయ వన్డే మ్యాచుల ద్వారా ఆస్ట్రేలియాలో అక్టోబర్ లో జరిగే టీ20 ప్రపంచ కప్ పోటీలకు కోహ్లీ సేన సిద్ధమవుతుందని ఆయన అన్నారు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలపై మాట్లాడారు. 

టాస్ తాము లెక్కలోకి తీసుకోవడం మానేశామని, పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రత్యర్థులు ఎవరైనా, ప్రపంచంలోని ఏ దేశంలోనైనా భారత జట్టు బాగా ఆడుతుందని ఆయన అన్నారు. అదే ఉద్దేశమని, దాని కోసమే ప్రయత్నిస్తున్నామని ఆయన అన్నారు. 

Also Read:న్యూజిలాండ్ తో టీ20 సిరీస్... ధావన్ స్థానంలో ఎవరు..?

ప్రపంచ కప్ అనేది అబ్షెషన్ అని, దాన్ని సాధించడదానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఆయన అన్నారు. పరస్పర విజయాలను జట్టు సభ్యులు ఆనందిస్తున్నారని ఆయన అన్నారు. తమ డిక్షనరీలో నేను అనే పదం లేదని, మేము అనే పదం మాత్రమే ఉందని ఆయన అన్నారు. జట్టు ఆ విధంగా ఉందని, దాంతో ఒకరి విజయాన్ని మరొకరు ఆనందిస్తున్నారని ఆయన అన్నారు. జట్టు విజయం కాబట్టి అలా వేడుక చేసుకుంటున్నారని అన్నారు. 

పూర్తి బలాన్ని సంతరించుకున్న ఆస్ట్రేలియా జట్టును 2-1 స్కోరుతో ఓడించడం భారత జట్టు మానసిక బలాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. తొలి మ్యాచులో ఓడిన తర్వాత ఇండియా బలంగా ముందుకు వచ్చిందని అన్నారు. అస్ట్రేలియాతో జరిగిన సిరీస్ భారత క్రికెటర్ల మానసిక బలాన్ని, ఒత్తిడిలో ఆడగలిగే సామర్థ్యాన్ని తెలియజేస్తోందని ఆయన అన్నారు. 

అస్ట్రేలియాపై విజయం ధైర్యాన్ని తెలియజేస్తోందని, విరాట్ బ్రేవ్ అనే పదాన్ని వాడాడని, బ్రేవ్ క్రికెట్ అడడానికి తాము భయపడలేదని ఆయన అన్నారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయడం అనే ఆప్షన్ కూడా ఉందని విరాట్ కోహ్లీ చెప్పిన మాటలను రవిశాస్త్రి సమర్థించారు. రాహుల్ లా బహు విధాలుగా ఉపయోగపడే క్రికెటర్లు జట్టులో ఉన్నందుకు విరాట్ సంతోషంగా ఉన్నాడని చెప్పారు. ఆప్షన్లను తాము ప్రేమిస్తామని చెప్పారు.

Also Read: ఆ జోన్ నుంచి మాత్రం టీం ఇండియా బయటపడగలిగింది: విరాట్ కోహ్లీ

గాయంతో శిఖర్ ధావన్ న్యూజిలాండ్ పర్యటనకు దూరం కావడం పట్ల రవిశాస్త్రి విచారం వ్యక్తం చేశారు. శిఖర్ ధావన్ సీనియర్ ఆటగాడని, అతను దూరం కావడం బాధగా ఉందని, అతను మ్యాచ్ విన్నర్ అని ఆయన అన్నారు.

కేదార్ జాదవ్ వన్డేలకు సరిపోడనే అభిప్రాయాన్ని ఆయన కొట్టిపారేశారు. అంతర్జాతీయ మ్యాచుల్లో తక్కువగా బౌలింగ్ చేస్తున్నప్పటికీ వన్డే జట్టులో అతను అంతర్భాగమని ఆయన అన్నారు. న్యూజిలాండ్ తో జరిగే సిరీస్ లో ఆడుతాడని చెప్పారు. అందరి అటగాళ్లను చూసినట్లే అతన్ని చూస్తామని రవిశాస్త్రి చెప్పారు 

తుది 11 మంది ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఉంటాడా అని అడిగితే సమాధానం చెప్పడానికి ఆయన నిరాకరించారు. అది సెలెక్టర్ జాబ్ అని, ఆ డిపార్టుమెంటులో తాను తలదూర్చబోనని ఆయన అన్నారు.