ప్రపంచ కప్ లో ఘోర వైఫల్యాన్ని చవిచూసిన వెస్టిండిస్ టీం అంతకంటే ఘోరంగా టీమిండియా చేతిలో ఓడింది. అంతర్జాతీయ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలోనూ విండీస్ రాణించలేకపోయింది. స్వదేశంలో జరిగిన టీ20, వన్డే, టెస్ట్ సీరిస్ లలోనూ కరీబియన్ జట్టు కనీసం ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయింది. దీంతో విండీస్ బోర్డు జట్టు ప్రక్షాళనను చేపట్టింది. 

ముందుగా కెప్టెన్సీ బాధ్యతల నుండి హోల్డర్ ను తప్పించి సీనియర్ ప్లేయర్ కిరన్ పొలార్డ్ కు అప్పగించారు. ఇలా నూతన కెప్టెన్ గా ఎంపికైన పొలార్డ్  సహచరులు, మాజీలు, అభిమానుల నుండి అభినందనలు అందుకుంటున్నాడు. ఈ క్రమంలోనే మాజీ ప్లేయర్ డ్వేన్ బ్రావో ఇన్ట్సాగ్రామ్ ద్వారా పొలార్డ్ ను కంగ్రాట్స్ చెబుతూనే అతడితో తనకున్న అనుబంధాన్ని బయటపెట్టాడు.

''మిత్రుడు పొలార్డ్ కు అభినందనలు. వెస్టిండిస్ జట్టు సారథ్య బాధ్యతలను అందుకోడానికి నువ్వు అన్ని విధాలుగా అర్హుడివి. జట్టును సమర్థవంతంగా  ముందుకు నడుపుతూ గొప్ప కెప్టెన్ గా ఎదుగుతావని నమ్మకం నాకుంది. నీ కెప్టెన్సీలో ఆడటానికైనా మళ్లీ వెస్టిండిస్ జట్టులో చేరాలనుంది.'' అంటూ పొలార్డ్ తో కలిసి దిగిన పోటోను బ్రావో పోస్ట్ చేశాడు. దీనికి పొలార్డ్ ''థ్యాంక్యూ సోల్జర్'' అంటూ కామెంట్ చేశాడు. 

శనివారం జరిగిన విండీస్ క్రికెట్ బోర్డు సమావేశంలో పొలార్డ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. బోర్డు డైరెక్టర్లలో ఆరుగురి మద్దతుతో పొలార్డ్‌ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. పొలార్డ్ విండీస్ తరపున ఇప్పటి వరకు 101 వన్డేలు, 62 టీ20లు ఆడాడు. వన్డేల్లో 25.71 సగటుతో 2,289 పరుగులు చేసి 50 వికెట్లు పడగొట్టాడు. టీ20లలో 23 వికెట్లతో పాటు 903 పరుగులు చేశాడు.