Asianet News TeluguAsianet News Telugu

ICC: పాకిస్థాన్ లో ఛాంపియన్స్ ట్రోఫీ.. టీమిండియా ఆడుతుందా..? భారత క్రీడా శాఖ మంత్రి రెస్పాన్స్ ఇదే..

Anurag Thakur: రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో చాలాకాంలంగా ఇండియా-పాకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. ఐసీసీ ఈవెంట్లలో మినహా  రెండు దేశాలు ముఖాముఖి తలపడింది లేదు. కాగా ఐసీసీ ప్రకటించిన తాజా షెడ్యూల్ ప్రకారం 2025లో ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనున్నది. మరి టీమిండియా పాక్ కు వెళ్తుందా..? దీనిపై కేంద్ర క్రీడాశాఖ మంత్రి స్పందించాడు.

Will Team India play in Pakistan's hosts Champions Trophy? Anurag Thakur Responds
Author
Hyderabad, First Published Nov 17, 2021, 4:15 PM IST

వచ్చే పదేండ్ల కాలానికి గాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. 2024 నుంచి 2031 దాకా.. నాలుగు టీ20 ప్రపంచకప్పులు, రెండు వన్డే వరల్డ్ కప్పులు,  రెండు ఛాంపియన్స్  ట్రోఫీ లు జరుగనున్నాయి. ఈ మేరకు వేదికలను కూడా ఐసీసీ ప్రకటించింది. 14 దేశాలు ఈ టోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. తొలిసారిగా అమెరికా, నమీబియా లలో కూడా  అంతర్జాతీయ క్రికెట్ ఈవెంట్లు జరుగనున్నాయి.  ఇండియా కూడా ఓ ఛాంపియన్స్ ట్రోఫీ, టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్ లకు ఆతిథ్యం ఇవ్వనున్నది. అంతేగాక 2025 లో పాకిస్థాన్  ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహించనున్నారు. అయితే పాక్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీలో  ఇండియా పాల్గొంటుందా..? లేదా..? అనే ప్రశ్న తలెత్తుతున్నది. 

రెండు దేశాల మధ్య సంబంధాలు క్షీణించిన నేపథ్యంలో చాలాకాంలంగా ఇండియా-పాకిస్థాన్ ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. ఐసీసీ ఈవెంట్లలో మినహా  రెండు దేశాలు ముఖాముఖి తలపడింది లేదు. దీంతో అభిమానులకు ఐసీసీ టోర్నీలు  తప్ప ఇరు దేశాల మద్య రసవత్తర క్రికెట్ ఆస్వాదించే అవకాశం లేకుండా పోయింది. ఇదిలాఉండగా తాజాగా ఐసీసీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. 2025 లో  పాక్ లో జరిగే ఛాంపియన్స్ ట్రోఫీకి ఇండియా వెళ్తుందా..? లేదా..? అనే దానిపై  భారత కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. 

ఆ సమయం వచ్చినప్పుడు.. :

ఠాకూర్ మాట్లాడుతూ.. ‘ఆ సమయం వచ్చినప్పుడు భారత ప్రభుత్వం, హోం మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంటాయి. అంతర్జాతీయ సిరీస్ ల సమయంలో అన్ని విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. గతంలో కూడా చాలా దేశాలు భద్రతా కారణాల దృష్ట్యా పాక్ కు వెళ్లడానికి నిరాకరించాయి. పలువురు ఆటగాళ్లపై కూడా దాడులు జరిగిన విషయం మీకు తెలిసిందే. అదే ఇప్పుడు  మేము ఆందోళనచెందే విషయం..’ అని అన్నారు. 

 

రెండు దశాబ్దాల అనంతరం.. 

కాగా.. పాకిస్థాన్ కు రెండు దశాబ్దాల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ టోర్నీ నిర్వహించే అవకాశం దక్కింది.  చివరగా ఆ దేశం 1996 (వన్డే ప్రపంచకప్) నిర్వహించింది. ఆ తర్వాత పాక్ లో భారీ టోర్నీ జరుగలేదు. 2009 లో ఆ దేశ పర్యటనకు వెళ్లిన శ్రీలంక ఆటగాళ్లపై తీవ్రవాదులు దాడులు చేయడంతో  అంతర్జాతీయ క్రికెట్ దేశాలు పాకిస్థాన్ వంక చూడటమే మానేశాయి. ఇప్పుడిప్పుడే ఆ దేశంలో క్రికెట్ కు సంబంధించిన పురోగతి కనిపిస్తున్నది. ఇటీవల న్యూజిలాండ్  ఆ దేశ పర్యటనకు వచ్చి చివరి నిమిషంలో  హ్యాండ్ ఇచ్చినా..  వచ్చే ఏడాది మార్చిలో ఆస్ట్రేలియా మూడు ఫార్మాట్లలోనూ  సిరీస్ లు ఆడేందుకు పాకిస్థాన్ కు రానున్నది. ఇక 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కూడా పాకిస్థాన్ లో నిర్వహించనుండటం పాక్ క్రికెట్ కు శుభ పరిణామమే.

అదిరిపోయే ఆతిథ్యమిస్తాం.. : పీసీబీ 

ఇదే విషయమై పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా మాట్లాడుతూ.. ‘ఐసీసీ నిర్ణయం పట్ల చాలా సంతోషంగా ఉన్నాం. ఛాంపియన్స్  ట్రోఫీని పాక్ లో నిర్వహించడం ద్వారా ఐసీసీ  పీసీబీపై పూర్తి విశ్వాసం ప్రదర్శించింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీకి ప్రపంచ స్థాయి ఆతిథ్యమిస్తాం..’ అని  తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios