టీమ్ ఇండియా మాజీ పేసర్, కేరళ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్‌పై బీసీసీఐ విధించిన నిషేధం ఆదివారం (సెప్టెంబర్ 13)న ముగిసింది. 2013 ఐపీఎల్ సీజన్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తూ స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినట్లు శ్రీశాంత్‌తో పాటు అజిత్ చండీలా, అంకిత్ చవాన్‌లపై ఆరోపణలు రావడంతో బీసీసీఐ క్రమశిక్షణ కమిటీ వీరిపై జీవిత కాలం నిషేధం విధించింది.

వీరిలో శ్రీశాంత్ తన నిషేధంపై న్యాయపోరాటం చేయడంతో సుప్రీంకోర్టు బీసీసీఐ నిర్ణయంపై స్టే విధించింది. అంతే కాకుండా బీసీసీఐ నిర్ణయంపై సమీక్ష చేపట్టాలని ఆదేశించింది. ఈ మేరకు చేపట్టిన విచారణ అనంతరం డీకే జైన్ బీసీసీఐ విధించిన నిషేధాన్ని ఏడేళ్లకు పరిమితం చేయాలని ఆదేశించారు.

దీంతో సెప్టెంబర్ 13న నిషేధం ముగిసింది. నిషేధం ముగియడంతో శ్రీశాంత్ సోషల్ మీడియా వేదికగా సంతోషం వ్యక్తం చేశాడు.‘నాకు స్వేచ్ఛ లభించింది. మళ్లీ నేను మ్యాచ్‌లు ఆడేందుకు అనుమతి దొరికింది. వ్యక్తిగతంగానూ నాకు ఇది గొప్ప ఉపశమనం. మరో ఐదు నుంచి ఏడేళ్లు క్రికెట్ ఆడుతా. ఏ జట్టు తరఫున ఆడినా అత్యుత్తమ ప్రదర్శన కనబర్చేందుకు ప్రయత్నిస్తా’ అని ట్విట్టర్‌లో పేర్కొన్నాడు. రాబోయే రంజీ సీజన్‌లో శ్రీశాంత్‌ను కేరళ జట్టు తరపున ఆడించడానికి కేసీఏ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. కరోనా నేపథ్యంలో దేశవాళీ క్రికెట్ ఇంకా ప్రారంభం కాలేదు.