హైదరాబాద్: ఒక వారసత్వాన్ని నెలకొల్పడానికి ఆటగాళ్లను సిద్ధం చేయడానికి పాటు పడుతానని టీమీండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి అన్నారు. భవిష్యత్తులో ఇది ఇతర జట్లకు అనుసరణీయమవుతుందని ఆయన అన్నారు. 

కపిల్ దేవ్, అన్షుమన్ గైక్వాడ్, శాంతా రంగస్వామిలతో కూడిన తిసభ్య కమిటీ రవిశాస్త్రిని తిరిగి టీమిండియా హెడ్ కోచ్ గా ఎంపిక చేసింది. 2021 టీ20 ప్రపంచ కప్ పోటీల వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. ప్రస్తుతం ఆయన వెస్టిండీస్ లో ఉన్నారు. బిసిసిఐ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తనను ఎంపిక చేసిన కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. 

తనపై విశ్వాసం ఉంచి తనను తిరిగి ఎంపిక చేసినందుకు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రవిశాస్త్రి తెలిపారు. ఇది తనకు గర్వకారణమని అన్నారు. ఈ జట్టుపై తనకు విశ్వాసం ఉంది కాబట్టే తాను అందుకు సిద్ధపడ్డానని, ఈ జట్టు ఓ సంప్రదాయాన్ని నెలకొల్పుతుందని తనకు విశ్వాసం ఉందని, ఇతర జట్లు దాన్ని అనుసరించి ప్రయత్నిస్తారనే నమ్మకం ఉందని ఆయన అన్నారు. 

అది తన కోరిక అని, తాము సరైన దారిలోనే ఉన్నామని, యువకులు ముందుకు వస్తున్న ప్రస్తుత తరుణంలో మెరుగు పరుచుకోవడానికి కావాల్సిన వెసులుబాటు ఉందని, సమీప భవిష్యత్తులో ఉత్సాహభరితమైన స్థితి ఉంటుందని ఆయన అన్నారు. 

అన్ని విభాగాల్లో మెరుగైన ప్రదర్శన కోసం తాను, తన జట్టు కృషి చేస్తుందని, తప్పిదాల నుంచి నేర్చుకుంటామని రవిశాస్త్రి అన్నారు ప్రతీ తప్పు నుంచి నేర్చుకోవాల్సి ఉంటుందని, ఎవరు కూడా పూర్తి పర్ఫెక్ట్ గా ఉండరని, నైపుణ్యం కోసం కృషి చేస్తూ ఉంటే ఫలితాలు వస్తాయని ఆయన అన్నారు. 

జట్టు అద్భుతమైన నిలకడైన ప్రదర్శన కనబరుస్తోందని, గత రెండేళ్ల ప్రదర్శనను గమనిస్తే అద్భుతమని అనిపించకమానదని, ఓ బార్ ను సెట్ చేశారని, దాన్ని పెంచాల్సి ఉందని అన్నారు. ప్రయోగాలకు వెనకాడబోమని, యువతకు అకాశం కల్పిస్తామని, ప్రయోగాలకు వెసులుబాటు ఉందని రవిశాస్త్రి అన్నారు. 

గత నాలుగైదేళ్లలో ఫీల్డింగ్ ను జట్టు చాలా మెరుగుపరుుచకుందని, ప్రపంచంలోనే మేటి ఫీల్డింగ్ సైడ్ గా తీర్చుదిద్దుతానని ఆయన అన్నారు. తన పదవీకాలం ముగిసే లోగా జట్టును సంతోషదాయకమైన స్థితిలో ఉంచుతానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తన పదవీకాలం ముగిసే లోగా మరో ముగ్గురు, నలుగురు బౌలర్లను అందిస్తానని అన్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లోనూ టెస్టు క్రికెట్ లోనూ ఇబ్బంది కలిగించిన మార్పులను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.