WI vs IND T20I: వెస్టిండీస్‌తో ఇటీవలే ముగిసిన మూడు మ్యాచుల వన్డే సిరీస్ ను 3-0తో క్లీన్ స్వీప్ చేసిన భారత్ ఇప్పుడు టీ20లపై దృష్టి పెట్టింది. ఐదు మ్యాచుల సిరీస్ లో భాగంగా తొలి టీ20లో భారత్ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు రానుంది.
ఈ ఏడాది అక్టోబర్ లో జరుగబోయే టీ20 ప్రపంచకప్ కు ముందు భారత్ ఆడబోతున్న అతి పెద్ద సిరీస్ (మ్యాచుల పరంగా) లో ఇండియా-వెస్టిండీస్ టీ20 సిరీస్ ఒకటి. కచ్చితంగా ప్రపంచకప్ ను దృష్టిలో ఉంచుకునే ఎంపిక చేసిన జట్టుతో భారత్ ప్రయోగాలు చేస్తున్నది. ఈ క్రమంలో విండీస్ తో జరుగుతున్న ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో భాగంగా.. శుక్రవారం ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరుగుతున్న తొలి టీ20లో భారత జట్టు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు రానుంది. వెెస్టిండీస్ సారథి పూరన్ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నాడు. తొలి మ్యాచ్ లో గెలిచి సిరీస్ లో బోణీ కొట్టాలని భారత్ భావిస్తుండగా.. వన్డే లలో ఎదురైన పరాభవానికి బదులు తీర్చుకునేందుకు విండీస్ సిద్ధమైంది.
ఈ మ్యాచ్ కోసం భారత సీనియర్ ఆటగాళ్లు తుది జట్టుతో చేరారు. టీ20లు ఆడతాడో లేదోననే అనుమానంలో ఉన్న రవీంద్ర జడేజా తిరిగి జట్టుతో చేరగా స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్ ను కాదని రవిబిష్ణోయ్, అశ్విన్ లకు తుది జట్టులో చోటు కల్పించారు. దీపక్ హుడాకు చోటు దక్కలేదు.
విండీస్ తో మూడు వన్డేలలో మాదిరిగానే టీ20లలో కూడా ఆ జట్టును ఓడించేందుకు భారత్ ప్రణాళికలు సిద్ధం చేసింది. బ్యాటింగ్, బౌలింగ్ లో ఇరు జట్లూ ఎవరికివారే ప్రత్యేకమైన ఆటగాళ్లతో ఉన్నాయి. కానీ వన్డేలతో పోల్చితే టీ20లలో విండీస్ ప్రత్యేకం. ఈ ఫార్మాట్ కు అచ్చు గుద్దినట్టు సరిపోయే ఆటగాళ్లు ఆ జట్టులో ఒకటో స్థానం నుంచి పదో స్థానం వరకు ఉన్నారు. దీంతో భారత్ కు విభిన్న సవాలు ఎదుర్కోనుంది.
బ్యాటింగ్ తో బ్రాండన్ కింగ్, నికోలస్ పూరన్, కైల్ మేయర్స్ తో పాటు ఈ సిరీస్ కోసం హిట్టర్ షిమ్రన్ హిట్మెయర్ నూ బరిలోకి దింపుతున్నది భారత్. వాళ్లే గాక రొవ్మన్ పావెల్, ఒడియన్ స్మిత్, జేసన్ హోల్లర్, అకీల్ హుస్సేన్, రొమారియా షెపర్డ్ లు కూడా బాదుడే బ్యాచే. మరి వీరిని భారత బౌలర్లు ఏమేరకు నిలువరించగలరనేది ఆసక్తికరం. వన్డేలతో పోల్చితే టీ20లలో తమిది బలమైన జట్టు అని టీ20 సిరీస్ లో టీమిండియాను ఓడిస్తామని ఇప్పటికే విండీస్ జట్టు సారథి నికోలస్ పూరన్ హెచ్చరికలు జారీ చేశాడు.
తుది జట్లు :
ఇండియా : రోహిత్ శర్మ, రిషభ్ పంత్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్, రవీంద్ర జడేజా, రవి బిష్ణోయ్, అశ్విన్ భువనేశ్వర్, అర్ష్‌దీప్ సింగ్
వెస్టిండీస్ : షమ్రా బ్రూక్స్, షిమ్రన్ హెట్మెయర్, నికోలస్ పూరన్ (కెప్టెన్), రొవ్మన్ పావెల్, కైల్ మేయర్స్, ఒడియన్ స్మిత్, జేసన్ హోల్డర్, అకీల్ హోసెన్, అల్జారీ జోసెఫ్, ఒబెడ్ మెక్‌కాయ్, కీమో పాల్
