WI vs IND T20I Live: కెప్టెన్ రోహిత్ శర్మ, దినేశ్ కార్తీక్ మెరుపులతో బ్యాటింగ్ లో అదరగొట్టిన భారత జట్టు.. బౌలింగ్ లోనూ విండీస్ కు చుక్కలు చూపింది. భారత బౌలర్ల ధాటికి టీ20 స్పెషలిస్టులుగా పేరున్న ఏ ఒక్క విండీస్ బ్యాటర్ కూడా క్రీజులో నిలువలేకపోయాడు.
వెస్టిండీస్ తో ఇటీవలే వన్డే సిరీస్ ను ఘనంగా ముగించిన భారత్.. టీ20 సిరీస్ ను అదే ఉత్సాహంతో ప్రారంభించింది. ట్రినిడాడ్ లోని బ్రియాన్ లారా స్టేడయం వేదికగా జరిగిన తొలి టీ20లో విండీస్ ను చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసి 6 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసిన భారత జట్టు.. అనంతర కరేబియన్ జట్టును 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 122 పరుగులకే పరిమితం చేసింది. ఫలితంగా భారత్ 68 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత బౌలర్లు సమిష్టిగా రాణించడంతో టీ20 స్పెషలిస్టులుగా పేరున్న విండీస్ వీరులు తలొంచక తప్పలేదు. భారత స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, బిష్ణోయ్ లు విండీస్ టాపార్డర్ ను చుట్టేశారు.
191 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో విండీస్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లో కైల్ మేయర్స్ రెండు బౌండరీలు బాదాడు. అదే ఊపులో అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్లో తొలి బంతిని సిక్సర్ గా మలిచి, తర్వాత బంతినే ఫోర్ కొట్టాడు. కానీ మూడో బంతికి భువనేశ్వర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
ఇక వన్ డౌన్ లో జేసన్ హోల్డర్ ను బ్యాటింగ్ కు పంపిన విండీస్ ప్రయోగం వికటించింది. రవీంద్ర జడేజా వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్ చివరిబంతికి హోల్డర్ బౌల్డ్ అయ్యాడు. తన రెండో ఓవర్లో భువీ.. విండీస్ కు మరో షాకిచ్చాడు. ఐదో ఓవర్ రెండో బంతికి బ్రూక్స్ (20) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. వస్తూనే సిక్సర్, ఫోర్ కొట్టిన విండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ (18, 1 ఫోర్, 1 సిక్స్)ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. దీంతో 9 ఓవర్లకే విండీస్.. 4 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది.
ఆ క్రమంలో ఆదుకుంటారనుకున్న రొవ్మన్ పావెల్ (14) కూడా రవి బిష్ణోయ్ వేసిన 11.1 ఓవర్లో క్లీన్ బౌల్డ్ కాగా.. విండీస్ భారీ ఆశలు పెట్టుకున్న షిమ్రన్ హెట్మెయర్ (14) కూడా అశ్విన్ బౌలింగ్ లో సూర్యకుమార్ యాదవ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో విండీస్ ఆశలు ఆవిరయ్యాయి.
ఒడియన్ స్మిత్ (0) ను బిష్ణోయ్ ఔట్ చేశాడు. చివర్లో వచ్చిన అకీల్ హోసెన్ (11) ను అర్షదీప్ సింగ్ పెవిలియన్ కు పంపాడు. అకీల్, కిమో పాల్ (19 నాటౌట్), అల్జారీ జోసెఫ్ (5 నాటౌట్) లు విండీస్ ఆలౌట్ కాకుండా కాపాడినా ఆ జట్టు ఓటమిని తప్పిచలేకపోయారు.
భారత బౌలర్లలో అశ్విన్, అర్ష్‌దీప్, రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా, జడేజా, భువీ తలా ఒక వికెట్ పడగొట్టారు. ఈ విజయంతో ఐదు మ్యాచుల సిరీస్ లో భారత్ 1-0తో ఆధిపత్యంలో ఉంది. ఆదివారం (జులై 31న) ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్ జరగాల్సి ఉంది.
అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. నిర్ణీత 20 ఓవర్లలో 190 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ (64) రాణించాడు. మిడిలార్డర్ విఫలమైనా దినేశ్ కార్తీక్ (19 బంతుల్లో 41 నాటౌట్) మెరుపులు మెరిపించాడు.
