WI vs IND ODI: విండీస్ తో మూడో వన్డేలో వర్షం ఇరు జట్లతో దోబూచులాడుతోంది. ఇప్పటికే వర్షం కారణంగా గంటన్నర పాటు ఆట వర్షార్పణం అయింది.  దీంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ ను నిర్వహించనున్నారు.

వెస్టిండీస్ తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు దంచికొట్టింది. 24 ఓవర్ల తర్వాత ఆటకు వర్షం అంతరాయం ఏర్పరిచింది. వర్షం వల్ల సుమారు గంటన్నర పాటు ఆట ఆగింది. తిరిగి ప్రారంభమయ్యాక భారత జట్టు భారీ షాట్లతో పరుగుల వర్షం కురిపించింది. భారీ స్కోరు దిశగా కదులుతున్న తరుణంలో 36 ఓవర్ల తర్వాత మరోసారి వాన పలకరించింది. దీంతో అంపైర్లు మరోసారి ఆటను తాత్కాలికంగా నిలిపేశారు. ఆట ఆగిపోయే సమయానికి భారత జట్టు 36 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. శుభమన్ గిల్ (98 బంతుల్లో 98 నాటౌట్, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉన్నాడు. సంజూ శాంసన్ (6 నాటౌట్) క్రీజులో ఉన్నాడు.అయితే కొద్దిసేపటి క్రితమే వర్షం ఆగిపోవడంతో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్ విజేతను తేల్చనున్నారు. ఈ క్రమంలో విండీస్.. 35 ఓవర్లలో 257 పరుగులు చేయాల్సి ఉంది. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన టీమిండియాకు ఓపెనర్ శిఖర్ ధావన్ (74 బంతుల్లో 58, 7 ఫోర్లు), శుభమన్ గిల్ లు శుభారంభం అందించారు. హోల్డర్ వేసిన తొలి ఓవర్లో ఫోర్ తో ఖాతా తెరిచాడు ధావన్. గిల్ కూడా సీల్స్ వేసిన రెండో ఓవర్లో ఫోర్ తోనే ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఇద్దరూ కలిసి విండీస్ పేసర్లను సమర్థంగా ఎదుర్కున్నారు. 

సింగిల్స్ తీస్తూ మధ్యలో వీలు చిక్కినప్పుడు ఫోర్లు కొట్టిన ఈ జోడీ 10 ఓవర్లలో 45 పరుగులు చేసింది. అయితే రన్ రేట్ మరీ తక్కువగా ఉండటంతో ధావన్.. హోల్డర్ వేసిన 11వ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. హెడెన్ వాల్ష్ వేసిన 15వ ఓవర్లో గిల్.. 6, 4 కొట్టాడు. కీమో పాల్ వేసిన 18వ ఓవర్లో చివరిబంతికి డబుల్ తీసిన ధావన్ కెరీర్ లో 37వ అర్థ సెంచరీ చేసుకున్నాడు. ఈ సిరీస్ లో అతడికి ఇది రెండో హాఫ్ సెంచరీ.

ఇదే ఊపులో గిల్ కూడా 21వ ఓవర్లో చివరి బంతికి సింగిల్ తీసి రెండో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే తర్వాత హెడెన్ వాల్ష్ వేసిన 23వ ఓవర్లో ధావన్ నికోలస్ పూరన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో 113 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. 

Scroll to load tweet…

ధావన్ నిష్క్రమించిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ (34 బంతుల్లో 44, 4 ఫోర్లు, 1 సిక్సర్) క్రీజులోకి వచ్చాడు. అతడు వచ్చాక రెండు ఓవర్ల తర్వాత ఆటకు వరుణుడు అంతరాయం కలిగించాడు. సుమారు గంటన్నర పాటు వరుణుడు శాంతించకపోవడంతో పాటు ఔట్ ఫీల్డ్ తడిగా ఉండటంతో మ్యాచ్ జరుగుతుందా..? లేదా..? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ వర్షం పోయి తిరిగి సూర్యుడు రావడంతో గ్రౌండ్ సిబ్బంది ఊపిరిపీల్చుకున్నారు. అయితే సుమారు రెండు గంటల వాన కారణంగా మ్యాచ్ ను 40 ఓవర్లకు కుదించారు. 

మ్యాచ్ లో పది ఓవర్లకు తగ్గించిన నేపథ్యంలో తిరిగి క్రీజులోకి వచ్చిన గిల్, శ్రేయాస్ లు బ్యాట్ కు పనిచెప్పారు. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించాలనే లక్ష్యంతో ఎడాపెడా బాదారు. వర్షం వెలిశాక ఇన్నింగ్స్ 24వ ఓవర్ వేసిన హెడెన్ వాల్ష్ బౌలింగ్ లో శ్రేయాస్.. రెండు సిక్సర్లు, ఓ ఫోర్ బాది 18 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత సీల్స్ వేసిన 25వ ఓవర్లో కూడా అయ్యర్ ఒకటి, గిల్ రెండు ఫోర్లు బాదాడు. దీంతో స్కోరు వేగం రాకెట్ లా దూసుకెళ్లింది. అయితే ఈ క్రమంలో భారత్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. ధాటిగా ఆడిన శ్రేయాస్ అయ్యర్.. అకీల్ హోసెన్ బౌలింగ్ లో కీమో పాల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. గత రెండు వన్డేలలో విఫలమైన సూర్యకుమార్ యాదవ్ (8) మరోసారి నిరాశపరిచాడు.

సెంచరీ ముంగిట గిల్.. మళ్లీ వరుణుడు

వరుణుడు కరుణించాక క్రీజులోకి వచ్చిన గిల్ ధాటిగా ఆడాడు. హోల్డర్ వేసిన 30వ ఓవర్లో ఫోర్ తో 80లలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత సింగిల్స్ తో 90లలోకి చేరిన గిల్.. ఒక్కో పరుగు జతకూడుతూ సెంచరీకి రెండు పరుగుల దూరంలో ఉండగా మళ్లీ వర్షం వచ్చింది. దీంతో అంపైర్లు ఆటను మళ్లీ నిలిపేశారు. కానీ అరగంట తర్వాత మళ్లీ వరుణుడు శాంతించాడు. దీంతో డక్వర్త్ లూయిస్ ప్రకారం విజేతను నిర్ణయించనున్నారు. దీని ప్రకారం వెస్టిండీస్ జట్టు.. 35 ఓవర్లలో 257 పరుగులు చేయాల్సి ఉంది.