West Indies vs England: ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ లో దారుణ పరాజయంతో సర్వత్రా విమర్శలు ఎదుర్కుంటున్న ఇంగ్లాండ్ జట్టు.. ఇప్పుడు వెస్టిండీస్ మీద కూడా ఓడింది. ప్రపంచ ఛాంపియన్లమని చెప్పుకుంటున్న రూట్ సేన.. అంతగా స్టార్లు లేని విండీస్ మీద కూడా..
ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా మింగుడుపడని వార్తే.. పటిష్టమైన ఆస్ట్రేలియాతో జరిగిన యాషెస్ సిరీస్ లో 4-0తో ఆ జట్టు ఓటమిని ఇంకా మరిచిపోకముందే ఆ జట్టుకు మరో అవమానకర సిరీస్ ఓటమి ఎదురైంది. ఆసీస్ తో పోల్చితే అంత పటిష్టమైన జట్టు కాని వెస్టిండీస్ చేతిలో కూడా ఇంగ్లాండ్ కు పరాభవం తప్పలేదు. విండీస్ తో జరిగిన మూడో టెస్టులో ఆతిథ్య జట్టు.. పర్యాటక జట్టుపై ఏకంగా పది వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ ను 1-0తో కైవసం చేసుకుంది. జట్టు నిండా ఆల్ రౌండర్లు, భీకర బౌలింగ్ దాడి, ప్రపంచ స్టార్ బ్యాటర్లు ఉన్న ఇంగ్లాండ్.. విండీస్ చేతిలో కూడా ఓడిపోవడాన్ని ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోవడం లేదు. ఆ జట్టు కెప్టెన్ జో రూట్ ఎంత త్వరగా దిగిపోతే అంత మంచిదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెస్టిండీస్ లోని గ్రెనెడలో సెయింట్ జార్జ్ లో గల నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మూడో, నిర్ణయాత్మక టెస్టులో ఇంగ్లాండ్ రెండు ఇన్నింగ్సులలో దారుణంగా విఫలమైంది. తొలి ఇన్నింగ్స్ లో 204 పరుగులకే ఆలౌట్ అయిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్ లో 120 రన్స్ కే చేతులెత్తేసింది.
ఇక తొలి ఇన్నింగ్స్ లో 297 పరుగులు చేసిన విండీస్.. రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ నిర్దేశించిన 27 పరుగుల లక్ష్యాన్ని ఆడుతూ పాడుతూ సాధించింది. నాలుగు రోజుల్లోనే టెస్టును ముగించి సిరీస్ ను 1-0తో గెలుచుకుంది. అంతకుముందు రెండు టెస్టులు డ్రా గా ముగిసిన విషయం తెలిసిందే.
కాగా.. ఆస్ట్రేలియాతో పాటు విండీస్ లో కూడా టెస్టు సిరీస్ లు కోల్పోవడంతో ఆ జట్టు సారథి జో రూట్ పై అభిమానులు మండిపడుతున్నారు. ఇంగ్లాండ్ జట్టుకు రూట్ చేసిన సేవలు చాలని, ఇకనైనా దిగిపోతే మంచిదని ఆ జట్టు మాజీ ఆటగాళ్లు, అభిమానులు సూచిస్తున్నారు. ‘నువ్వో చెత్త కెప్టెన్ వి. ఇంకెన్ని సిరీస్ లు ఓడతావు. ఇక నీ సేవలు చాలు. దయచేసి కెప్టెన్ పదవి నుంచి వైదొలుగు...’అని సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ చేస్తున్నారు.
ఇదిలాఉండగా జట్టును ప్రక్షాళణ చేయాలని యాషెస్ సిరీస్ తర్వాతే ఆ జట్టు దిగ్గజాలు కొంతమందిని ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ను కోరినా.. బోర్డు మాత్రం వేచి చూసే ధోరణి ప్రదర్శించింది. అయితే తాజాగా విండీస్ సిరీస్ లో కూడా ఓడటంతో ఇక రూట్ ను సాగనంపాల్సిందేనని ఈసీబీ కూడా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.
ఇక విండీస్ లో ఐదు టీ20లు, మూడు టెస్టులు ఆడేందుకు కరేబియన్ దేశానికి వెళ్లిన ఇంగ్లాండ్.. ఉత్తచేతులతోనే తిరిగివస్తున్నది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ను 3-2తో గెలుచుకున్న విండీస్.. టెస్టు సిరీస్ ను 1-0తో సాధించింది.
