Asianet News TeluguAsianet News Telugu

ఓరి మీ దుంపల్తెగ నామీద పడ్డారేంట్రా బాబు..! దీప్తి శర్మ ‘రనౌట్' వ్యవహారం తర్వాత ట్రెండ్ అవుతున్న అశ్విన్

INDW vs ENGW: టీమిండియా మహిళా స్పిన్నర్ దీప్తి శర్మ ఇంగ్లాండ్ బ్యాటర్ చార్లీ డీన్ ను నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ‘రనౌట్’ ద్వారా ఔట్ చేసిన తర్వాత ఆశ్చర్యకరంగా ట్విటర్ లో రవిచంద్రన్ అశ్విన్ ట్రెండ్ అవుతున్నాడు. 
 

Why The Hell are you Trending me: Ravichandran Ashwin Asks Twitter After He Trends with Deepthi Sharma
Author
First Published Sep 25, 2022, 4:05 PM IST

ఇండియా-ఇంగ్లాండ్ మధ్య శనివారం లార్డ్స్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో  టీమిండియా స్పిన్నర్ దీప్తి శర్మ.. ఆతిథ్య జట్టు బ్యాటర్ చార్లీ డీన్ ను రనౌట్ చేసిన విషయం తెలిసిందే.  నాన్ స్ట్రయికర్ ఎండ్ లో ఉన్న డీన్.. ముందుకు వెళ్లడం గమనించిన దీప్తి ఆమెను రనౌట్ చేసింది. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో ప్రత్యక్షమైన తర్వాత ఈ మ్యాచ్ తో సంబంధమే లేని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ట్విటర్ లో  ట్రెండ్ అయ్యాడు. దీప్తి శర్మతో కలిసి అశ్విన్ కూడా ట్రెండింగ్ లోకి వచ్చాడు.

అయితే ఈ మ్యాచ్ తో అశ్విన్ కు ఏం సంబంధం లేకున్నా.. ఈ తరహా రనౌట్ కు అతడు పెట్టింది పేరు. ఐపీఎల్ లో  రాజస్తాన్ రాయల్స్ బ్యాటర్ జోస్ బట్లర్ ను ఓసారి ఇలాగే ఔట్ (అప్పుడు దీనిని మన్కడింగ్ అని పిలిచారు) చేయడం వివాదాస్పదమైన విషయం తెలిసిందే.  తాజాగా దీప్తి కూడా డీన్ ను ఇలాగే ఔట్ చేసింది. 

దీప్తిని లేడీ అశ్విన్ గా పోల్చుతూ ట్విటర్ లో ట్వీట్స్ వెళ్లువెత్తాయి. అశ్విన్  బట్లర్ ను ఔట్ చేసినప్పటి ఫోటోలు, దీప్తి శర్మ తాజా రనౌట్ ఫోటోలను జతచేస్తూ మీమ్స్ హోరెత్తాయి. ఇదిలాఉండగా ట్విటర్ లో తాను ట్రెండ్ అవడం తెలుసుకున్న అశ్విన్..  ఓ ఫన్నీ ట్వీట్ చేశాడు. 

 

అశ్విన్ స్పందిస్తూ.. ‘అదేంటి..? మీరు అశ్విన్ ను  ట్రెండ్ చేస్తున్నారు..? ఈరాత్రి  మరో బౌలింగ్ హీరో ఉంది. ఆమె పేరు దీప్తి శర్మ..’ అని ట్వీట్ లో రాసుకొచ్చాడు. అశ్విన్ చేసిన ఈ ట్వీట్ నవ్వులు పూయిస్తున్నది.

ఇక దీప్తి శర్మ రనౌట్ వ్యవహారంపై కారాలు మిరియాలు నూరుతున్న ఇంగ్లాండ్ ఆమెను దోషిగా నిలబెట్టే ప్రయత్నం  చేస్తున్నది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ వికెట్ కీపర్ సామ్ బిల్లింగ్స్ ట్విటర్ లో ఆ ఔట్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ.. ‘ఇలా చేస్తే జేమ్స్ అండర్సన్ కు ఇంకెన్ని వికెట్లు పడతాయో ఊహించండి..’ అని  ట్వీట్ చేశాడు. దానికి అశ్విన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు. ‘అసలు  ఇలా తీసిన వికెట్లను  రనౌట్ ద్వారా కాకుండా  బౌలర్ కు ఇవ్వడమనేది  చాలా గొప్ప ఆలోచన.  ఐసీసీ దీనిమీద ఆలోచించాలి..’ అని దిమ్మతిరిగే రిప్లై ఇచ్చాడు. ఇదే విషయమై సామ్ బిల్లింగ్స్, జేమ్స్ అండర్సన్ చేసిన పోస్టులకు  టీమిండియా ఫ్యాన్స్ కూడా అదిరిపోయే కౌంటర్లు ఇస్తున్నారు. 

 

ఈ మ్యాచ్ లో భారత్ నిర్దేశించిన 170 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  అప్పటికే టాపార్డర్, మిడిలార్డర్ బ్యాటర్లు విఫలం కావడంతో  చివరి వరుస బ్యాటర్లతో డీన్  (80 బంతుల్లో 47, 5 ఫోర్లు) ఇంగ్లాండ్ ను విజయానికి  చేరువ చేసింది. 

 

44వ ఓవర్ ను వేయాల్సిందిగా హర్మన్‌ప్రీత్ కౌర్.. దీప్తి శర్మకు బంతినిచ్చింది. ఆ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసిన డీన్.. నాన్ స్ట్రైకింగ్ ఎండ్ కు వెళ్లింది.  మూడో బంతిని వేయబోయిన దీప్తి.. డీన్  నాన్ స్ట్రైకర్ ఎండ్ నుంచి చాలా ముందుకు జరగడాన్ని గ్రహించింది. దీంతో వెంటనే బంతిని విసరడం ఆపి   వికెట్లను గిరాటేసింది. అంపైర్లు దీనిని థర్డ్ అంపైర్ కు రిఫర్ చేశారు. అయితే రివ్యూలో దీప్తి.. బౌలింగ్ యాక్షన్ ను పూర్తి చేసిన తర్వాతే వికెట్లను గిరాటేసినట్టు తేలింది. దీంతో థర్డ్ అంపైర్ దానిని అవుట్ గా ప్రకటించాడు.   

Follow Us:
Download App:
  • android
  • ios