Asianet News TeluguAsianet News Telugu

Kiran Navgire: ఎవరీ కిరణ్ నవ్గిరె..? ఉమెన్స్ టీ20 లో ఫాస్టెస్ట్ ఫిఫ్టీ చేసిన బ్యాటర్ గురించి ఆసక్తికర విషయాలు

Women's T20 Challenge 2022: ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ - 2022 లో భాగంగా మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న మ్యాచ్ ల ద్వారా బీసీసీఐకి లాభమొచ్చిందో నష్టమే వచ్చిందో గానీ భారత క్రికెట్ కు మాత్రం  ఒక మట్టిలో మాణిక్యం దొరికింది. 

Who is Kiran Navgire Who Smashed Fastest 50 in WT20 Challenge 2022, Check Interesting Facts about Her
Author
India, First Published May 27, 2022, 12:35 PM IST

ఐపీఎల్ ద్వారా భారత క్రికెట్ కు ఎంతోమంది యువ క్రికెటర్లు పరిచయమవుతున్నారు. వీరిలో  భాగా రాణించినవారు నిలదొక్కుకుంటే  ఒక్క సీజన్ లో భాగా ఆడగానే డబ్బులు రావడంతో ఆటను పక్కనబెట్టిన వాళ్లు కనుమరుగైపోతున్నారు. ఈ విధంగానే మహిళల క్రికెట్ లో ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ కూడా భారత  జట్టుకు  మేలు చేకూరుస్తున్నదనే చెప్పొచ్చు. మహారాష్ట్ర లోని పూణె వేదికగా జరుగుతున్న ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లో మట్టిలో మాణిక్యాలు బయటకు వస్తున్నాయి. ఆ జాబితాలో అగ్రభాగాన ఉండే పేరు  కిరణ్ నవ్గిరె. గురువారం వెలోసిటీ-ట్రయల్ బ్లేజర్స్ తో  జరిగిన మ్యాచ్ లో  నవ్గిరె విధ్వంసం చూసి తీరాల్సిందే. ఆ ఇన్నింగ్స్ మిస్ అయితే క్రికెట్ అభిమానులు కచ్చితంగా ఒక గొప్ప ఇన్నింగ్స్ మిస్ అయినట్టే అన్నట్టుగా సాగింది ఆమె విధ్వంసం. 

ట్రయల్ బ్లేజర్స్ నిర్దేశించిన 191 పరుగుల లక్ష్య ఛేదనలో మ్యాచ్ గెలవకపోయినా కనీసం 159 పరుగులు చేస్తే మెరుగైన నెట్ రన్ రేట్ తో వెలోసిటీ  ఫైనల్ కు చేరే అవకాశముంది. ఆ క్రమంలో వన్ డౌన్ లో బ్యాటింగ్ వచ్చిన నవ్గిరె.. ఆకాశమే హద్దుగా చెలరేగింది. 34 బంతుల్లోనే 69 పరుగులు చేసి వెలోసిటీ ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె ఇన్నింగ్స్ లో 5 ఫోర్లు, 5 సిక్సర్లున్నాయి. 

ఎవరీ నవ్గిరె..?

మహారాష్ట్ర లోని షోలాపూర్ నవ్గిరె స్వస్థలం. ఆమె తండ్రి ఒక మధ్య తరగతి రైతు. తల్లి హౌస్ వైఫ్. ఇద్దరు అన్నల ముద్దుల చెల్లెలు నవ్గిరె. క్రికెట్ ఆడటాని కంటే ముందు ఆమె..  అథ్లెట్ కూడా. జావెలిన్ త్రో, షాట్ పుట్, రన్నింగ్ లలో ప్రావీణ్యముంది. కానీ క్రికెట్ లో ఆసక్తి పెంచుకున్న  నవ్గిరె.. వాటిని వదిలి పూర్తిగా  దాని మీదే దృష్టి పెట్టింది. గ్రాడ్యూయేషన్ చదువుతున్న(2013-14) సమయంలో  పూణెలోని సావిత్రి భాయి ఫూలే యూనివర్సిటీ తరఫున ఆడి గుర్తింపు సాధించింది.  అప్పుడు ఆమెకు సరైన శిక్షణ కూడా లేదు. అప్పట్నుంచి ఆమె క్రికెట్ నే తన కెరీర్ గా ఎంచుకుంది. 

2016 నుంచి నవ్గిరె  పూర్తిగా క్రికెట్ లోనే కొనసాగాలని నిశ్చయించుకుంది. 2018-19 సీనియర్ ఉమెన్స్ వన్డే లీగ్ లో మహారాష్ట్ర తరఫున ఆడింది.  కానీ  ఆ తర్వాత ఆమెకు రాష్ట్ర జట్టులో పెద్దగా అవకాశాలు రాకపోవడంతో  నాగాలాండ్ తరఫున ఆడేందుకు వెళ్లింది.  ఈ ఏడాది ఏప్రిల్ లో గువహతి లో అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఆమె 76 బంతుల్లోనే 162 పరుగులు చేసింది. ఒక టీ20 ఇన్నింగ్స్ లో 150 ప్లస్ స్కోర్ చేసిన తొలి భారత  (పురుషుల, మహిళల) క్రికెటర్ గా రికార్డులకెక్కింది. 

ధోనికి పెద్ద ఫ్యాన్.. 

నవ్గిరె టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనికి పెద్ద ఫ్యాన్.  ఎంత ఒత్తిడిలోనైనా కూల్ గా ఉండే ధోని నుంచి  తాను చాలా నేర్చుకున్నానని ఆమె పదే పదే చెబుతూ ఉంటుంది. ధోని లాగా సిక్సర్లు కొట్టడం అంటే తనకు ఇష్టమని, 2011 వన్డే వరల్డ్ కప్ లో ధోని సిక్సర్ కొట్టి ప్రపంచకప్ అందించినట్టు తాను కూడా  జాతీయ జట్టు తరఫున  అలా ఆడాలని కోరుకుంటున్నట్టు తెలిపింది. ధోని తనకు స్పూర్తినిచ్చాడని చెప్పిన నవ్గిరె.. ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ లో ఆడిన తొలి మ్యాచ్ లో ఎదుర్కున్న తొలి బంతికే సిక్సర్ కొట్టడం గమనార్హం.  

 

ఫాస్టెస్ట్ ఫిఫ్టీ.. 

ఉమెన్స్ టీ20 ఛాలెంజ్  లో ఆడిన తొలిమ్యాచ్ లోనే  ఆకట్టుకున్న నవ్గిరె పలు రికార్డులను కూడా నెలకొల్పింది. ఈ లీగ్ లో అత్యంత వేగంగా అర్థ సెంచరీ సాధించిన  బ్యాటర్ గా రికార్డులకెక్కింది. ట్రయల్ బ్లేజర్స్ బౌలర్ల బౌలింగ్ ను తుత్తునీయలు చేస్తూ.. 25 బంతుల్లోనే ఆమె అర్థ సెంచరీ చేసింది. అంతకుముందు ఈ రికార్డు షఫాలీ వర్మ (30 బంతుల్లో) పేరిట ఉండేది. 

 

దేశవాళీలో నిలకడగా రాణిస్తున్న నవ్గిరెను టీమిండియాలోకి ఎంపిక చేయాలని ఆమె ఇన్నింగ్స్ చూసిన తర్వాత ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరి సెలెక్టర్లు ఏం చేస్తారో..? 

Follow Us:
Download App:
  • android
  • ios