భారత క్రికెట్ లో దిగ్గజ ఆటగాళ్లైన సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే వంటి వారినే ఫామ్ కోల్పోతే పక్కనబెట్టారని.. కానీ ప్రస్తుతం ఆ పరిస్థితులు జట్టులో కనిపించడం లేదంటున్నాడు వెంకటేశ్ ప్రసాద్.
కొద్దిరోజలుగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తో పాటు సెలక్టర్లు వ్యవహరిస్తున్న తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫామ్ లో లేని ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించకుండా రెస్ట్ పేరిట వారిని కొనసాగించడంపై విమర్శకులు, మాజీ క్రికెటర్లు, క్రికెట్ పండితులు బీసీసీఐ తీరును ఎండగడుతున్నారు. తాజాగా ఇదే విషయమై భారత మాజీ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ కూడా స్పందించాడు. గతంలో దిగ్గజ ఆటగాళ్లైన సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే వంటివారిని కూడా ఫామ్ కోల్పోతే పక్కనబెట్టారని, కానీ ఇప్పుడు జరుగుతున్నది అందుకు విరుద్ధంగా ఉందని ఆయన గుర్తు చేశాడు.
ఇటీవలే స్వదేశంలో జరిగిన సఫారీ సిరీస్ తో పాటు త్వరలో జరుగనున్న వెస్టిండీస్ సిరీస్ లో కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో పాటు ఇతర సీనియర్లకు విశ్రాంతినివ్వడంపై వెంకటేశ్ ప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
ట్విటర్ వేదికగా వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘గతంలో ఫామ్ కోల్పోతే జట్టు నుంచి తొలగించేవాళ్లు. వాళ్ల పేరు, ప్రతిష్టను పట్టించుకోకుండా వారిని జట్టు నుంచి తప్పించేవాళ్లు. భారత క్రికెట్ లో దిగ్గజాలుగా పేరొందిన సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ లు కూడా ఇలా ఫామ్ కోల్పోతే జట్టు నుంచి తొలగించబడ్డవారే.
దాంతో వాళ్లు దేశవాళీ క్రికెట్ ఆడి తిరిగి ఫామ్ ను అందుకుని జాతీయ జట్టుకు వచ్చేవాళ్లు. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఫామ్ కోల్పోయిన ఆటగాడిని జట్టు నుంచి తీసేయడం మానేసి వాళ్లకు విశ్రాంతినిస్తున్నారు. సరే.. విశ్రాంతి ముగిశాక తిరిగి జట్టుతో చేరేవాళ్లు మళ్లీ బాగా ఆడుతున్నారా..? అంటే అదీ లేదు. దేశంలో ప్రతిభ కలిగిన ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఆటగాళ్ల పేరు, ప్రతిష్టలు, గత రికార్డులను బట్టి తుదిజట్టులోకి తీసుకోకూడదు. భారత క్రికెట్ కు మ్యాచ్ విన్నర్ గా ఉన్న అనిల్ కుంబ్లే ను కూడా ఫామ్ కోల్పోయాడని చాలా సార్లు బెంచ్ మీద కూర్చోబెట్టారు. తీసుకునే నిర్ణయాలు మంచివైతే అందరూ హర్షిస్తారు..’ అని ట్వీట్ చేశాడు.
ఈ ట్వీట్ లో ప్రసాద్ ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలనే టార్గెట్ చేశాడు. ఈ ఇద్దరూ గత కొంతకాలంగా స్థాయికి మేర రాణించడం లేదు. అదీగాక తరుచూ విశ్రాంతిని కోరుతూ తర్వాత జట్టుతో కలిసినా రాణించలేక విఫలమవుతూనే ఉన్నారు.
