Asianet News TeluguAsianet News Telugu

అప్పుడు రెండు వారాలు గదిలో కూర్చుని ఒక్కడ్నే ఏడ్చేవాడిని : హర్షల్ పటేల్ షాకింగ్ కామెంట్స్

IPL 2023: ఇండియన్  ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)  లో తదుపరి సీజన్ కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు  (ఆర్సీబీ) ఆ   హైప్ ను రోజుకో వీడియోతో  మరింత పెంచేస్తున్నది. 

When my sister passed away: Harshal Patel Reveals How He Dealt With Extremities  in Life MSV
Author
First Published Mar 11, 2023, 1:41 PM IST

ఈ మాసాంతంలో  ఐపీఎల్ - 16వ సీజన్  మొదలుకానున్న నేపథ్యంలో ఆ హైప్ ను అభిమానుల్లో మరింత పెంచేందుకు ఆర్సీబీ  రోజుకో వీడియోతో సంచలనాలు సృష్టిస్తోంది.  గత కొన్నిరోజులుగా  ఆర్సీబీ పోడ్ కాస్ట్ లో విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ తో  వీడియోలను విడుదల చేసిన ఆ జట్టు.. తాజాగా ఆ జట్టు బౌలర్  హర్షల్ పటేల్ తో  చేసిన   వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో  హర్షల్.. తన జీవితంలో అత్యంత కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కున్నాననే విషయాన్ని చెప్పాడు.  

హర్షల్ పటేల్ మాట్లాడుతూ.. గతేడాది ఐపీఎల్ సందర్బంగా తన చెల్లెలు చనిపోవడం  తనను తీవ్ర  అగాధానికి నెట్టివేసిందని,  రెండు వారాల పాటు  గదిలో ఒక్కడ్నే కూర్చోని ఏడ్చానని అతడు వెల్లడించాడు.  

‘నా సోదరి చనిపోయినప్పుడు (2022 ఏప్రిల్ 9)  వారం రోజుల పాటు  నాకు ఏమీ తోచలేదు.  నా చెల్లెలు చనిపోయినప్పుడు నేను వారం రోజుల దాకా క్వారంటైన్ లో ఉండాల్సి వచ్చింది. అప్పుడు నేను  నా మేనకోడలు, మేనల్లుడితో  తరుచూ ఫోన్ లో మాట్లాడి ఓదార్చేవాడిని.  వాస్తవానికి నాకు వాళ్ల దగ్గర ఉండి  ఓదారుస్తూ..  వారిని కౌగిలించుకుని, గట్టిగా ఏడ్వాలని ఉండేది. కానీ మేం ఫోన్లలోనే మాట్లాడుకోవాల్సి వచ్చింది.  కరోనా కారణంగా అప్పుడు అంతకన్నా మరో మార్గం లేదు.. 

ఆ తర్వాత వారం రోజులకే నాకు కొడుకు పుట్టాడు.   అప్పుడు కూడా నా ఫీలింగ్ ఏంటో నాకు తోచలేదు.   సోదరి చనిపోయినందుకు విచారించాలా..? లేక కొడుకు పుట్టినందుకు హ్యాపీగా ఉండాలా అర్థం కాని  సంకట స్థితిలో ఉన్నా.  ఆ సమయంలో  నేను రోజు గదిలో కూర్చుని ఒంటరిగా ఏడ్చేవాడిని.   కానీ నా కొడుకును తొలిసారి చూసిన తర్వాత నా కష్టాలన్నీ  తొలిగిపోయాయని అనిపించింది.  అలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు స్థిరంగా ఉండాలని నాకు ఆ రెండు  ఘటనలు గుర్తు చేశాయి..’ అని  తెలిపాడు.   

జీవితంలో మంచి జరిగినా చెడు జరిగినా రెండింటినీ సమానంగా స్వీకరించాలని,   స్థిరంగా ఉండాలని   ఆ ఘటనల ద్వారానే తెలిసిందన్న  హర్షల్.. తన కుటుంబం తనకు ఎంతో మద్దతుగా నిలిచిందని  తాను  కూడా వాళ్లకు  మంచి జీవితాన్ని ఇచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పాడు.    అంతేగాక ఎవరితో వారు నిజాయితీగా ఉంటే  వారిలోని తప్పులు, ఒప్పులు వారికే తెలుస్తాయని, అప్పుడు వాళ్లు సరైన క్రమంలో వెళ్లేందుకు  ఉపకరిస్తుందని హర్షల్ అన్నాడు. తనకు  సంబంధం లేని విషయాలు,  తన నియంత్రణలో లేని విషయాలను గురించి పట్టించుకోవడం మానేశానని కూడా హర్షల్ వివరించాడు.  

ఇక  2021లో  ఐపీఎల్  లో పర్పుల్ క్యాప్ఖ సాధించిన తర్వాత  హర్షల్ డిమాండ్ పెరిగిపోయింది.  2022 ఐపీఎల్ వేలంలో   హర్షల్ ను ఆర్సీబీ ఏకంగా రూ. 10 కోట్లు పెట్టి దక్కించుకుంది. అంతకుముందు అతడు అదే జట్టుకు రూ. 20 లక్షలకే ఆడాడు. కాగా వేలంలో తనకు అంత ధర పలుకుతుందని అస్సలు అంచనా వేయలేదని..   రూ. 5 కోట్ల నుంచి రూ. 6 కోట్ల వరకు బిడ్ వేస్తారని ఆశించాను గానీ   రూ. 10 కోట్లు రావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని హర్షల్ చెప్పాడు.  వాస్తవానికి వేలంలో తనను మళ్లీ ఆర్సీబీ  తిరిగి దక్కించుకోవాలని  కోరుకున్నానని, అదే జరిగినందుకు చాలా సంతోషించానని హర్షల్ చెప్పుకొచ్చాడు.    

Follow Us:
Download App:
  • android
  • ios