Shane Warne About Russia-Ukraine War: మరణానికి కొన్ని రోజుల ముందు ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధం అతడిని కలిచివేసింది. ఈ నేపథ్యంలో అతడు స్పందిస్తూ...
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం షేన్ వార్న్ ఆకస్మిక మరణం క్రికెట్ ప్రపంచాన్ని శోకసంద్రంలో ముంచింది. వార్న్ మరణానికంటే కొద్దిరోజుల ముందే.. ఉక్రెయిన్ పై రష్యా మొదలుపెట్టిన యుద్ధంపై అతడు తనదైన శైలిలో స్పందించాడు. యుద్ధం మొదలైన నేపథ్యంలో.. వరుస ట్వీట్స్ తో ఉక్రెయిన్ కు తన మద్దతు ప్రకటించాడు. రష్యా చేస్తున్న చర్యలను ఖండిస్తూ.. దాడులకు ప్రేరేపితమైనవిగా అభివర్ణించాడు. ఇది అన్యాయమని గొంతెత్తాడు.
గతనెల 24న ఉక్రెయిన్ లోకి దూసుకువచ్చిన రష్యా యుద్ధ విమానాలు.. పదిహేను రోజులుగా అక్కడ భీభత్సం సృష్టిస్తున్నాయి. ప్రపంచ దేశాలు వద్దని వారిస్తున్నా వినకుండా రష్యా.. ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది.
ఈ నేపథ్యంలో వార్న్ స్పందిస్తూ.. ‘ప్రపంచం మొత్తం ఉక్రెయిన్ ప్రజలతో ఉంది. రష్యా చేస్తున్న దాడులు ప్రేరేపితం.. ఇవి ఎంతమాత్రమూ న్యాయం కాదు. ఉక్రెయిన్ నుంచి వస్తున్న చిత్రాలు, వీడియోలను చూస్తే ఆందోళన కలుగుతున్నది. దీనిని ఎలా ఆపాలో నాకు తెలియడం లేదు. ఉక్రెయిన్ లో ఉంటున్న నా మిత్రుడు, అతడి కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నా..’ అని ఫిబ్రవరి 26న ట్వీట్ చేశాడు.
కాగా ప్రపంచ క్రికెట్ కు తీరని విషాదాన్ని మిగుల్చుతూ శుక్రవారం థాయ్లాండ్ లోని కోహ్ సమూయ్ లో ఉన్న తన విల్లాలో తీవ్ర గుండెపోటు రావడంతో వార్న్ మృతి చెందిన విషయం తెలిసిందే. అతడి మరణాన్ని వార్న్ మేనేజర్ మైకేల్ కోహెన్ ధృవీకరిస్తూ.. ‘వార్న్ తన విల్లాలో అచేతనావస్థలో పడి ఉన్నాడు. వైద్య బృందం వార్న్ ను బతికించడానికి ఎంతగానో ప్రయత్నించింది. కానీ అతడి ప్రాణాలను కాపాడలేకపోయింది..’ అని అన్నాడు.
షేన్ వార్న్ తన కెరీర్ లో 145 టెస్టులు ఆడి 708 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన 8-71. ఇన్నింగ్స్ లో 5 వికెట్ల ప్రదర్శన 37 సార్లు చేయగా.. మ్యాచులో పది వికెట్లు 10 సార్లు సాధించాడు. బౌలర్ గానే గాక బ్యాటర్ గా కూడా వార్న్ రాణించాడు. తన టెస్టు కెరీర్ లో 3,154 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 99. సెంచరీ చేయకుండా 3 వేలకు పైగా పరుగులు చేసిన క్రికెటర్ వార్న్. వన్డేల విషయానికొస్తే.. 194 మ్యాచులలో 293 వికెట్లు పడగొట్టాడు. ఉత్తమ బౌలింగ్ ప్రదర్శన 5-33. వన్డేలలో వార్న్ చేసిన పరుగులు 1,018.. కాగా టెస్టులు, వన్డేలలో కలిపి వార్న్ తీసిన వికెట్ల సంఖ్య 1,001. ప్రపంచ క్రికెట్ లో ముత్తయ్య మురళీధరన్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ వార్న్..
