BANvsIND Test: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు వన్డే సిరీస్ కోల్పోయింది. నేటి నుంచి టెస్టు సిరీస్ మొదలైంది. రోహిత్ శర్మ గైర్హాజరీలో కెఎల్ రాహుల్ భారత్ కు సారథిగా వ్యవహరిస్తున్నాడు.
‘ఒక్కటి మాత్రం మీకు స్పష్టం చేయదలుచుకున్నా. మీరు ఈ టెస్టు సిరీస్ లో మా నుంచి అగ్రెసివ్ ఆటను చూస్తారు. అది మాత్రం గ్యారెంటీ..’ బంగ్లాదేశ్ తో టెస్టు సిరీస్ కు ముందు టీమిండియా తాత్కాలిక సారథి కెఎల్ రాహుల్ అన్న మాటలవి. పాత్రికేయుల సమావేశంలో భాగంగా రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్ ‘బజ్ బాల్’ ఆటను ప్రస్తావిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశాడు. కానీ రాహుల్ చేసిన ఈ కామెంట్స్.. వాస్తవానికి సత్యదూరంగా ఉన్నాయి.
బంగ్లాదేశ్ తో తొలి టెస్టులో భాగంగా ఓపెనర్ గా వచ్చిన రాహుల్.. 54 బంతులాడి 22 పరుగులు చేశాడు. తొలి సెషన్ లో 19వ ఓవర్ వేసిన ఖలీద్ అహ్మద్ బౌలింగ్ లో కవర్ డ్రైవ్ ఆడేందుకు యత్నించాడు. కానీ బంతి ఎడ్జ్ తీసుకుని స్టంప్స్ ను తాకింది.
రాహుల్ ఇలా ఔటవడం ఇదే కొత్త కాదు. ఆసియా కప్ లో పాకిస్తాన్ తో మ్యాచ్ లో, టీ20 ప్రపంచకప్ లో రాహుల్ ఇదే విధంగా ఔటయ్యాడు. ఎప్పుడూ ఒకే విధంగా వికెట్ పోగొట్టుకుంటున్న రాహుల్ పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఔటైతే ఔటయ్యావు గానీ మరీ ఎప్పుడూ ఒకే విధంగానా..? కొంచెం కొత్తగా ఔటవ్వచ్చు కదా రాహుల్..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక అగ్రెసివ్ అప్రోచ్ అని కామెంట్స్ చేసిన రాహుల్ అందుకు వన్ పర్సెంట్ కూడా న్యాయం చేయలేదని నెటిజన్లు వాపోతున్నారు. ‘54 బాల్స్ లో 22 రన్స్. ఓహో అగ్రెసివ్ అప్రోచ్ అంటే ఇదేనన్నమాట..’, ‘అవును రాహుల్, నిన్న ఏదో అగ్రెసివ్ ఆట అన్నావ్. ఇదేనా..?’, ‘రాహుల్ అగ్రెసివ్ ఆట గురించి మాట్లాడతాడు. కానీ గల్లీ క్రికెట్ కంటే అధ్వాన్నంగా ఆడతాడు..’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.
రాహుల్ కు ట్రోల్స్ కొత్తేమీ కాదు. రాహుల్ విఫలమైన ప్రతీసారి అతడికి ట్రోల్స్ తప్పవు. కొన్నిసందర్భాల్లో బాగా ఆడినా ట్రోల్స్ వస్తాయి. అయితే ఎలా ఆడినా ట్రోల్స్ ఎదుర్కునే అరుదైన ఆటగాళ్లలో రాహుల్ కూడా ఒకడని.. అతడు ట్రోలర్స్ కు దొరికిన వరమని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.
ఇక తొలి టెస్టులో టీమిండియా.. 59 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. రాహుల్ తో పాటు శుభమన్ గిల్ (20) కూడా విఫలమయ్యాడు. విరాట్ కోహ్లీ (1) కూడా టెస్టు క్రికెట్ లో పేలవ ఫామ్ ను కొనసాగించాడు. రిషభ్ పంత్.. (45 బంతుల్లో 46) కాస్త దూకుడుగా ఆడినా త్వరగా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఛతేశ్వర్ పుజారా (49 నాటౌట్), శ్రేయాస్ అయ్యర్ (45 బ్యాటింగ్) ఆడుతున్నారు.
