Asianet News TeluguAsianet News Telugu

Duleep Trophy: వెస్ట్ జోన్‌దే దులీప్ ట్రోఫీ.. చిత్తుగా ఓడిన సౌత్ జోన్

Duleep Trophy Final: దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ చిత్తుగా ఓడింది.  వెస్ట్ జోన్ నిర్దేశించిన భారీ  లక్ష్య ఛేదనలో సగం  కూడా చేయకుండానే  చేతులెత్తేసింది. 

West Zone Beat South Zone  by 294 Runs in Duleep Trophy Final 2022
Author
First Published Sep 25, 2022, 1:48 PM IST

దులీప్ ట్రోఫీ ఫైనల్లో వెస్ట్ జోన్  ఘన విజయం సాధించింది.  529 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో  సౌత్ జోన్ సగం పరుగులు కూడా చేయలేకపోయింది. ప్రధాన బ్యాటర్లంతా విఫలం కావడంతో 234 పరుగుల వద్దే ఆలౌట్ అయింది. ఫలితంగా వెస్ట్ జోన్.. 294 పరుగుల భారీ ఆధిక్యంతో గెలిచి దులీప్ ట్రోపీని చేజిక్కించుకుంది. కోయంబత్తూరు వేదికగా ఆదివారం ముగిసిన ఈ మ్యాచ్ లో నాలుగో రోజు ఓవర్ నైట్ స్కోరు  154-6 వద్ద ఐదో రోజు ఆరంభించిన సౌత్ జోన్..  మరో 80 పరుగులు మాత్రమే జోడించింది.  సాయి కిషోర్ (7) నిరాశపరిచాడు. 

కానీ హైదరాబాద్ బ్యాటర్ టేకులపల్లి రవితేజ (53) కాస్త ప్రతిఘటించడంతో సౌత్ జోన్ స్కోరు 200 దాటింది.  అతడికి సహకరించేవారెవరూ లేకపోవడంతో  సౌత్ జోన్ ఇన్నింగ్స్.. 71.2 ఓవర్లలో 234 పరుగుల వద్ద తెరపడింది. 

అంతకుముందు ఈ మ్యాచ్ లో  తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేస్తూ వెస్ట్ జోన్ 96.3 ఓవర్లలో 270 పరుగులకు ఆలౌటైంది. వికెట్ కీపర్ హెట్ పటేల్ (98) కి తోడు ఉనద్కత్ (47), శ్రేయాస్ అయ్యర్ (37), సర్ఫరాజ్ ఖాన్ (34) రాణించారు. సౌత్ జోన్ బౌర్లలో సాయికిషోర్ 5 వికెట్లు తీయగా.. బాసిల్ తంపి, స్టీఫెన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. 

సౌత్ జోన్ ఫస్ట్ ఇన్నింగ్స్ లో 83.1 ఓవర్లలో 327 పరుగులు చేసింది. ఇంద్రజిత్ (118) సెంచరీ చేయగా మనీష్ పాండే (48), కృష్ణప్ప గౌతమ్ (43) రాణించారు. వెస్ట్ జోన్ బౌలర్లలో ఉనద్కత్ 4 వికెట్లుతో మెరిశాడు. 

ఇక రెండో ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ కు వచ్చిన వెస్ట్ జోన్ భారీ స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (265) డబుల్ సెంచరీతో మెరిశాడు. సర్ఫరాజ్ ఖాన్  (127) సెంచరీతో కదం తొక్కగా హెట్ పటేల్ (51 నాటౌట్) మరో హాఫ్ సెంచరీ నమోదు చేసుకున్నాడు. ఫలితంగా ఆ జట్టు 128 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 585 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌత్ జోన్ ముందు 529 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. 

కానీ భారీ లక్ష్యంలో సౌత్ జోన్ విఫలమైంది.  ఓపెనర్ రోహన్ కన్నుమ్మల్ (93) మినహా  ప్రధాన బ్యాటర్లంతా విఫలమయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడే మయాంక్ అగర్వాల్ (14), హనుమా విహారి (1), మనీష్ పాండే (14) లు క్రీజులో నిలవలేదు. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో ఇంద్రజిత్ (4) ఆకట్టుకోలేదు. ఫలితంగా సౌత్ జోన్.. 234 పరుగులకే ఆలౌటైంది. వెస్ట్ జోన్ కు ఇది 19వ దులీప్ ట్రోఫీ కావడం విశేషం. ఈ జాబితాలో నార్త్ జోన్ కు 18, సౌత్ జోన్ 13, సెంట్రల్ జోన్ 6, ఈస్ట్ జోన్ 2, ఇండియా బ్లూ 2, ఇండియా రెడ్ 2, ఎలైట్ సి ఒక్కసారి దులీప్ ట్రోఫీని నెగ్గాయి. 

 

Follow Us:
Download App:
  • android
  • ios