రెండో టెస్టులో 17 పరుగుల స్వల్ప తేడాతో విండీస్ ఉత్కంఠ విజయం..టెస్టు క్రికెట్ చరిత్రలో విండీస్ తరుపున రెండో అతి చిన్న మార్జిన్ విజయం... 

బంగ్లాదేశ్, విస్టిండీస్ మధ్య జరిగిన రెండో టెస్టు కూడా ఉత్కంఠభరితంగా ముగిసింది. తొలి టెస్టులో భారీ లక్ష్యాన్ని చేధించిన విండీస్, రెండో టెస్టులో 17 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించి, సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది. నాలుగో ఇన్నింగ్స్‌లో 231 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన బంగ్లాదేశ్ జట్టు, 213 పరుగులకి ఆలౌట్ అయ్యింది.

115 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన బంగ్లా... చివరి దాకా విజయం కోసం పోరాడింది. బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ హాఫ్ సెంచరీ చేసి అవుట్ కాగా, మెహిడీ హసన్ 31 పరుగులతో చివరిదాకా పోరాడాడు.విండీస్ బౌలర్లలో రహ్‌కీం కార్న్‌వాల్ 30 ఓవర్లు వేసి నాలుగు వికెట్లు తీయగా జోమల్ వారికరన్ 3, బ్రాత్‌వైట్ మూడు వికెట్లు తీశారు.

తొలి ఇన్నింగ్స్‌లో 409 పరుగులకి ఆలౌట్ అయిన విండీస్, రెండో ఇన్నింగ్స్‌లో 117 పరుగులకే ఆలౌట్ అయింది. తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులు చేసిన బంగ్లాదేశ్, 231 పరుగుల లక్ష్యచేధనలో 213 పరుగులకే పరిమితమైంది.

రహ్‌కీం కార్న్‌వాల్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కగా, బోనర్ మ్యాన్ ఆఫ్ సిరీస్ అవార్డు గెలిచాడు. 1993లో ఆడిలైడ్‌లో 1 పరుగు తేడాతో విజయం సాధించిన విండీస్‌కి, టెస్టుల్లో ఇది రెండో తక్కువ మార్జిన్ విజయం.