ప్రపంచ కప్ మెగా టోర్నీ వైఫల్యం తర్వాత మొదటగా టీమిండియా కరీబియన్ దీవుల్లో పర్యటించనుంది. అయితే ఈ పర్యటనకు ముందే భారత జట్టుకు ఊరటనిచ్చే శుభవార్తను కరీబియన్ టీం సెలెక్టర్లు ప్రకటించారు. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ కొద్ది క్షణాల్లోనే విధ్వంసాన్ని సృష్టించగల సామర్థ్యమున్న విండీస్ హిట్టర్ క్రిస్ గేల్ భారత్ తో జరగనున్న టీ20 సీరిస్ కు దూరమయ్యాడు.ఈ విషయాన్ని తాజాగా విండీస్ సెలెక్టర్లు ప్రకటించారు. 

వచ్చే నెల మూడో తేదీ నుండి భారత్-వెస్టిండిస్ ల మధ్య టీ20 సీరిస్ ప్రారంభంకానుంది. మూడు టీ20 మ్యాచుల ఈ సీరిస్ లో మొదటి రెండు మ్యాచులు ఒకే మైదానంలో 3,4తేదీల్లో జరగనున్నాయి. దీంతో విండీస్ సెలెక్టర్ ఈ రెండు మ్యాచుల కోసమే ఆటగాళ్ల ఎంపికను చేపట్టి ముందుగా ప్రకటించారు. ఈ మ్యాచులకు తాను అందుబాటులో వుండలేనంటూ గేల్ ముందుగానే సమాచారమివ్వడంతో అతన్ని పరిగణలోకి తీసుకోకుండానే ఆటగాళ్ళ  ఎంపిక చేపట్టినట్లు సెలెక్టర్లు తెలిపారు. 

గేల్ ఎందుకు దూరమయ్యాడంటే

గేల్ ప్రస్తుతం కెనడా గ్లోబల్ టీ20 లీగ్ ఆడుతున్నాడు. భారత్ తో టీ20 సీరిస్ నాటికి ఈ లీగ్ ముగిసే అవకాశం లేదు. అందువల్లే గేల్ విండీస్ జట్టుకు దూరమవ్వాల్సి వచ్చింది. టీ20 స్పెషలిస్ట్ గేల్ ఈ టీ20 సీరిస్ కు దూరమవడం టీమిండియాకు కలిసొచ్చే అంశం. 

స్వదేశంలో భారత జట్టుతో జరగనున్న టీ20 సీరిస్ కోసం 14మంది ఆటగాళ్లతో కూడిన విండీస్ జట్టును ప్రకటించారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత స్పిన్ బౌలర్ సునీల్ నరైన్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. అలాగే ప్రపంచ కప్ ఆడే అవకాశాన్ని కోల్పోయిన కిరన్ పోలార్డ్ కు కూడా సెలెక్టర్లు ఈ సీరిస్ ఆడే అవకాశమిచ్చారు. అంతేకాకుండా ఈ సీరిస్ ద్వారా యువ క్రికెటర్ ఆంథోని బ్రాంబెల్ ఆరంగేట్రం చేసే అవకాశాలున్నాయి. అతడు ఈ  14 మందితో కూడిన విండీస్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. 

మొదటి రెండు టీ20  మ్యాచుల్లో భారత్ తో తలపడే విండీస్ జట్టిదే: 

కార్లోస్‌ బ్రాత్‌వైట్‌ (కెప్టెన్‌), జాన్‌ క్యాంప్‌బెల్‌, ఎవిన్‌ లూయిస్‌, హెట్మెయర్‌, నికోలస్‌ పూరన్‌, కీరన్‌ పొలార్డ్‌, రావ్‌మాన్‌ పావెల్‌, కీమో పాల్‌, సునీల్‌ నరైన్‌, షెల్డాన్‌ కాట్రెల్‌,
ఓష్నీ థామస్‌, ఆంథోని బ్రాంబెల్‌, ఆండ్రీ రసెల్‌, ఖారీ పైర్రీ