Asianet News TeluguAsianet News Telugu

పిల్లాడిని తప్పించబోయి, కింద పడిపోయి... వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ చేసిన పనికి...

బౌండరీ లైన్ దగ్గర ఐదేళ్ల పిల్లాడికి తగలకుండా ఉండేందుకు తనను తాను గాయపరుచుకున్న వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్... టీ20 క్రికెట్ చరిత్రలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన విండీస్.. 

West Indies Skipper Rovman powell wins hearts after injured himself while saving ball boy cra
Author
First Published Mar 27, 2023, 4:30 PM IST

వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ చేసిన ఓ పని, జనాల మనసులు గెలుచుకుంటోంది. సెంచూరియన్‌లో సౌతాఫ్రికాతో జరిగిన రెండో టీ20లో ఓ ఐదేళ్ల పిల్లాడిని తప్పించబోయిన రోవ్‌మన్ పావెల్, పెను ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు...

ఇంతకీ ఏం జరిగిందంటే సౌతాఫ్రికా ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లో క్వింటన్ డి కాక్, లాంగ్ ఆఫ్ మీదుగా ఓ బౌండరీ బాదాడు. బాల్‌ని ఆపేందుకు పరుగెత్తిన రోవ్‌మన్ పావెల్, బౌండరీ లైన్ దగ్గర ఓ ఐదేళ్ల పిల్లాడు (బాల్ బాయ్) బాల్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తుండడం చూశాడు. వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చిన పావెల్, ఆఖరి సెకన్లలో కూడా బంతిని ఆపేందుకు ప్రయత్నించి ఉంటే ఆ బాలుడిని ఢీకొట్టేవాడే...

ఆ పిల్లాడికి తగలకూడదనే ఉద్దేశంతో బంతిని వదిలేసిన రోవ్‌మన్ పావెల్, బౌండరీ లైన్ లోపల కూర్చొన్న మరో బాల్ బాయ్‌ని కూడా తప్పించుకుని ఎల్‌ఈడీ బోర్డుల పైన పడ్డాడు. రోవ్‌మన్ పావెల్ వచ్చిన స్పీడ్‌కి అదుపుతప్పి ఆ ఎల్‌ఈడీ బోర్డుల పైనుంచి కూడా పల్టీ కొట్టి, ప్రేక్షకులు లోపలికి రాకుండా వేసిన కంచెకు బలంగా తగలబోయాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన ఓ సౌండ్ బాక్స్ అతనికి ఆసరాగా దొరకడంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు...

కొన్నిసార్లు ఒక్క పరుగు కూడా మ్యాచ్ ఫలితాన్ని మార్చేయొచ్చు. మరీ ముఖ్యంగా టీ20 క్రికెట్‌లో ఒక్క పరుగు చాలా చాలా విలువైనది అందుకే సేవ్ చేసే ప్రతీ పరుగు ఎంతో అమూల్యమైనదిగా భావిస్తారు. అయితే పరుగుల కంటే బాలుడి క్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన రోవ్‌మన్ పావెల్, తనను తాను గాయపరుచుకోవడానికి కూడా వెనకాడలేదు. ఈ సంఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..

వెస్టిండీస్ కెప్టెన్‌ క్రీడా స్ఫూర్తికి ఐసీసీ అవార్డు దక్కాలని చాలామంది కామెంట్లు చేస్తున్నారు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ జట్టు, 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 258 పరుగుల కొండంత స్కోరు చేసింది. జాన్సన్ చార్లెస్ 46 బంతుల్లో 10 ఫోర్లు, 11 సిక్సర్లతో  118 పరుగులు చేసి, వెస్టిండీస్ తరుపున ఫాస్టెస్ట్ సెంచరీ నమోదు చేశాడు. కేల్ మేయర్స్ 27 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 51 పరుగులు చేశాడు. రోమారియో షెఫర్డ్ 18 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 41 పరుగులు చేసి మెరుపులు మెరిపించాడు..

కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ 19 బంతుల్లో ఓ ఫోర్, 2 సిక్సర్లతో 28 పరుగులు చేశాడు. అయితే కొండంత లక్ష్యాన్ని 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది సౌతాఫ్రికా. రిజా హెండ్రిక్స్ 28 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 68 పరుగులు చేయగా క్వింటన్ డి కాక్ 44 బంతుల్లో 9 ఫోర్లు, 8 సిక్సర్లతో 100 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

ఇద్దరు ఓపెనర్ల దంచుడుకి 10.4 ఓవర్లలోనే 152 పరుగులు చేసింది సౌతాఫ్రికా. రిలే రసో 16, డేవిడ్ మిల్లర్ 10 పరుగులు చేసి అవుటైనా కెప్టెన్ అయిడిన్ మార్క్‌రమ్ 38, హెన్రీచ్ క్లాసిన్ 16 పరుగులు చేసి మ్యాచ్‌ని ముగించారు. టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన ఛేదన ఇదే.. 
 

Follow Us:
Download App:
  • android
  • ios