కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో విండీస్ విధ్వంసక ఆటగాడు ఆండ్రీ రసెల్ తీవ్రంగా గాయపడ్డాడు. బంతిని హిట్ చేసే ప్రయత్నంలో అది రసెల్ చెవికి గాయం కావడంతో క్రీజులోనే కుప్పకూలిపోయాడు.

లీగ్‌లో భాగంగా జమైకా తలవాస్ తరపున ఆడుతున్న రసెల్.. గురువారం సెయింట్ లూసియా జౌక్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 14వ ఓవర్‌లో షార్ట్ పిచ్ బంతిని భారీ షాట్‌కు యత్నించడంతో అది అదుపు తప్పి రసెల్ హెల్మెట్‌ను తాకుతూ దూసుకెళ్లింది.

ఈ సమయంలో అతని కుడిచెవికి గాయం కావడంతో రసెల్ మైదానంలో కుప్పకూలిపోయాడు. ఈ సంఘటనతో ప్రేక్షకులు, ఆటగాళ్లు ఉలిక్కిపడ్డారు. వెంటనే తేరుకున్న ప్రత్యర్ధి జట్టు ఆటగాళ్లు రసెల్ వద్దకు చేరుకుని అతనిని పరిశీలించారు.

వెంటనే అక్కడికి చేరుకున్న వైద్య సిబ్బంది ప్రథమ చికిత్స అనంతరం రస్సెల్‌ను ఆసుపత్రికి తరలించారు. అతనికి ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు తెలిపారు. కాగా గాయపడే సమయానికి మూడు బంతులు ఆడిన రసెల్ పరుగులేమి చేయలేదు. ఈ మ్యాచ్‌లో సెయింట్ లూసియా 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది.