కరీబియన్ దీవుల్లో టీమిండియా పర్యటన  మొదలై 15 రోజులు కావస్తోంది. ఇప్పటికు టీ20 సీరిస్ తో పాటు  వన్డే సీరిస్ కూడా ముగిసింది. అయినా ఇప్పటివరకు వెస్టిండిస్ జట్టు ఇంకా విజయాల ఖాతా తెరవలేదు. బుధవారం జరిగిన మూడో వన్డేలో ఆ అవకాశం వచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువకెరటం శ్రేయాస్ అయ్యర్ లను అడ్డుకోవడంలో మళ్లీ  విఫలమైన విండీస్ మూడో వన్డేలో ఓటమిపాలై సీరిస్ ను కోల్పోవాల్సి వచ్చింది. 

ఈ మ్యాచ్ అనంతరం  వెస్టిండిస్ కెప్టెన్  మీడియాతో మాట్లాడుతూ తమ జట్టు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేశాడు.  తమను ఓడించింది భారత్ కాదని... మమ్మల్ని మేమే ఓడించుకున్నామని పేర్కొన్నాడు. ముఖ్యంగా విరాట్ కోహ్లీని ఆదిలోనే ఔట్ చేసే మంచి అవకాశాన్ని కోల్పోయామని...అదే మా కొంప ముంచిందన్నాడు.   

''మా ఓపెనర్లు గేల్, లూయిస్ రాణించడంతో భారత్ ముందు మంచి లక్ష్యాన్నే వుంచగలిగాం. అప్పటివరకు మా ఆటతీరు బాగానే సాగింది. కానీ బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో రాణించలేకపోయాం. మరి ముఖ్యంగా కోహ్లీ,  శ్రేయాస్ లను అడ్డుకోవడంలో ఘోరంగా విఫలమయ్యాం. కేవలం 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద కోహ్లీ ఇచ్చిన సునాయాసమైన క్యాచ్ ను వికెట్ కీపర్ షాయ్ హోప్స్ నేలపాలుచేశాడు. ఇదే తమను  ఓడించింది. 

మా బౌలర్లు కూడా ఆశించిన  మేర రాణించలేకపోయారు. అందువల్లే భారత్ వేగంగా పరుగులు రాబట్టగలిగింది. విరాట్ కోహ్లీ (114 పరుగులు), శ్రేయాస్ అయ్యర్ (65 పరుగులు) జోడి  తమనుండి  మ్యాచ్ ను లాగేసుకుంది.'' అని హెల్డర్ పేర్కొన్నాడు.