వెస్ట్ ఇండీస్ కాదు ‘వేస్ట్ ఇండీస్’.. ‘పూర్’ రన్ అంటూ వెల్లువెత్తుతున్న ట్రోల్స్
T20 World Cup 2022: రెండు సార్లు టీ20 ఛాంపియన్ అయిన జట్టు ఇప్పుడు కనీసం క్వాలిఫై కూడా కాకుండా ఇంటిబాట పట్టింది. ఐర్లాండ్ చేతిలో ఓడిన వెస్టిండీస్ జట్టు, కెప్టెన్ నికోలస్ పూరన్ పై ట్విటర్ లో జోకులు పేలుతున్నాయి.
టీ20 ప్రపంచకప్ లో క్వాలిఫై గండం గట్టెక్కలేక తొలి రౌండ్ లోనే ఇంటి బాట పట్టింది వెస్టిండీస్. రెండు సార్లు ఛాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీలోకి అడుగుపెట్టిన విండీస్.. క్వాలిఫై రౌండ్ లో స్కాట్లాండ్, ఐర్లాండ్ చేతుల్లో ఓడింది. ఆటగాళ్ల అనుభవలేమి.. పేలవ ఫామ్, సారథ్య వైఫల్యం.. వెరసి మాజీ చాంపియన్స్ మొత్తం ప్రపంచకప్ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. వెస్టిండీస్ జట్టు సూపర్-12కు అర్హత సాధించకపోవడంపై సొంత జట్టు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా నికోలస్ పూరన్ అండ్ కో. ను ఆటాడుకుంటున్నారు. ఇది ‘వెస్టిండీస్’ కాదని.. ‘వేస్ట్ ఇండీస్’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఐర్లాండ్ తో జరిగిన గ్రూప్-బీ క్వాలిఫయర్ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. లక్ష్యాన్ని ఐర్లాండ్.. 17.3 ఓవర్లలోనే 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా విండీస్ 9 వికెట్ల తేడాతో ఓటమిని చవిచూసింది.
ఈ నేపథ్యంలో వెస్టిండీస్ జట్టు పై సామాజిక మాధ్యమాల వేదికగా ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. ట్విటర్ లో పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఒకప్పుడు క్రికెట్ ను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన జట్టు ఇప్పుడు ఇలా చతికిలపడుతున్నది - ఇదే విండీస్ క్రికెట్ పరిస్థితి..’, ‘టీ20 క్రికెట్ లో రెండు సార్లు ఛాంపియన్ అయిన జట్టు ఇప్పుడు కనీసం క్వాలిఫై కూడా కాలేదు. ఈసారి మెగా టోర్నీలో వెస్టిండీస్ ను చాలా మిస్ అవుతాం..’, ‘వెస్ట్ ఇండీస్ కాదు.. వేస్ట్ ఇండీస్..’, ‘ఒకప్పుడు విండీస్ జట్టును ఆల్ టైం గ్రేట్ అనేవారు. ఇప్పుడు ఆ జట్టు మరీ దిగజారింది’, ‘టీ20 ఫార్మాట్ ను నరానరాన జీర్ణించుకున్న ఆటగాళ్లు ఇప్పుడు ప్రపంచకప్ కు కనీసం క్వాలిఫై కూడా కాకుండా వెనుదిరుగుతున్నారు..’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక విండీస్ సారథి నికోలస్ పూరన్ ఫ్లాఫ్ షో పైనా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అతడు కెప్టెన్ మెటీరియల్ కాదని.. జేసన్ హోల్డర్ ను కాదని పూరన్ కు బాధ్యతలు ఇవ్వడం తెలివితక్కువ పనని మండిపడుతున్నారు. పూరన్ ను ‘పూర్ రన్’ అని, ‘చూరన్’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.