వెస్టిండిస్ ఆల్ రౌండర్  ఆండ్రీ  రస్సెల్స్ తండ్రి కాబోతున్నాడు. తన భార్య  జేసిన్ లోరా గర్భం దాల్చినట్లు...త్వరలో తమ కుటుంబంలోకి మరో చిన్నారి అడుగుపెట్టనున్నట్లు స్వయంగా రస్సెల్ ప్రకటించాడు. గర్భవతిగా వున్న తన భార్యతో కలిసి దిగిన ఫోటోలను కూడా రస్సెల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలా తన సంతోషాన్ని అతడు అభిమానులతో పంచుకున్నాడు. 

బేబీ రస్సెల్ పేరిట సన్నిహితులతో కలిసి రస్సెల్ దంపతులు పార్టీ జరుపుకున్నారు. ఈ సందర్భంగా భార్యాభర్తలిద్దరు కలిసి క్రికెట్ స్టైల్లోనే సంబరాలు చేసుకున్నారు. బంతి మాదిరిగా వున్న ఓ టపాసును లోరా బౌలర్ స్టైల్లో విసరగా రస్సెల్ దాన్ని బ్యాట్ తో బాదాడు. దీంతో ఒక్కసారిగా ఆ బంతి పేలిపోయింది. ఈ  వీడియోను రస్సెల్ తన ఇన్స్టా‌గ్రామ్ పేజిలో పోస్ట్ చేశాడు. 

ఈ వీడియోకు ఓ మెసేజ్ జతచేశాడు. '' మొత్తానికి నేను తండ్రిని కాబోతున్నాను. నా భార్య ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది.  నాకు దేవుడి అనుగ్రహం వుంది. పుట్టబోయేది అమ్మాయైనా, అబ్బాయైనా నాకు ఏలాంటి అభ్యంతరం లేదు. కానీ బేబీ పూర్తి ఆరోగ్యంతో జన్మిస్తే చాలు. ఆ దేవున్ని కూడా అదే కోరుకుంటున్నా.'' అని రస్సెల్ తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు.  

సంతానాన్ని పొందనున్న రస్సెల్ దంపతులకు సహచరులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. '' కంగ్రాట్స్ బ్రదర్. అదృష్టవంతురాలైన అమ్మాయి. కానీ బేబీ రస్సెల్ పార్టీకి నన్నెందుకు ఆహ్వానించలేదు.'' అంటూ క్రిస్ గేల్ కామెంట్ చేశాడు.  ''ఆట ద్వారా మమ్మల్ని అలరిస్తున్న నీకు అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాం.'' అంటూ రస్సెల్ పోస్ట్ పై అభిమానులు కామెంట్ చేస్తున్నారు.