Ranji Trophy 2021-22: 22 మంది సభ్యులతో కూడిన బెంగాల్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ మేరకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. ఇందులో రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి పేరు కూడా ఉంది.
ఈనెల 13 నుంచి మొదలుకానున్న ప్రతిష్టాత్మక రంజీ సీజన్ లో ఓ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి ఆడనున్నాడు. తమ జట్టులో ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు కరోనా బారిన పడటంతో మంత్రి అయిన ఆ వెటరన్ క్రికెటర్ మళ్లీ బ్యాట్ పట్టాల్సి వస్తున్నది. పశ్చిమబెంగాల్ ఈ అరుదైన దృశ్యానికి వేదిక కానున్నది. ఆ రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారి.. ఈ సీజన్ లో బెంగాల్ తరఫున రంజీ మ్యాచులు ఆడనున్నాడు. ఈ మేరకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ ఈ విషయాన్ని వెల్లడించింది. 22 మంది సభ్యులతో కూడిన బెంగాల్ జట్టును సోమవారం ప్రకటించారు. ఈ జట్టుకు అభిమన్యు ఈశ్వరన్ సారథిగా వ్యవహరించనున్నాడు.
ఇదిలాఉండగా ఈ జట్టులో బెంగాల్ క్రీడా, యువజనల శాఖ మంత్రి, వెటరన్ ఆటగాడు మనోజ్ తివారి పేరు కూడా ఆటగాళ్ల జాబితాలో ఉంది. గతేడాది రంజీ ట్రోఫీ ఫైనల్లో భాగంగా సౌరాష్ట్ర పై చివరి మ్యాచ్ ఆడిన తివారి ఆ తర్వాత రాజకీయ అరంగ్రేటం చేశాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న అతడు.. శివ్పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచాడు.
తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తివారిపై నమ్మకముంచారు. ఆయనకు కీలకమైన క్రీడా, యువజన సర్వీసుల శాఖకు మంత్రిని చేశారు. కాగా, బెంగాల్ జట్టులో ఆరుగురు క్రికెటర్లతో పాటు ఓ శిక్షణా సిబ్బందికి కొవిడ్-19 పాజిటివ్ గా తేలింది. కరోనా సోకినవారిలో సురాజిత్ యాదవ్, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, గీత్ పూరి, ప్రదీప్త ప్రామాణిక్, కజి జునౌద్ లతో పాటు కోచింగ్ స్టాఫ్ సౌరాసిష్ లాహిరి కూడా ఉన్నారు. ఆర్టీపీసీఆర్ టెస్టులో వీరికి పాజిటివ్ గా తేలడంతో వీళ్లందరినీ ప్రత్యేక గదుల్లో ఐసోలేషన్ లో పెట్టారు.
ఈ నేపథ్యంలో తివారి స్వయంగా రంగంలోకి దిగాడు. క్రీడల మంత్రి అయి ఉండి బిజీ షెడ్యూల్ ఉన్నా తన రాష్ట్రం తరఫున ఆడటానికి అతడు ఆలోచించలేదు. జనవరి 13న బెంగాల్ జట్టు.. తొలి మ్యాచులో త్రిపురతో తలపడనుంది. ఈ మ్యాచులో తివారి ఆడే అవకాశముంది.
36 ఏండ్ల తివారి.. భారత క్రికెట్ లో దురదృష్టవంతమైన క్రికెటర్లలో ఒకడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అతడు వేలాది పరుగులు చేసినా జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. టీమిండియా తరఫున 12 వన్డేలు, మూడు టీ20 లు ఆడాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ఏకంగా 9వేల పరుగులు చేయడం విశేషం. 50.4 బ్యాటింగ్ సగటుతో 27 సెంచరీలు కూడా చేశాడు. 2004 లో 19 ఏండ్ల వయసులోనే క్రికెటర్ గా ఓనమాలు దిద్దిన తివారి.. బెంగాల్ క్రికెట్ కు చాలాకాలం సేవలందించాడు.
బెంగాల్ జట్టు: అభిమన్యు ఈశ్వరన్ (సి), మనోజ్ తివారీ, సుదీప్ ఛటర్జీ, అనుస్తుప్ మజుందార్, అభిషేక్ రామన్, సుదీప్ ఘరామి, అభిషేక్ దాస్, రిత్టిక్ ఛటర్జీ, రిత్విక్ రాయ్ చౌదరి, అభిషేక్ పోరెల్, షాబాజ్ అహ్మద్, సయన్ శేఖర్ దేరెప్, సయన్ శేఖర్ దేరెప్, ఐ. కాజీ జునైద్ సైఫీ, సకీర్ హబీబ్ గాంధీ, ప్రదీప్త ప్రమాణిక్, గీత్ పూరి, నీలకంఠ దాస్ మరియు కరణ్ లాల్
