ఎట్టకేలకు వృద్దిమాన్ సాహా టెస్టు పునరాగమనానికి రంగం సిద్దమయ్యింది. గతకొంతకాలంగా అతన్ని ఊరిస్తున్న అవకాశం స్వదేశంలో సౌతాఫ్రికాతో జరగనున్న టెస్ట్ సీరిస్ ద్వారా చేరువయ్యింది.  మహాత్మా గాంధీ-నెల్సన్‌ మండేలా ఫ్రీడమ్‌ ట్రోఫీలో భాగంగా రేపు బుధవారం(అక్టోబర్ 2న) వైజాగ్ లో మొదటి టెస్ట్ ప్రారంభంకానుంది. ఇలా సౌతాఫ్రికాతో తలపడనున్న భారత జట్టులో సాహాకి చోటు దక్కింది. రిషబ్ పంత్ ను కేవలం డ్రెస్సింగ్ రూంకే పరిమితం చేసిన మేనేజ్‌మెంట్ తుదిజట్టులో సాహాకు చోటుకల్పించింది. 

జట్టు కూర్పు గురించి కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ సాహాపై ప్రశంసలు కురిపించాడు. '' ఎప్పటినుండో వృద్దిమాన్ సాహాను టెస్ట్ టీంలోకి తీసుకోవాలని భావిస్తున్నాం. అయితే మరో యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ కి మరికొన్ని అవకాశాలివ్వాల్సి రావడంతో ఇది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు సౌతాఫ్రికా సీరిస్ లో అతడికి బరిలోకి దిగే అవకాశం వచ్చింది. 

నిజంగా చెప్పాలంటే సాహా అత్యుత్తమ వికెట్ కీపర్. మరీ ముఖ్యంగా టెస్టుల్లో అతడి ప్రదర్శన అద్భుతంగా వుంటుంది. అతడు కేవలం బెస్ట్ వికెట్ కీపర్ మాత్రమే కాదు మంచి బ్యాట్స్ మెన్ కూడా. అందువల్లే భారత జట్టు సభ్యులంతా అతడి పునరాగమనం కోసం ఎదురుచూశారు. వారిలో నేను కూడా వున్నాను.'' అని కోహ్లీ సాహాకు మద్దతుగా మాట్లాడారు.  

వృద్దిమాన్ సాహా గాయంనుండి పూర్తిగా కోలుకోవడంతో పంత్ పై వేటు తప్పలేదు. సాహాకు వైజాగ్ టెస్ట్ లో వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్ మెన్ గా అవకాశం లభించింది.
 2018 జనవరిలో సౌతాఫ్రికా టూర్‌లో చివరిసారి టెస్టు మ్యాచ్‌ ఆడిన సాహా మళ్ళీ అదే జట్టుపై జరగనున్న మ్యాచ్ లో పునరాగమనం చేస్తుండటం విశేషం.  సాహా తన కెరీర్‌లో ఇప్పటి వరకు 32 టెస్టులాడి 30.63 సగటుతో 1164 పరుగులు చేశాడు.