Asianet News TeluguAsianet News Telugu

నేను ఆ ఓవర్ వేయకుండా ఉండాల్సింది.. నావల్లే ఇంగ్లాండ్ ఓడిపోయింది : మోయిన్ అలీ పశ్చాత్తాపం

PAK vs ENG T20I: పాకిస్తాన్-ఇంగ్లాండ్ మధ్య  గురువారం కరాచీలో జరిగిన రెండో టీ20లో పాక్  ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రికార్డు ఛేదనను పాకిస్తాన్ ఓపెనర్లు ఇద్దరే పూర్తిచేశారు. 
 

We Loss The Game For My over: England Stand in Skipper Moeen ali On Defeat Of 2nd  T20I Against Pakistan
Author
First Published Sep 23, 2022, 3:57 PM IST

తొలి టీ20లో పాకిస్తాన్ ను కట్టడి చేశామన్న ఆనందం ఇంగ్లాండ్ కు ఎక్కువసేపు నిలువలేదు.  కరాచీ వేదికగా జరిగిన రెండో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. పాకిస్తాన్ ముందు 200 పరుగుల లక్ష్యాన్ని నిలిపినా ఓపెనర్లు మహ్మద్ రిజ్వాన్-బాబర్ ఆజమ్ లు  పర్యాటక బౌలర్లకు చుక్కలు చూపించారు. ఇద్దరూ ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడి పాక్ కు  అపూర్వ విజయాన్ని అందించారు. అయితే ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఓటమికి తన బౌలింగే కారణమంటున్నాడు ఆ జట్టు తాత్కాలిక సారథి మోయిన్ అలీ. అలీ వేసిన ఒక ఓవర్లో ఏకంగా 21 పరుగులు సమర్పించుకున్నాడు. 

ఈ మ్యాచ్ లో అలీ.. పాకిస్తాన్ ఇన్నింగ్స్ లో 13వ ఓవర్ వేశాడు. అప్పటికే  బాబర్, రిజ్వాన్ లు హాఫ్ సెంచరీలతో ఊపుమీదున్నారు. స్కోరుబోర్డు 12 ఓవర్లకు  పాక్.. వికెట్ నష్టపోకుండా 104 పరుగులు చేసింది. 

13వ ఓవర్ వేసిన అలీ బౌలింగ్ ను  బాబర్-రిజ్వాన్ లు ఆటాడుకున్నారు. ఈ ఓవర్లో బాబర్..తొలి బంతికి సిక్సర్ బాదాడు. తర్వాత రెండు సింగిల్స్ వచ్చాయి.  మళ్లీ నాలుగో బంతికి బాబర్ సిక్స్ కొట్టాడు. ఐదో బంతికి సింగిల్ తీసి రిజ్వాన్ కు స్ట్రైక్ ఇవ్వగా.. ఆరో బంతిని రిజ్వాన్ కూడా స్టాండ్స్ లోకి పంపాడు.  మొత్తంగా ఈ ఓవర్లో 21 పరుగులొచ్చాయి.  ఈ ఓవర్లో వచ్చిన ఉత్సాహంతో బాబర్-రిజ్వాన్ లు మరింత చెలరేగిపోయారు.  మ్యాచ్ మొత్తమ్మీద పాకిస్తాన్ అత్యధిక పరుగులు సాధించుకున్న ఓవర్ కూడా ఇదే కావడం గమనార్హం. 

అయితే మ్యాచ్ అనంతరం అలీ మాట్లాడుతూ.. ‘నేను నా ఓవర్ వేసినప్పుడే పాకిస్తాన్ ఛేదనను స్పీడ్ చేసింది. ఆ ఓవర్లో మూడు సిక్సర్లు రావడంతో వారికి గెలుపు మీద నమ్మకాన్నిచ్చింది. ఆ తర్వాత వాళ్లను మేం ఆపలేకపోయాం.. అప్పటివరకు గేమ్ మా నియంత్రణలోనే ఉన్నట్టు అనిపించింది. కానీ నా ఓవర్ వల్లే మేం ఈ మ్యాచ్ ఓడిపోయామని నేను అనుకుంటున్నా. అది నా తప్పే.  వికెట్ తీద్దామనే ప్రయత్నంతో నేను బంతి అందుకున్నా. కానీ వర్కవుట్ అవలేదు..’ అని తెలిపాడు. 

 

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి  199 పరుగులు చేసింది. కెప్టెన్ మొయిన్ అలీ (23 బంతుల్లో 55 నాటౌట్, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపులకు తోడు డకెట్ (44), హ్యరీ బ్రూక్ (31) రాణించారు.  అనంతరం లక్ష్య ఛేదనను పాకిస్తాన్.. 19.3 ఓవర్లలోనే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఛేదించింది. కెప్టెన్ బాబర్ ఆజమ్ టీ20లలో రెండో సెంచరీ (66 బంతుల్లో 110 నాటౌట్, 11 ఫోర్లు, 5 సిక్సర్లు) నమోదు చేశాడు. మహ్మద్ రిజ్వాన్ (51 బంతుల్లో 88 నాటౌట్, 5 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి ఆడి పాక్ కు ఘన విజయాన్ని అందించారు.

 ఏడు టీ20ల సిరీస్ లో భాగంగా మూడో మ్యాచ్.. కరాచీ స్టేడియంలోనే  శుక్రవారం రాత్రి జరగనుంది. ఇప్పటికే ఇంగ్లాండ్, పాకిస్తాన్ తలా ఒక మ్యాచ్ గెలిచిన విషయం తెలిసిందే.  

Follow Us:
Download App:
  • android
  • ios