Lata Mangeshkar Passes Away: సుమారు నాలుగు దశాబ్దాల పాటు దేశాన్ని తన మెలోడి పాటలతో ఉర్రూతలూగించిన  లతా మంగేష్కర్ మరణం పట్ల  భారత క్రికెటర్లు కన్నీటి నివాళులు ప్రకటిస్తున్నారు. 

‘నైటింగేల్ ఆఫ్ ఇండియా’ గా పేరు గాంచిన ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మరణంపై భారత క్రికెటర్లు కన్నీటి నివాళులు ప్రకటిస్తున్నారు. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు. ఇవాళ దేశం తన ‘కోకిల’ ను కోల్పోయిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. భారత క్రికెట్ జట్టు మాజీ సారథి విరాట్ కోహ్లి, శిఖర్ ధావన్, అజింక్యా రహానే మొదలు పలువురు క్రికెటర్లు లతా మంగేష్కర్ కు నివాళి ప్రకటించారు.

ట్విట్టర్ వేదికగా విరాట్ కోహ్లి స్పందిస్తూ.. ‘లతా జీ మరణం గురించి విని చాలా బాధపడ్డాను. ఆమె మధురమైన పాటలు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని తాకాయి. మీరు అందించిన సంగీతం, జ్ఞాపకాలకు ధన్యవాదాలు. ఆమె కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి..’ అని పేర్కొన్నాడు. 

Scroll to load tweet…

ధావన్ స్పందిస్తూ.. ‘మీ సంగీతం మా ఆత్మను తాకింది. అది మాకు సంతోషాన్ని పంచింది. ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి లతాజీ.. మీ వారసత్వం (లెగసీ) రాబోయే తరాలకు స్ఫూర్తినిస్తుంది..’ అని రాసుకొచ్చాడు. 

అజింక్యా రహానే స్పందిస్తూ.. ‘ఈరోజు భారతదేశం తన నైటింగేల్ ను కోల్పోయింది. ఈ కష్ట సమయంలో లతా జీ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.. ఓం శాంతి..’ అని ట్వీట్ చేశాడు. 

Scroll to load tweet…

బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందిస్తూ.. ‘తన మధురమైన గాత్రంతో ప్రపంచంలో ఎవరినైనా కదిలించే శక్తి లతా దీదీకి ఉంది. ఆమెకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. కానీ ఇప్పుడు ఆమె లేదన్న వార్త మమ్మల్ని షాక్ కు గురి చేసింది. మీరు లేని లోటు పూడ్చలేనిది..’ అని రాశాడు. 

Scroll to load tweet…

భారత మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ స్పందిస్తూ.. ‘మన కోసం ఎన్నో గొప్ప పాటలు పాడిన దేవత ఇకలేదు.. రిప్ లతా మంగేష్కర్’ అని పేర్కొన్నాడు.

టీమిండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ స్పందిస్తూ.. ‘మరో లతా దీదీ ఎప్పటికీ ఉండదు. ఒక శకం ముగిసింది. నైటింగేల్ వెల్లిపోయింది. కానీ ఆమె సంగీతం ద్వారా రాబోయే తరాల హృదయాలలో ఎప్పటికీ నిలిచే ఉంటుంది..’ అని ట్వీట్ చేశాడు.

సురేశ్ రైనా స్పందిస్తూ..‘భారత రత్న లతా దీదీ మరణవార్త నన్ను కలిచివేసింది. మీరు మరణించినా మీ వారసత్వం మాత్రం శాశ్వతం. రెస్ట్ ఇన్ పీస్..’ అని రాసుకొచ్చాడు. 

వీళ్లే గాక అనిల్ కుంబ్లే, దినేశ్ కార్తీక్, వసీం జాఫర్, గౌతం గంభీర్, టర్బోనేటర్ హర్భజన్ సింగ్, అజిత్ అగార్కర్, వీరేంద్ర సెహ్వాగ్, వీవీఎస్ లక్ష్మణ్ లతో పాటు భారత జట్టు మహిళా క్రికెట్ కెప్టెన్ మిథాలీ రాజ్, బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు కూడా లతా మంగేష్కర్ కు నివాళులర్పించారు.