Asianet News TeluguAsianet News Telugu

మేం ఆ మ్యాచ్ ఓడిపోలేదు.. అది టై..! 2007 టీ20 ప్రపంచకప్‌లో ఇండియా-పాక్ పోరుపై అప్పటి పాకిస్తాన్ సారథి కామెంట్స్

IND vs PAK: ఇంటర్నేషనల్  క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తొలిసారిగా నిర్వహించిన 2007 టీ20 ప్రపంచకప్ లో  భారత్-పాక్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్ లో టీమిండియా అనూహ్య విజయం సాధించింది.  అయితే 15 ఏండ్ల తర్వాత ఈ మ్యాచ్ గురించి... 

We did not Lose, It was a Tie: Shoaib Malik Reacts On 2007 T20 World Cup
Author
First Published Sep 14, 2022, 6:06 PM IST

సరిగ్గా 15 ఏండ్ల క్రితం.. ఇదే రోజు (సెప్టెంబర్ 14)న ఐసీసీ నిర్వహించిన తొలి టీ20 ప్రపంచకప్  పోరులో చిరకాల ప్రత్యర్థులు భారత్ - పాకిస్తాన్ తలపడ్డాయి.  ఈ మ్యాచ్ లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని భారత జట్టు.. షోయభ్ మాలిక్ సారథ్యంలోని  పాకిస్తాన్‌ను  ఓడించి అనూహ్య విజయాన్ని అందుకుంది. ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ టై అవడంతో బౌల్ అవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. అయితే ఈ మ్యాచ్ లో భారత్ గెలిచినట్టు కాదని.. మేం ఓడినట్టు అంతకన్నా కాదని అంటున్నాడు నాటి పాకిస్తాన్ సారథి షోయభ్ మాలిక్. 

ఈ మ్యాచ్ లో బౌల్ అవుట్ లో భారత క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్, రాబిన్ ఊతప్పలు  మూడు బంతుల్లో మూడుసార్లు వికెట్లు పడగొట్టారు.  కానీ పాకిస్తాన్ మాత్రం మూడుసార్లు విఫలమై  పరాజయం పాలైంది. క్రికెట్ లో  అంతకుముందు లేని ఈ నిబంధనను  2007  పొట్టి ప్రపంచకప్ లోనే తొలిసారిగా  ప్రవేశపెట్టారు.

ఇక మ్యాచ్ పూర్తై 15 ఏండ్లు గడిచిన సందర్భంగా షోయభ్ మాలిక్ స్పందిస్తూ.. ‘ఈ మ్యాచ్ టై అవడంతోనే మాకు ఈ నిబంధన (బౌల్ అవుట్) గురించి తెలిసింది. అయితే అప్పుడు నేను మా బౌలర్లకు ఒక్కటే చెప్పాను. మీరు వికెట్లమీదకు గురిపెట్టండి.. ఒత్తిడికి గురికావొద్దు అని చెప్పా.  కానీ ఇందులో మేం విజయవంతం కాలేకపోయాం. అయితే ఈ మ్యాచ్ లో మేం వంద శాతం మా బెస్ట్ఇచ్చాం. ఈ మ్యాచ్ లో మేం ఓడిపోలేదు. బౌల్ అవుట్ లో మాకు కలిసిరాలేదంతే..’ అని చెప్పాడు.

 

అయితే  మాలిక్ కామెంట్స్ పై టీమిండియా అభిమానులు తమదైన శైలిలో కౌంటర్లిస్తున్నారు. బౌల్ అవుట్ అయినా మరేదైనా.. ఐసీసీ నిబంధనల  ప్రకారం ఓటమిని ఓటమే  అంటారని ఆయనకు ఎవరైనా చెప్పండ్రా బాబు అని కామెంట్స్ చేస్తున్నారు.  ఈ మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20  ఓవర్లలో 9వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్ కూడా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141  పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయి బౌల్ అవుట్ ద్వారా విజేతను నిర్ణయించారు. ఇక ఇదే  టోర్నీలో  భాగంగా ఫైనల్ పోరులో భారత్-పాకిస్తాన్ లే మళ్లీ తలపడ్డాయి.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసింది. అనంతరం పాకిస్తాన్.. 19.3ఓవర్లలో 152 పరుగులకే ఆలౌట్ అయింది. తద్వార భారత్.. తొలి టీ20 ప్రపంచకప్ ను  సగర్వంగా  అందుకుంది. 

 

Follow Us:
Download App:
  • android
  • ios