Asianet News TeluguAsianet News Telugu

సెంచరీతో చెలరేగిన స్మృతి మంధాన... హర్మన్‌ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ షో... వుమెన్స్ బీబీఎల్‌లో...

వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో సత్తా చాటుతున్న భారత మహిళా క్రికెటర్లు... సిడ్నీ థండర్స్ వుమెన్ టీమ్ తరుపున సెంచరీ చేసిన స్మృతి మంధానా, బిగ్‌బాష్ లీగ్‌లో సెంచరీ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర...

WBBL 2021: Indian Cricket Smriti Mandhana Century, Harmanpreet Kaur All-round Show
Author
India, First Published Nov 17, 2021, 5:42 PM IST

వుమెన్స్ బిగ్‌బాష్ లీగ్‌లో భారత క్రికెటర్లు అదరగొడుతున్నారు. భారత యంగ్ సన్సేషనల్ ప్లేయర్ స్మృతి మంధాన సెంచరీతో చెలరేగగా టీమిండియా టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఆల్‌రౌండ్ షోతో తన జట్టుకి విజయాన్ని అందించింది. మెల్‌బోర్న్ రెనెగేడ్స్ వుమెన్స్, సిడ్నీ థండర్ వుమెన్స్ మధ్య జరిగిన మ్యాచ్‌, ఆఖరి ఓవర్ ఆఖరి బంతిదాకా ఉత్కంఠభరితంగా సాగి థ్రిల్లర్‌ని తలపించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 175 పరుగుల భారీ స్కోరు చేసింది. టీమిండియా ప్లేయర్ జెమీమా రోడ్రిగ్స్ 4 బంతుల్లో 2 పరుగులు చేసి పెవిలియన్ చేరగా, కార్ల్ లీసన్ 7 పరుగులకే అవుట్ అయ్యింది...

ఎవ్లీన్ జోన్స్, హర్మన్ ప్రీత్ కౌర్ కలిసి మూడో వికెట్‌కి 91 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 33 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 42 పరుగులు చేసిన ఎవ్లీన్ జోన్స్ అవుటైనా హర్మన్ ప్రీత్ కౌర్ దూకుడు కొనసాగించింది. 22 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసిన జెస్ డుఫిన్‌తో కలిసి నాలుగో వికెట్‌కి 75 పరుగుల భాగస్వామ్యం జోడించింది హర్మన్ ప్రీత్... 

జెస్ డుఫిన్‌ ఇన్నింగ్స్ ఆఖరి బంతికి రనౌట్ కాగా, హర్మన్ ప్రీత్ కౌర్ 55 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు చేసి అజేయంగా నిలిచింది... కొన్నాళ్లుగా సరైన ఫామ్‌లో లేక పరుగులు చేయడానికి తెగ ఇబ్బందిపడుతున్న భారత టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, బ్యాటుతోనే కాకుండా బాల్‌తోనూ రాణించి అదిరిపోయే కమ్‌బ్యాక్ ఇచ్చింది...

176 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన సిడ్నీ థండర్ వుమెన్స్ జట్టుకి శుభారంభం దక్కలేదు. 14 బంతుల్లో 2 ఫోర్లతో సామీ జో జాన్సన్, హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యింది.  ఆ తర్వాత ఫోబ్ లిచ్‌ఫీల్డ్ కూడా ఒక్క పరుగుకే పెవిలియన్ చేరడంతో 46 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది సిడ్నీ థండర్స్ వుమెన్. ఈ దశలో వికెట్ కీపర్ తహలా విల్సన్ 39 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేయగా, ఆమెతో కలిసి మూడో వికెట్‌కి అజేయంగా 125 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పింది స్మృతి మంధాన.

మొదటి 15 బంతుల్లో 15 పరుగులు మాత్రమే చేసిన స్మృతి మంధాన, ఆ తర్వాత గేరు మార్చి బౌండరీల వర్షం కురిపించింది... 31 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్న స్మృతి మంధాన, హోల్లీ ఫెర్లింగ్ వేసిన 18వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో విరుచుకుపడి 24 పరుగులు రాబట్టి... 57 బంతుల్లోనే  సెంచరీ మార్కు అందుకుంది.

ఆఖరి ఓవర్‌లో సిడ్నీ థండర్స్ వుమెన్ జట్టు విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు కావాల్సి వచ్చాయి. అయితే ఆఖరి ఓవర్ వేసిన భారత ప్లేయర్ హర్మన్‌ప్రీత్ కౌర్ కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చింది. ఆఖరి బంతికి సిక్సర్ కావాల్సిన దశలో స్మృతి మంధాన, సింగిల్ మాత్రమే తీయగలడంతో 4 పరుగులు తేడాతో మెల్‌బోర్న్ రెనెగేడ్స్ జట్టుకి విజయం దక్కింది.

 Harmanpreet Kaur

బిగ్‌బాష్ లీగ్‌లో సెంచరీ చేసిన మొదటి భారత క్రికెటర్‌గా చరిత్ర క్రియేట్ చేసింది స్మృతి మంధాన. 64 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేసి అజేయంగా నిలిచిన స్మృతి మంధాన, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకుంది. ఈ టోర్నీలో 10 మ్యాచులు ఆడిన హర్మన్‌ప్రీత్ కౌర్ 390 పరుగులతో రెండో స్థానంలో ఉంటే, స్మృతి మంధాన 348 పరుగులతో నాలుగో స్థానంలో ఉంది. ఈ విజయంతో టోర్నీలో 8వ విజయాన్ని అందుకున్న మెల్‌బోర్న్ రెనెగేడ్స్ పాయింట్ల పట్టికలో టాప్‌లో ఉండగా, సిడ్నీ థండర్స్ వుమెన్ జట్టు 7 పరాజయాలు, 3 విజయాలతో ఏడో స్థానంలో ఉంది. 

Follow Us:
Download App:
  • android
  • ios