వెస్టిండీస్  కరీబియన్ ప్రీమియర్ టీ20 లీగ్ లో ఇద్దరు వెస్టిండీస్ క్రికెటర్లు గొడవకు దిగారు. ఈ టోర్నీలో మ్యాచ్ ఆడుతూ కరీబియన్ క్రికెటర్లు కార్లోస్ బ్రాత్ వైట్, లెండిన్ సిమన్స్ మైదానంలో కొట్టుకోబోయారు. ఓ రనౌట్ అప్పీల్ ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య గొడవకి కారణమైంది. ట్రినిబాగో నైట్‌రైడర్స్ తరఫున సిమన్స్ ఆడుతుండగా.. నేవీస్ పాట్రాయిట్స్ టీమ్‌కి బ్రాత్‌వైట్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.

మ్యాచ్‌లో నైట్‌రైడర్స్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా.. రామ్‌దిన్‌తో కలిసి సిమన్స్ టీమ్‌ని గెలిపించేందుకు కృషి చేస్తున్నాడు. ఈ దశలో అలెన్ విసిరిన బంతిని స్కేర్ లెగ్ దిశగా నెట్టిన రామ్‌దిన్ సింగిల్ కోసం సిమన్స్ పిలిచాడు. బంతి దూరంగా వెళ్లడంతో సిమన్స్ కూడా అంగీకరించి సులువుగా పరుగు పూర్తి చేశాడు. కానీ.. బంతిని అందుకున్న బ్రాత్‌వైట్ బెయిల్స్‌ను ఎగరగొట్టి రనౌట్ కోసం అప్పీల్ చేశాడు. అయితే.. అప్పటికే బ్యాట్స్‌మెన్ క్రీజులోకి చేరుకుని ఉండటంతో ఫీల్డ్ అంపైర్ ఆ అప్పీల్‌ని తిరస్కరించాడు.


క్రీజులోకి తాను వచ్చినా.. ఉద్దేశపూర్వకంగా బ్రాత్‌వైట్ రనౌట్ చేయడంపై సిమన్స్ కోపంతో అతనిపై మాటల యుద్ధానికి దిగాడు. దీంతో బ్రాత్‌వైట్ కూడా కోపంగా తిడుతూ సిమన్స్‌పైకి దూసుకొచ్చాడు. ఆటగాళ్ల మధ్య వాగ్వాదం పెరిగి.. కొట్టుకోబోతుండటంతో.. అక్కడే ఉన్న ఫీల్డ్ అంపైర్లు కలగజేసుకుని ఇద్దరినీ శాంతిపజేశారు. ఈ మ్యాచ్‌లో సిమన్స్ టీమ్ ఆరు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.