కోహ్లీ చాలా పెద్ద ఆటగాడు.. అందుకే అంపైర్లు అలా చేశారు.. కోడిగుడ్డు మీద ఈకలు పీకుతున్న పాక్ మాజీలు

T20 World Cup 2022: ఆడినా   ఆడకున్నా  కోహ్లీ మాత్రం వార్తల్లో వ్యక్తిగా నిలుస్తూనే ఉన్నాడు. ఇన్నాళ్లు కోహ్లీ ఫామ్ బాగోలేదని చర్చించిన మాజీలు ఇప్పుడు  కోహ్లీ  ఆటతీరు, ప్రవర్తనపై కామెంట్లు చేస్తూనే ఉన్నారు. 
 

Wasim Akram and Waqar Younis opens up on Virat Kohli's antics against Bangladesh

టీమిండియా మాజీ సారథి,  పరుగుల యంత్రంగా గుర్తింపు దక్కించుకున్న విరాట్ కోహ్లీ మూడు నెలల క్రితం వరకూ  తన ఫామ్ కోల్పోయినందుకు తీవ్ర విమర్శలపాలయ్యాడు. కోహ్లీ కథ ముగిసిందని.. ఇక అతడు ఫామ్ లోకి రావడం కష్టమేనన్న అభిప్రాయాలు వినిపించారు విశ్లేషకులు. ఇదే ఛాన్స్ అనుకుని పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు కూడా తమ యూట్యూబ్ ఛానెల్స్ లో వ్యూస్ పెంచుకోవడానికి కోహ్లీ ఆట మీద  విశ్లేషణలు చేసే వీడియోలు  రూపొందించారు. ఇన్నాళ్లు కోహ్లీ ఫామ్ గురించి చర్చించిన   పాక్ మాజీలు.. ఇప్పుడు అతడు  ఎదురేలేకుండా ఆడుతుంటే ఓర్వలేకపోతున్నారు. కోహ్లీ ఆటతీరు, మైదానంలో అతడు వ్యవహరిస్తున్న తీరుపై   చర్చలు చేస్తున్నారు. 

బంగ్లాదేశ్ తో ముగిసిన మ్యాచ్ లో కోహ్లీ హాఫ్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తన ఆటకంటే  రెండు విషయాల ద్వారా కోహ్లీ పేరు మీడియాలో నానుతూనే ఉంది. ఇందులో మొదటిది  అతడు బ్యాటింగ్ చేసే సమయంలో జరిగింది.  హసన్ మహ్మద్ వేసిన  ఓ బాల్.. తన నడుము కంటే ఎక్కువ ఎత్తులో  వచ్చింది. దీనిని అంపైర్ కంటే ముందే కోహ్లీ..  ఎరాస్మస్ దగ్గరికి వచ్చి అది హైట్ నోబాల్ కదా..? అన్నట్టు సైగ చేశాడు. 

దానికి ఎరాస్మస్ కూడా అంగీకరించే క్రమంలోనే అక్కడికి  వచ్చిన బంగ్లా సారథి షకిబ్ అల్ హసన్.. కోహ్లీతో కాసేపు వాదించాడు. తర్వాత ఇద్దరూ హత్తుకున్నారు. కానీ ఇందుకు సంబంధించిన వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. తాజాగా ఇదే అంశంపై  పాకిస్తాన్ మాజీ దిగ్గజాలు వసీం అక్రమ్, వకార్ యూనిస్ లు ఏ స్పోర్ట్స్ లో జరిగిన  టీవీ  చర్చలో  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ఇదే అంశంపై అక్రమ్ మాట్లాడుతూ.. ‘బహుశా  నాకు తెలిసి అప్పుడు షకీబ్ కోహ్లీతో.. నువ్వు నీ బ్యాటింగ్ చేయి. అంపైర్లను వాళ్ల అంపైరింగ్ చేయనివ్వు అని చెప్పి ఉంటాడు.  ఆటలో ఒక ఆటగాడు అంపైర్లను ఏదైనా అడుగుతున్నాడంటే అది వారి మీద ఒత్తిడి తెచ్చినట్టే అవుతుంది. మరి అడిగింది కోహ్లీ.. చాలా పెద్ద ఆటగాడు. అందుకే అంపైర్లు ఒత్తిడికి గురవుతారు..’ అని చెప్పాడు.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

 అంతేగాక  ‘అయినా ఇవన్నీ ఆటలో సహజమే అని నా అభిప్రాయం. ఒకవేళ  బంతి వైడ్ అయితే వాళ్లు అంపైర్లను దాని గురించి అడుగుతారు. ప్రస్తుతం నిబంధనలు ఎలా ఉన్నాయో నాకు తెలియవు. ఇప్పటి ప్లేయర్లకు వాటి మీద బాగా అవగాహన ఉండి ఉంటుంది..’ అని చెప్పాడు. వకార్ యూనిస్ కూడా ఇదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం  చేశాడు.

అయితే ఈ వ్యవహారంపై  పాక్ మాజీలు నోరు మూసుకుంటే మంచిదని ఇండియన్ ఫ్యాన్స్ వాపోతున్నారు.  భారత్-పాక్ మ్యాచ్ లో కూడా మహ్మద్ నవాజ్ నోబాల్ విషయంలో కూడా వాళ్లు  కోహ్లీపై ఇలాగే విమర్శలు చేశారు. అంపైర్లు బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అవాకులు చెవాకులు పేలుతున్నారు. ఇకనైనా ఈ కోడిగుడ్డు మీద ఈకలు పీకే  కార్యక్రమాలను మానుకుని ప్రపంచకప్ లో పాకిస్తాన్ గురించిన విశ్లేషణలు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios