Asianet News TeluguAsianet News Telugu

ఆ మ్యాచ్ రద్దు కాకుండా ఉండి ఉంటే..! ఐసీసీ టోర్నీలలో సౌతాఫ్రికాకు తప్పని వాన గండం

South Africa in ICC Tourny: మిగతా జట్లు, మ్యాచ్ లు, వాటి ఫలితాల సంగతి ఏమో గానీ  ఐసీసీ టోర్నీలలో సఫారీలకు  ప్రధాన ప్రత్యర్థి వర్షమే. అది ఆ జట్టుకు ఉన్న శాపమో లేక గత జన్మలో చేసుకున్న పాపమో గానీ దక్షిణాఫ్రికాకు వరుణుడు  మరోసారి విలన్ అయ్యాడు. 
 

Was Rain the Spoiler For South Africa  in ICC Tourneys, check Here
Author
First Published Nov 6, 2022, 10:57 AM IST

ఐసీసీ టోర్నీలలో అత్యంత దురదృష్టకరమైన జట్టు ఏదైనా ఉందా..? అంటే అది తప్పకుండా దక్షిణాఫ్రికానే.  మిగతా జట్లు, మ్యాచ్ లు, వాటి ఫలితాల సంగతి ఏమో గానీ  ఐసీసీ టోర్నీలలో సఫారీలకు  ప్రధాన ప్రత్యర్థి వర్షమే. అది ఆ జట్టుకు ఉన్న శాపమో లేక పూర్వ జన్మలో చేసుకున్న పాపమో గానీ గతంలో మాదిరిగానే ఆ జట్టుకు తాజాగా ఆస్ట్రేలియాలో జరుగుతున్న   టీ20 ప్రపంచకప్ లో  కూడా వరుణుడు  విలన్ గా మారాడు. నెదర్లాండ్స్ తో మ్యాచ్ లో స్వయంకృతాపరాధంతో ఓడినా జింబాబ్వే, పాకిస్తాన్ మ్యాచ్ లలో వర్షం వల్లే ఆ జట్టు సెమీస్ అవకాశాలు కోల్పోయింది. 

ఈ మెగా టోర్నీలలో వర్షానికి సఫారీలకు అవినాభావ సంబంధముంది. ఇప్పటివరకు వాన వల్ల దక్షిణాఫ్రికా  కోల్పోయిన కీలక మ్యాచ్ లు, వాటి ప్రభావం ఎలా ఉందో ఒకసారి చూద్దాం.. 

1992 ప్రపంచకప్ : 

సఫారీలకు అదే తొలి వన్డే  ప్రపంచకప్. ఇంగ్లాండ్ - సౌతాఫ్రికా మధ్య సెమీఫైనల్ మ్యాచ్. వేదిక సిడ్నీ. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్.. 45 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 252 పరుగులు చేసింది. అనంతరం సౌతాఫ్రికా.. లక్ష్య ఛేదనలో  విజయానికి దగ్గరగా వచ్చింది. మరో 13 బంతుల్లో 22 పరుగులు చేయాల్సి ఉండగా  వర్షం కురవడంతో  డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సమీకరణాలు మారాయి.  ఒక్క బంతిలో 22 పరుగులు చేయాల్సి వచ్చింది.   అంతే.. సఫారీ ఆశలు  వర్షంలో గల్లంతయ్యాయి. 

2003 ప్రపంచకప్ : 

ఈ మెగా టోర్నీలో సౌతాఫ్రికాను మరోసారి  వర్షం కొట్టిన సందర్భమిది.   తొలుత బ్యాటింగ్ చేసిన లంక.. 45 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 268 పరుగులు చేసింది. సఫారీలు లక్ష్య ఛేదనలో మెరుగ్గా ఆడింది.  హెర్షల్ గిబ్స్ (73), ప్రస్తుత సఫారీ హెడ్ కోచ్ మార్క్ బౌచర్ (45 నాటౌట్)  రాణించారు.   వర్షం కారణంగా టార్గెట్ ను 229 కే కుదించారు.  చివరి ఓవర్లో మార్క్ బౌచర్ ఐదో బంతిని సిక్సర్ గా మలిచాడు. ఆఖరి బంతికి సింగిల్ తీస్తే సఫారీలదే విజయం. కానీ బౌచర్  అలా చేయలేదు. దీంతో మ్యాచ్  టై అయింది. అప్పటికే  పలు మ్యాచ్ లు ఓడిన సఫారీలు.. టోర్నీ నుంచి నిష్క్రమించారు.  

2022లో.. 

తాజా వరల్డ్ కప్ విషయానికొస్తే..   గ్రూప్-2లో ఉన్న సఫారీలు తొలి మ్యాచ్ లో జింబాబ్వేతో తలపడింది. ఈ మ్యాచ్ కు వర్షం పదే పదే అంతరాయం కలిగింది.  వర్షం వల్ల మ్యాచ్ ను 9 ఓవర్లకు కుదించారు.  జింబాబ్వే.. 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది. లక్ష్య చేదనలో సఫారీ బ్యాటర్ క్వింటన్ డికాక్ ఫోర్ల వర్షం కురిపించాడు.  18 బంతుల్లోనే 47 పరుగులు చేశాడు. అప్పటికే సౌతాఫ్రికా మూడో ఓవర్ తర్వాత వర్షం  కురవడంతో మ్యాచ్ ను 7 ఓవర్లలో 64 టార్గెట్ గా సెట్ చేశారు. సికిందర్ రజా  నాలుగో ఓవర్ వేయగానే వర్షం మళ్లీ ప్రారంభమైంది. లక్ష్యానికి సఫారీలు 13 పరగులు దూరంలో ఉండగా వర్షం మళ్లీ కురిసింది.  దీంతో మ్యాచ్ ను రద్దు చేసి ఇరు జట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. 

 

పాకిస్తాన్ తోనూ.. 

తొలి మ్యాచ్ రద్దైనా  సఫారీలు.. తర్వాత బంగ్లాదేశ్,  భారత్ లను ఓడించి గ్రూప్ టాపర్ గా నిలిచారు. కానీ మూడు రోజుల క్రితం పాకిస్తాన్ తో ముగిసిన మ్యాచ్ లో మరోసారి వర్షం వారి ఆశలపై నీళ్లు చల్లింది.  ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది.   లక్ష్య ఛేదన సమయంలో  సౌతాఫ్రికా.. 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. కానీ  వర్షం మళ్లీ సఫారీ ఆశలపై నీళ్లు కుమ్మరించింది. వాన వెలిశాక టార్గెట్ ను 30 బంతుల్లో 73 పరుగులుగా సెట్ చేశారు. కానీ వర్షం తర్వాత బౌలింగ్ కు అనుకూలించే పిచ్ పై సఫారీ బ్యాటర్లు తడబడ్దారు.  14 ఓవర్లలో 142 పరుగుల  లక్ష్య ఛేదనలో  దక్షిణాఫ్రికా.. 14 ఓవర్లలో 9 వికెట్లకు 108 పరుగులే చేసింది. పలితంగా 33 పరుగుల తేడాతో పాక్ గెలిచి సెమీస్ రేసులోకి వచ్చింది. 

ఈ టోర్నీలో దక్షిణాఫ్రికా ఐదు మ్యాచ్ లు ఆడి రెండు విజయాలు, రెండు పరాజయాలతో  ప్రస్తుతానికి రెండో స్థానంలో ఉంది. ఆ జట్టు ఖాతాలో ఐదు పాయింట్లున్నాయి. ఒకవేళ  జింబాబ్వే తో మ్యాచ్ లో మరో ఓవర్ గనక పడుంటే సఫారీలు విజయం సాధించేవారే. కానీ అలా జరుగలేదు. అలా జరిగుంటే సెమీస్ రేసు మరింత రసవత్తరంగా ఉండేది.ఏదేమైనా ఐసీసీ టోర్నీలలో తమకు  ప్రధాన ప్రత్యర్థి ఇతర దేశాలు కాదు వరుణుడు అని సఫారీలు మరోసారి నిరాశగా వెనుదిరుగుతున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios