క్రికెట్‌లో సరికొత్త కోణం ఆవిష్కరించిన ఘనత ఐపీఎల్‌ది. 2008లో ఐపీఎల్‌ ఆరంభమైనప్పుడు అదో సంచలనం. ఇంగ్లాండ్‌ ప్రీమియర్‌ లీగ్‌, అమెరికా ఎన్‌బిఏ తరహాలో ప్రాంఛైజీలు, వేలంలో క్రికెటర్లను దక్కించుకోవటం క్రికెట్‌ ప్రియులకు కొత్త అనుభూతి. 

క్రికెటర్లకు సైతం ఆటగాళ్ల వేలం నూతన అనుభూతిని మిగిల్చింది. జాతీయ జట్టుకు ఆడుతున్న ఆటగాళ్లతో పాటు నాణ్యమైన దేశవాళీ క్రికెటర్లు సైతం వేలంలో తమను ఎవరు తీసుకుంటారు, ఎంత ధరకు సొంతం చేసుకుంటారనే అంచనాలు వేసుకోవటంలో నిమగమయ్యారు!. 

భారత వికెట్‌కీపర్‌, బ్యాట్స్‌మన్‌ దినేశ్‌ కార్తీక్‌ సైతం ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కోల్‌కత నైట్‌రైడర్స్‌కు నాయకత్వం వహిస్తున్న దినేశ్‌ కార్తీక్‌ 2008 ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం తన మనసును తీవ్రంగా గాయపరిచిందని, చెన్నై సూపర్‌ కింగ్స్‌ పిలుపు కోసం ఎదురు చూసి నిరాశే మిగిలిందిన గుర్తు చేసుకున్నాడు. 

' 2008 ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలం. నేను ఆస్ట్రేలియాలో ఉన్నాను. బెంగళూర్‌లో వేలం జరుగుతోంది. వేలానికి ముందు నేను కొన్ని లెక్కలు వేసుకున్నా. తమిళనాడు నుంచి నేనే పెద్ద క్రికెటర్‌ను, జాతీయ జట్టు తరఫున సైతం ఆడుతున్నాను. చెన్నై సూపర్‌ కింగ్స్‌ నన్ను సొంతం చేసుకోవటం ఖాయం అనుకున్నాను" అని తన మనసులోని మాటను బయటపెట్టాడు దినేష్ కార్తీక్. 

తనను ఎంపిక చేసుకోవడంపై దినేష్ కార్తీక్ నమ్మకంగా ఉన్నప్పటికీ... కేవలం కెప్టెన్సీ తనకు అప్పగిస్తారా లేదా అనే విషయంలో మాత్రమే తర్జనభర్జన పడ్డట్టు చెప్పాడు.  ఇక్కడిదాకా బాగానే ఉన్నా వేలం ప్రారంభమయ్యే సరికి మాత్రం తన ఆలోచనలకు భిన్నంగా, తాను షాక్ కి గురవ్వాల్సి వచ్చిందని దినేష్ కార్తీక్ చెప్పుకొచ్చాడు. 

"చెన్నై సూపర్‌ కింగ్స్‌ తొలుత ఎం.ఎస్‌ ధోని (1.5 మిలియన్‌ డాలర్లు) రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ధోని అప్పుడు నా పక్కనే కూర్చున్నాడు. చెన్నై తనను తీసుకుంటుందనే విషయం అసలు నాకు అతడు చెప్పలేదు. బహుశా, అతనికి తెలియకపోవచ్చు. కానీ ఆ సంఘటన నన్ను నా మనసుకు బాగా గుచ్చుకుంది. ధోని తర్వాతైనా నన్ను తీసుకుంటారని భావించాను. ఇప్పటికి 13 ఏండ్లు అయిపోతుంది. చెన్నై సూపర్‌ కింగ్స్‌ పిలుపు కోసం ఎదురుచూస్తూనే ఉన్నాను' అని దినేశ్‌ కార్తీక్‌ చెప్పుకొచ్చాడు. 

దినేశ్‌ కార్తీక్‌ ఐపీఎల్‌లో నాలుగు ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. ఢిల్లీ డెర్‌డెవిల్స్‌ (డిల్లీ క్యాపిటల్స్‌), కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌, ముంబయి ఇండియన్స్‌లకు ఆడాడు. ఇప్పుడు కోల్‌కత నైట్‌రైడర్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. 

ఐపీఎల్‌లో ప్రతిసారీ ప్లే ఆఫ్స్‌ చేరిన ఏకైక జట్టు చెన్నై సూపర్‌ కింగ్స్‌. ధోని సారథ్యంలో చెన్నై మూడుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌గా నిలిచింది. విదేశీ క్రికెటర్లు సైతం చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడాలని పోటీ పడిన సందర్భాలు కూడా ఉన్నాయి. 

తమిళనాడు క్రికెటర్‌గా దినేశ్‌ కార్తీక్‌ సైతం చెన్నై సూపర్‌ కింగ్స్‌కు ఆడాలని బలంగా కాంక్షించాడు. అయితే ఐపీఎల్‌ ఆటగాళ్ల వేలంలో దినేశ్‌ కార్తీక్‌ కోసం చెన్నై ఏనాడూ ఆసక్తి వ్యక్తపరచలేదు. వికెట్‌ కీపర్‌గా ఎం.ఎస్‌ ధోని ఉండటంతో, మరో వికెట్‌ కీపర్‌ బ్యాట్స్‌మన్‌పై భారీగా ఖర్చు చేయటం తెలివైన నిర్ణయం కాదని సిఎస్‌కె ఇన్నాండ్లూ కార్తీక్‌ను తీసుకుని ఉండకపోవచ్చు!. 

పరిస్థితిని చూడబోతుంటే... ధోని కనీసం మరో రెండేండ్లయినా ఐపీఎల్ లో చెన్నైకి ప్రాతినిధ్యం ఖచ్చితంగా వహిస్తాడు అనేది సుస్పష్టం. అప్పటివరకు దినేష్ కార్తీక్ వేచి చూసినా, ఆ తరువాత అయినా చెన్నై అతగాడిని తీసుకుంటుందా అనేది అనుమానమే!