Asianet News TeluguAsianet News Telugu

ద్రావిడ్ కంటే ఇంజమామ్ బెటర్ ప్లేయర్ అన్న పాక్ బౌలర్.. గణాంకాలు చూశాకే ఈ మాట అంటున్నాడా..?

టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్   బ్యాటింగ్ దిగ్గజం అనడంలో ఇసుమంతైనా సందేహం లేదు. తాను క్రికెట్ ఆడిన రోజుల్లో  ప్రపంచ స్థాయి బౌలర్లకు అతడో సింహస్వప్నం. టెస్టులలో అయితే ‘ది వాల్..’ 

Wahab Riyaz Says Inzamam was always Better Player Then Rahul Dravid, Fans Reacts
Author
First Published Jan 6, 2023, 4:06 PM IST

భారత్ - పాకిస్తాన్  ల మధ్య క్రికెట్ వైరం ఈనాటిది కాదు. ఇరు దేశాల నుంచి దిగ్గజ క్రికెటర్లు  ప్రపంచ క్రికెట్ ను ఏలారు.  కపిల్ దేవ్, సునీల్ గవాస్కర్, సచిన్ టెండూల్కర్,  విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మనకు ఉంటే ఇమ్రాన్ ఖాన్, వసీం అక్రమ్, జావేద్ మియాందాద్,  ఇంజమామ్ ఉల్ హక్,  షోయభ్ అక్తర్,  బాబర్ ఆజమ్ వాళ్లకున్నారు.  అయితే ఆటగాళ్ల మధ్యలో ఎవరు గొప్ప..? అన్న సందర్భం వచ్చినప్పుడు  గణాంకాలే వాస్తవాలు మాట్లాడతాయి. తాజాగా  పాక్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్.. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ కంటే గొప్ప బ్యాటర్ అని, అతడు ఆల్ పార్మాట్ ప్లేయర్ అని ఆ జట్టు మాజీ పేసర్ వహబ్ రియాజ్ సంచలన కామెంట్స్ చేశాడు. 

క్రిక్ బ్రిడ్జ్ అనే యూట్యూబ్ ఛానెల్ లో చర్చ సందర్భంగా రియాజ్ కు ఈ ప్రశ్న ఎదురైంది. ‘ఇంజమామ్, ద్రావిడ్ లలో ఎవరు బెస్ట్ బ్యాటర్?’అని   ప్రశ్నించగా దానికి రియాజ్ స్పందిస్తూ.. ‘కచ్చితంగా ఇంజమామ్. అతడు ద్రావిడ్ కంటే  బెటర్ ప్లేయర్ అని నా అభిప్రాయం. ఇంజమామ్ భాయ్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్.   అతడు తన కెరీర్ లో  చాలావరకూ షాట్లు పేసర్ల బౌలింగ్ లలోనే ఆడేవాడు. ద్రావిడ్ కంటే అతడే గొప్ప బ్యాటర్..’ అని వ్యాఖ్యానించాడు. 

ఈ  వ్యాఖ్యలు టీమిండియా ఫ్యాన్స్ కు ఆగ్రహం తెప్పించాయి. అసలు రియాజ్ వాస్తవాలు తెలియకుండా మాట్లాడుతున్నాడని, గణాంకాలు చూసుకుని మాట్లాడితే మంచిదని మండిపడుతున్నారు. వికెట్ల మధ్య పరుగెత్తడానికే ఇబ్బందిపడే  ఇంజమామ్ తో ద్రావిడ్ కు పోలిక ఏంటని  ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

 

ఇదే విషయమై పలువురు నెటిజన్లు స్పందిస్తూ.. ‘ఇంజమామ్ మంచి ఆటగాడు. అందులో సందేహం లేదు. కానీ అతడు వికెట్ల మధ్య పరుగెత్తేకంటే నడిచిందే ఎక్కువ.  నాకు తెలిసి అతడు ఎక్కువ సార్లు రనౌట్ అయ్యాడు.  కానీ ద్రావిడ్ అలాకాదు. చాలా ఫిట్.  టెస్టు, వన్డేలలో ఇంజమామ్ కంటే  ద్రావిడ్ చేసిన సెంచరీలే ఎక్కువ. లెక్కలు చూసుకో..’, ‘ద్రావిడ్ ఆల్ ఫార్మాట్ ప్లేయర్ మాత్రమే కాదు.  అతడు టీమిండియా కోసం ఇన్నింగ్స్ ఓపెన్ చేశాడు. ఓపెనర్ స్థానం నుంచి ఆరో స్థానం వరకూ ఎక్కడైనా బ్యాటింగ్ చేశాడు. వికెట్ కీపింగ్ చేశాడు. స్లిప్స్ లో ఎక్కువ క్యాచ్ లు పట్టింది అతడే. గ్రౌండ్ లో ఎక్కడైనా ఫీల్డింగ్ చేశాడు. ఇవన్నీ ఇంజమామ్ కలలో మాత్రమే ఊహించేవి...’ అని  కామెంట్స్ చేస్తున్నారు. 

గణాంకాల విషయానికొస్తే.. ప్రపంచ టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో ద్రావిడ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. ద్రావిడ్  164 టెస్టులలో 13,288 పరుగులు చేశాడు. ఇందులో 36 సెంచరీలు ఉన్నాయి. సగటు  52.31గా ఉంది.  344 వన్డేలు ఆడి 10,889  పరుగులు చేశాడు. సగటు 39.16గా ఉండగా  12 సెంచరీలు, 83 హాఫ్ సెంచరీలున్నాయి. ఇంజమామ్.. 120 టెస్టులు ఆడి 8,830 రన్స్ చేశాడు. సగటు 49.60 కాగా సెంచరీలు  25 మాత్రమే. వన్డేలలో 378 మ్యాచ్ లు ఆడి 11,739 పరుగులు చేశాడు.  సెంచరీలు 10 మాత్రమే.  

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios