టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అనగానే వెంటనే గుర్తొచ్చేది ఎంత ఒత్తిడిలో వున్న చెక్కు చెదరని మనో నిబ్బరం, విజయం కోసం తుది వరకు పోరాటం, డీఆర్ఎస్, మెరుపు వేగంతో స్టింపింగ్.

అయితే అన్నింటికంటే ఎక్కువగా ఛేజింగ్‌లలో ఆయన లాస్ట్ ఓవర్‌లో కొట్టే ఫినిషింగ్ షాట్. దీనిని అనుకరించేందుకు ఎంతో మంది ప్రయత్నించారు. వారిలో కొందరు సక్సెస్ అయితే, మరికొందరు చతికిలపడ్డారు.

అసలు మ్యాటర్‌లోకి వెళితే... తాజాగా దేశవాలీ టోర్నీ సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీలో భాగంగా బుధవారం బరోడా, హర్యానాల మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ప్రేక్షకులను మునివేళ్లపై నిలబడేలా చేసింది.

బరోడా బ్యాట్స్‌మన్‌ విష్ణు సోలంకి చివరి బంతికి ధోని తరహాలో హెలికాప్టర్‌ సిక్స్‌ కొట్టి జట్టును సెమీస్‌ చేర్చాడు. మొదట బ్యాటింగ్‌ చేసిన హర్యానా జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసింది.

లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన బరోడా జట్టు ఆరంభం నుంచి దూకుడుగానే ఆడింది. ఓపెనర్‌ స్మిత్‌ పటేల్‌ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన విష్ణు సోలంకి దూకుడుగా ఆడాడు. 5 సిక్సర్లు, 4 ఫోర్లతో 46 బంతుల్లోనే 71 పరుగులతో వీరవిహారం చేశాడు.

ఇదే సమయంలో 19వ ఓవర్‌ వేసిన హర్యానా బౌలర్‌ మోహిత్‌ శర్మ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. కేవలం 4 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో చివరి ఓవర్‌కు బరోడా జట్టు విజయానికి 6 బంతుల్లో 18 పరుగులు కావాల్సి వచ్చింది. 

నిర్ణాయాత్మక ఓవర్ వేసిన సుమిత్‌ కుమార్‌ .. మొదటి బంతికి సింగిల్‌ ఇచ్చాడు. రెండో బంతిని విష్ణు సోలంకి గాల్లోకి లేపగా.. కష్టతరమైన క్యాచ్‌ను సుమీత్‌ వదిలేశాడు. అది ఎంత పెద్ద పొరబాటో తర్వాత అతనికి అర్ధమైంది. మూడో బంతికి సింగిల్‌ రావడంతో బరోడాకు 3 బంతుల్లో 15 పరుగులు కావాల్సి వచ్చింది.

నాలుగో బంతిని సిక్స్‌ కొట్టిన సోలంకి.. ఐదో బంతిని ఫోర్‌గా మలిచాడు. చివరి బంతికి 5 పరుగులు అవసరమైన దశలో సోలంకి.. ధోని స్టైల్లో హెలికాప్టర్‌ సిక్స్‌తో జట్టును ఒంటిచేత్తో సెమీస్‌కు చేర్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.