భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ మధ్య టీమిండియా తర్వాతి సూపర్ స్టార్ ల గురించి ఆసక్తికర చర్చ సాగింది. భజ్జీ పంజాబ్ ప్లేయర్లకు మద్దతునివ్వడంతో....
టీమిండియాలో ప్రస్తుతం గుజరాతీ క్రికెటర్ల హవా నడుస్తోంది. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, హార్ధిక్ పాండ్యా, పుజారాలతో గుజరాత్ క్రికెటర్లు దూసుకుపోతున్నారు. అయితే రాబోయే రోజుల్లో మాత్రం పంజాబ్ క్రికెటర్లు ఆ ప్లేస్ ను భర్తీ చేయబోతున్నారు. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ శుభ్‌మన్ గిల్ తో పాటు యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్, స్పిన్ సంచలనం రవి బిష్ణోయ్ లు పంజాబ్ కు చెందినవారే కావడం గమనార్హం. తాజాగా ఇదే విషయమై టీమిండియా మాజీ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, హర్భజన్ సింగ్ ల మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది.
స్టార్ స్పోర్ట్స్ లో జరిగిన ‘నెక్స్ట్ సూపర్ స్టార్’ కార్యక్రమంలో భజ్జీ, వీరూలతో పాటు ఇర్ఫాన్ పఠాన్ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా ముందు ఇర్ఫాన్ మాట్లాడుతూ.. రాబోయే ఐదేండ్లలో ఫాస్ట్ బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ రాటుదేలుతాడని అన్నాడు. ఇక స్పిన్నర్ల విషయానికొస్తే రవి బిష్ణోయ్ పేరు చెప్పాడు.
‘స్పిన్నర్లలో తర్వాతి సూపర్ స్టార్ గురించి చెప్పాలంటే రవి బిష్ణోయ్. అతడు చాలా అండర్ రేటెడ్ క్రికెటర్. కానీ నేను అతడి ఆటను దగ్గర్నుంచి గమనిస్తున్నా. అతడో డిఫరెండ్ స్పిన్నర్. రాబోయే ఐదేండ్లలో బిష్ణోయ్ మరోస్థాయిలో ఉంటాడు...’అని అన్నాడు. అప్పుడు హర్భజన్ అందుకుని.. ‘నా వరకైతే ఫాస్ట్ బౌలర్ల గురించి చెప్పాలంటే అర్ష్‌దీప్ సింగ్. ప్రస్తుతం మనం చూస్తున్న అర్ష్‌దీప్ భవిష్యత్ లో సూపర్ స్టార్ గా ఎదగడం ఖాయం..’అని చెప్పాడు.
ఇంతలోనే అక్కడే ఉన్న వీరూ.. ‘వీళ్లంతా పంజాబీ ప్లేయర్లేనా...?’ అని ఫన్నీగా అన్నాడు. దానికి భజ్జీ స్పందిస్తూ.. ‘లేదు. లేదు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఉన్నారు. పంజాబ్ గురించి కాదు గానీ మనం ఇక్కడ మాట్లాడుకునేది టాలెంట్ గురించి.. అది అర్ష్‌దీప్ లో కావాల్సినంత ఉంది..’ అని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఇదిలాఉండగా అర్ష్‌దీప్ గత కొంతకాలంగా దేశవాళీతో పాటు ఐపీఎల్ లో నిలకడగా రాణించి గతేడాది భారత జట్టుకు అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకు అర్ష్‌దీప్.. భారత్ తరఫఉన 26 టీ20లు ఆడి 41 వికెట్లు పడగొట్టాడు. 2022 టీ20 వరల్డ్ కప్ లో కూడా మెరుగ్గా రాణించాడు. ఇక బిష్ణోయ్.. 10 టీ20లు, ఒక వన్డే ఆడాడు. టీ20లలో 16 వికెట్లు పడగొట్టాడు.
