భారత జట్టు ఎప్పుడు విఫలమైనా భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ సతీమణి అనుష్క శర్మను టార్గెట్ చేస్తూ ట్రోల్స్ చేయడం నెటిజన్లకు అలవాటు. ఐపీఎల్‌ 2020 సీజన్ ప్రారంభంలో పెద్దగా పరుగులు చేయలేకపోయిన విరాట్ కోహ్లీ పేలవఫామ్‌కి అనుష్క శర్మే కారణమంటూ భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపాయి. అలాంటి సోషల్ మీడియాలో కోకొల్లలు.

ఆడిలైడ్ పింక్ బాల్ టెస్టులో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులకే పరిమితమై చెత్త రికార్డు నమోదుచేయడంతో మరోసారి అనుష్కను టార్గెట్ చేశారు నెటిజన్లు. అనుష్క శర్మ డెలివరీ కోసం ఆసుపత్రికి వెళ్లిందని, అందుకే విరాట్ కోహ్లీని సాధ్యమైనంత తొందరగా ఇండియాకి పంపించాలనే తాపత్రయంతో భారత బ్యాట్స్‌మెన్ ఇలా పెవిలయన్‌కి క్యూ కట్టారని ట్రోల్ చేస్తున్నారు చాలామంది.

విరాట్ కోహ్లీ పర్ఫామెన్స్‌తో పర్సనల్ లైఫ్‌ని లింక్ చేయొద్దని అనుష్క శర్మ కూడా స్వయంగా విన్నవించుకున్నా నెటిజన్లు మాత్రం ఆమెను వదలడం లేదు. నిండు గర్భిణిగా ఉన్న అనుష్క శర్మను ఇలా టార్గెట్ చేయడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నిస్తున్నారు మరికొందరు.