Asianet News TeluguAsianet News Telugu

విరాట్ కోహ్లీని అవుట్ చేశానని నా మనవళ్లతో గర్వంగా చెప్పుకుంటా... లీస్టర్‌షైర్ ప్లేయర్ రోమన్ వాకర్...

టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన లీస్టర్‌షైర్ బౌలర్ రోమన్ వాకర్... విరాట్ కోహ్లీని ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేర్చిన రోమన్... 

Virat Kohli wicket is one for the Grandkids, Says Leicestershire Cricketer Roman Walker
Author
India, First Published Jun 25, 2022, 4:07 PM IST

విరాట్ కోహ్లీ సెంచరీ కోసం దాదాపు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఐపీఎల్‌లో కానీ, టీమిండియా తరుపున టెస్టుల్లో, వన్డేల్లో, టీ20ల్లో కానీ సెంచరీ చేయలేకపోతున్న విరాట్ కోహ్లీ, లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న ప్రాక్టీస్ మ్యాచ్‌లోనూ మూడంకెల స్కోరును అందుకోలేకపోయాడు...

శుబ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, హనుమ విహారి, శ్రేయాస్ అయ్యర్, రవీంద్ర జడేజా వికెట్లు త్వరత్వరగా కోల్పోవడంతో 81 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది భారత జట్టు. ఈ దశలో విరాట్ కోహ్లీ 69 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 33 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచు ఆడుతున్న 21 ఏళ్ల రోమన్ వాకర్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. అంపైర్ అవుట్‌గా ప్రకటించినా విరాట్ కోహ్లీ ఆ నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేయడం కెమెరాల్లో స్పష్టంగా కనిపించింది.. అయితే ప్రాక్టీస్ మ్యాచ్‌లో అంపైర్ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేసే డీఆర్‌ఎస్ అందుబాటులో ఉండదు. దీంతో నిరాశగా పెవిలియన్ చేరాడు విరాట్ కోహ్లీ...

 అంతకుముందు 47 బంతుల్లో 3 ఫోర్లతో 25 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మను, హనుమ విహారి, రవీంద్ర జడేజాలను అవుట్ చేసిన రోమన్ వాకర్, శార్దూల్ ఠాకూర్‌ని క్లీన్ బౌల్డ్ చేసి 5 వికెట్లు పూర్తి చేసుకున్నాడు...

11 ఓవర్లు బౌలింగ్ చేసిన రోమన్ వాకర్ 5 మెయిడిన్లతో 24 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసి అద్భుత ప్రదర్శన కనబర్చాడు. రోమన్ వాకర్ బౌలింగ్‌లో ఒక్క అదనపు పరుగు కూడా లేకపోవడం మరో విశేషం...

‘తొలి ఇన్నింగ్స్‌లో నా పర్పామెన్స్‌ నాకు సంతృప్తినిచ్చింది. ఇండియాలాంటి టాప్ క్లాస్ టీమ్‌తో ఆడుతున్నప్పుడు టాప్ క్లాస్ పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఐదు వికెట్లు తీస్తానని మాత్రం అస్సలు అనుకోలేదు. విరాట్ కోహ్లీ వికెట్ నా ఫెవరెట్.. ఎందుకంటే నా టీమ్ మేట్స్‌లో కొంత మంది కూడా ఈ వికెట్ గురించి మనవళ్లతో గర్వంగా చెప్పుకోవచ్చని నాకు మెసేజ్ చేశారు. అది నిజమే. విరాట్ కోహ్లీ వరల్డ్ క్లాస్ బ్యాట్స్‌మెన్...’ అంటూ కామెంట్ చేశాడు రోమన్ వాకర్...

భారత బౌలర్లు జస్ప్రిత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ వార్మప్ మ్యాచ్‌లో లీస్టర్‌షైర్ క్లబ్ తరుపున ఆడుతున్నారు. దీంతో రోమన్ వాకర్‌కి వారితో కలిసి బంతిని షేర్ చేసుకునే అవకాశం కూడా దక్కింది. ‘వాళ్లిద్దరూ మంచి బౌలర్లు. నాకు సలహా కావాల్సినప్పుడు వాళ్లు వచ్చి, మాట్లాడి అమూల్యమైన సూచనలు చేశారు. ఇలా టీమ్‌తో సంబంధం లేకుండా సలహాలు ఇవ్వడం చాలా గొప్ప విషయం...’ అంటూ చెప్పుకొచ్చాడు రోమన్ వాకర్... 

బౌలింగ్‌లో 5 వికెట్లు తీసిన రోమన్ వాకర్, 138 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న తన టీమ్‌ని బ్యాటుతోనూ ఆదుకున్నాడు. రిషబ్ పంత్‌తో కలిసి ఏడో వికెట్‌కి 70 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు రోమన్ వాకర్. ‘రిషబ్ పంత్ చాలా గొప్ప టెక్నిక్ ఉన్న ప్లేయర్. అతను మాతో చాలా ఈజీగా కలిసి పోయాడు. అతను షాట్ ఆడిన ప్రతీసారి నవ్వుతూ పలకరిస్తాడు. షాట్ మిస్ అయినా నవ్వుతాడు, చెత్త షాట్ ఆడినా నవ్వుతాడు. తన ఆటను పూర్తిగా ఎంజాయ్ చేసే అలాంటి ప్లేయర్లు చాలా తక్కువ మంది ఉంటారు...’ అంటూ తెలిపాడు రోమన్ వాకర్...

57 బంతుల్లో 7 ఫోర్లతో 34 పరుగులు చేసిన రోమన్ వాకర్, రవీంద్ర జడేజా బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 8 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేయగా, లీస్టర్‌షైర్ 244 పరుగులకి ఆలౌట్ అయ్యింది... మహ్మద్ షమీ, రవీంద్ర జడేజా మూడేసి వికెట్లు తీయగా సిరాజ్, శార్దూల్ ఠాకూర్ రెండేసి వికెట్లు తీశారు.

Follow Us:
Download App:
  • android
  • ios