సునీల్ శెట్టికి కాబోయే అల్లుడి కోసం బ్యాటింగ్ కోచ్‌గా మారిన కోహ్లీ.. ఆ విషయంలో కీలక టిప్స్ ఇచ్చి విరాట్
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భారత్ ఆడిన మూడు మ్యాచులలో దారుణంగా విఫలమైన టీమిండియా ఓపెనర్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టికి కాబోయే అల్లుడు కెఎల్ రాహుల్ ఆటతీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
పొట్టి ప్రపంచకప్ లో వరుస వైఫల్యాలతో ఇబ్బందిపడుతూ విమర్శలతో ముప్పేటదాడి ఎదుర్కుంటున్న టీమిండియా ఓపెనర్ కెఎల్ రాహుల్ కు తర్వాత బంగ్లాదేశ్ తో ఆడబోయే మ్యాచ్ కీలకం కానున్నది. బాలీవుడ్ వెటరన్ నటుడు సునీల్ శెట్టి కూతురు అతియా శెట్టిని త్వరలోనే వివాహమాడనున్న రాహుల్.. ఇప్పటికే మూడు మ్యాచ్ లలో కలిపి 22 (4, 9, 9) పరుగులు మాత్రమే చేశాడు. దీంతో రాహుల్ పై విమర్శల వర్షం కురుస్తున్నది. కానీ రాహుల్ కు ఇప్పుడు టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ బ్యాటింగ్ కోచ్ గా మారాడు. అడిలైడ్ లో రాహుల్ కు కోహ్లీ బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు.
అడిలైడ్ వేదికగా బుధవారం బంగ్లాదేశ్ తో జరుగబోయే మ్యాచ్ కోసం భారత జట్టు ఇప్పటికే అక్కడికి చేరుకుని ప్రాక్టీస్ మొదలుపెట్టింది. అయితే వరుసగా విఫలమవుతున్న రాహుల్ మీద భారత జట్టు ప్రత్యేక దృష్టి పెట్టింది. అందుకే హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ లు రాహుల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు.
ఇక మంగళవారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా విరాట్ కోహ్లీ కూడా రాహుల్ తో కాసేపు ముచ్చటించాడు. ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులను వెంటాడి పెవిలియన్ చేరుతున్న రాహుల్ కు ఆ వీక్ నెస్ నుంచి బయటపటడటమెలాగనేదానిపై టిప్స్ ఇచ్చాడు. కొద్దిరోజుల క్రితం కోహ్లీ కూడా ఇటువంటి బంతులకే ఔటయ్యేవాడు. కానీ ఇంగ్లాండ్ టూర్ తర్వాత కొద్దిరోజుల విరామం తీసుకున్న కోహ్లీ ఈ బలహీనతను అధిగమించి మునపటి ఫామ్ ను అందుకున్నాడు.
అడిలైడ్ లో ప్రాక్టీస్ సెషన్ లో కోహ్లీ.. రాహుల్ తో ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతులతో పాటు మానసింకంగా మ్యాచ్ కు ఎలా సిద్ధమవ్వాలో కూడా చెప్పినట్టు తెలుస్తున్నది. రాహుల్ కు కోహ్లీ టిప్స్ చెబుతున్న సమయంలో భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అక్కడే ఉండటం విశేషం.
ఇక వరుసగా రెండు మ్యాచ్ లను గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఓడటం ద్వారా సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. బుధవారం బంగ్లాదేశ్ తో జరుగబోయే మ్యాచ్ భారత్ కు చాలా కీలకం కానుంది. ఈ మ్యాచ్ కు వర్షం ముప్పు ఉందని వార్తలు వస్తున్నాయి. అయితే నేడు అడిలైడ్ లో వర్షం లేదని.. రేపు కూడా ఇదే వాతావరణం కొనసాగాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు.