హిట్‌మ్యాన్‌ను అధిగమించిన రన్ మెషీన్.. కిర్రాక్ ఫోటోతో ట్రిబ్యూట్ ఇచ్చిన ఐసీసీ
T20 World Cup 2022: పాకిస్తాన్ తో ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ తన అనుభవన్నంతా ఉపయోగించి భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో కోహ్లీ.. రోహిత్ శర్మను అధిగమించి అరుదైన రికార్డు సృష్టించాడు.
ఆదివారం భారత్-పాకిస్తాన్ మధ్య ముగిసిన ఉత్కంఠ పోరులో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో 31 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన దశలో విరాట్ కోహ్లీ.. హార్ధిక్ పాండ్యాతో కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పొడు. ఇద్దరూ కలిసి ఐదో వికెట్ కు 113 పరుగుల పార్ట్‌నర్షిప్ ను జోడించారు. కోహ్లీ.. ఈ మ్యాచ్ లో 53 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 82 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. దీంతో అతడు టీమిండియా సారథి రోహిత్ శర్మ ను అధిగమించాడు. టీ20లలో ఇప్పుడు అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీయే నయా కింగ్..
ఈ మ్యాచ్ కు ముందు టీ20 (అంతర్జాతీయ) లలో 3,691 పరుగులు చేశాడు. కానీ ఈ మ్యాచ్ లో అతడు 82 పరుగులు చేయడంతో ఈ ఫార్మాట్ లో ఇప్పటివరకు అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మ (3,741) ను అధిగమించాడు.
రోహిత్ తన టీ20 కెరీర్ లో ఇప్పటివరకు 143 మ్యాచ్ లలో 3,741 పరుగులు (31.7 సగటు) చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 28 హాఫ్ సెంచరీలున్నాయి. విరాట్ కోహ్లీ.. 110 మ్యాచ్ లలోనే ఈ ఘనతను అందుకున్నాడు. కోహ్లీ.. 110 మ్యాచ్ లలో 3,773 పరుగులు (51.68 సగటు) సాధించాడు. కోహ్లీ ఖాతాలో 34 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
ఈ జాబితాలో మార్టిన్ గప్తిల్ (122 మ్యాచ్ లలో 3,531), బాబర్ ఆజమ్ (93 మ్యాచ్ లలో 3,231), పాల్ స్టిర్లింగ్ (118 మ్యాచ్ లలో 3,119) టాప్-5లో ఉన్నారు.
ఇక ఉత్కంఠగా సాగిన నేటి మ్యాచ్ లో భారత్ ను గెలిపించిన కోహ్లీకి ఐసీసీ ఘనంగా ట్రిబ్యూట్ ఇచ్చింది. ‘ది కింగ్ ఈజ్ బ్యాక్.. నెవర్ డౌట్ ఎ ఛాంపియన్ (ఒక ఛాంపియన్ ఆటగాడి మీద అనుమానాలొద్దు)’ అని ట్వీట్ చేసింది. సింహాసనం మీద విరాట్ కోహ్లీ కూర్చున్న ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.