తమ రాష్ట్రానికి చెందిన క్రికెటర్ విరాట్ కోహ్లీ ని డిల్లీ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్(డిడిసీఏ) అరుదైన గౌరవంతో సత్కరించింది. సారథిగా, అత్యుత్తమ బ్యాట్స్ మెన్ గా భారత జట్టును ముందుకు నడినిస్తున్న కోహ్లీ మరో ములుపురాయికి చేరుకున్నాడు. డిల్లీ క్రికెట్ జట్టు తరపున రంజీల్లో అదరగొట్టిన కోహ్లీ 2008 ఆగస్ట్ 18వ తేదీన అంతర్జాతీయ క్రికెట్లో ఆరంగేట్రం చేశాడు. ఇలా అతడు సుదీర్ఘకాలం క్రికెటర్ గా దేశ ప్రతిష్టతో పాటు డిల్లీ రాష్ట్రానికి కూడా గుర్తింపు తీసుకొచ్చాడు. దీంతో  11ఏళ్ల అంతర్జాతీయ కెరీర్ ను పూర్తి చేసుకున్న సందర్భంగా డిడీసీఏ కోహ్లీని ఓ అరుదైన సత్కారంతో గౌరవించింది. 

డిల్లీలోని ప్రముఖ క్రికెట్ స్టేడియం ఫిరోజ్ షా కోట్లా మైదానంలోని ఓ స్టాండ్ కు కోహ్లీ పేరు పెట్టింది.  ఇకపై కోహ్లీ పేరు కోట్లా స్టేడియంలో ప్రతిరోజూ దర్శనమివ్వనుందంటూ డీడిసీఏ ప్రకటించింది. అతడిని ఇలా గౌరవించడం తమకు చాలా ఆనందంగా వుందంటూ డీడీసీఏ ఓ ట్వీట్ చేసింది. 

''సుదీర్ఘకాలం భారత జట్టులో కొనసాగుతూ దేశ గౌరవాన్ని మరింత పెంచుతున్న మా రాష్ట్ర క్రికెటర్ కోహ్లీని చూస్తే గర్వంగా వుంది. అతడి అంతర్జాతీయ కెరీర్ 11ఏళ్లను పూర్తిచేసుకున్న సందర్భంగా ఫిరోజ్‌షా కోట్ల మైదానంలోని ఓ స్టాండ్‌కు కోహ్లీ పేరును పెట్టాలని నిర్ణయించుకున్నాం. ఇందుకు అధ్యక్షుడు రజత్ శర్మ, అపెక్స్ కమిటీ అనుమతి కూడా లభించింది. మా నిర్ణయం అతడి గౌరవాన్ని మరింద పెంచడమే కాదు యువ క్రికెటర్లకు ఆదర్శంగా నిలవనుంది.'' అంటూ  డీడీసీఏ  ట్వీట్ చేసింది. 

ఇప్పటివరకు మాజీ క్రికెటర్లు బిషప్ సింగ్ బేడీ, మోహిందర్ అమర్‌నాథ్, వీరేంద్ర సెహ్వాగ్, పటౌడీ, చోప్రా అంజుమ్ ల పేరిట ఫిరోజ్ కోట్లాలో స్టాండ్స్ వున్నాయి.వీరందరికి క్రికెట్ నుండి రిటైర్మెన తర్వాత ఈ గౌరవంలో సత్కరించగా కోహ్లీకి మాత్రం ముందుగానే ఆ గౌరవం  దక్కింది.