India vs Australia: నాగ్‌పూర్ టెస్టులో 120 పరుగులు చేసిన రోహిత్ శర్మ... మూడేళ్లుగా టెస్టుల్లో సెంచరీ చేయలేకపోయిన విరాట్ కోహ్లీ.. నాగ్‌పూర్ టెస్టులోనూ ఫెయిల్... 

వన్డే, టీ20ల్లో ఫామ్‌లోకి వచ్చిన విరాట్ కోహ్లీ, సుదీర్ఘ ఫార్మాట్‌లో మాత్రం మునుపటి ఫామ్‌ని అందుకోలేకపోతున్నాడు. గత మూడేళ్లలో విరాట్ కోహ్లీ టెస్టు సగటు 30 కూడా దాటలేదు. 2021లో ఇంగ్లాండ్ టూర్‌లో విదేశాల్లో మొట్టమొదటి టెస్టు సెంచరీ నమోదు చేసిన రోహిత్ శర్మ, నాగ్‌పూర్ టెస్టులో సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు...

విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, సూర్యకుమార్ యాదవ్, శ్రీకర్ భరత్ ఫెయిల్ అయినా 120 పరుగులు చేసిన రోహిత్ శర్మ, తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 400 పరుగుల భారీ స్కోరు చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు.. ఈ ఇన్నింగ్స్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్...

‘టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌కి రోహిత్ శర్మ కీ ప్లేయర్. నిజానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బ్యాటర్లకు రోహిత్ ఓ టెంప్లేట్ సెట్ చేసి పెట్టాడు. భారత పిచ్‌లపై, ముఖ్యంగా టర్నింగ్ పిచ్‌లపై ఎలా ఆడాలో రోహిత్ శర్మ ఇన్నింగ్స్ చూసి తెలుసుకోవాలి...

ఆస్ట్రేలియా బ్యాటర్లకు మాత్రమే కాదు, భారత జట్టులోని ప్లేయర్లు కూడా రోహిత్ ఇన్నింగ్స్ చూసి ఎలా ఆడాలో నేర్చుకోవాలి. స్పిన్నర్లను ఎలా ఆడాలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బ్యాటింగ్ నుంచి నేర్చుకుంటే బెటర్...

సాధారణంగా బ్యాటర్లు, బౌలర్ బంతి వేసిన తర్వాత దాని లెంగ్త్‌ని అర్థం చేసుకుని, పిచ్ మీద ఎక్కడ పడుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. అయితే బ్యాక్ ఫూట్‌కి వెళ్లడం వల్ల ఇంకాస్త సమయం దొరుకుతుంది...

కొద్దిగా వెనక్కి వెళ్లడం వల్ల బంతి దిశను అర్థం చేసుకోవడానికి ఇంకాస్త సమయం దొరుకుతుంది. రోహిత్ బ్యాటింగ్‌లో టెక్నిక్ ఇదే... ’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్..

ఓపెనర్ కెఎల్ రాహుల్ 71 బంతుల్లో ఓ ఫోర్‌తో 20 పరుగులు చేసి అవుట్ కాగా, వన్‌డౌన్‌లో నైట్ వాచ్‌మెన్‌గా వచ్చిన రవిచంద్రన్ అశ్విన్ 62 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 23 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. ఛతేశ్వర్ పూజారా 14 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేయగా విరాట్ కోహ్లీ 26 బంతుల్లో 2 ఫోర్లతో 12 పరుగులు చేశాడు...

కెఎల్ రాహుల్, అశ్విన్, పూజారా, కోహ్లీ నలుగురు కూడా తొలి మ్యాచ్ ఆడుతున్న ఆసీస్ స్పిన్నర్ టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లోనే అవుట్ అయ్యారు. 10 బంతుల్లో ఓ ఫోర్‌తో 8 పరుగులు చేసిన శ్రీకర్ భరత్ కూడా టాడ్ ముర్ఫీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

టాడ్ ముర్ఫీ బౌలింగ్‌ని సమర్థవంతంగా ఎదుర్కొన్న రోహిత్ శర్మ 212 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో 120 పరుగులు చేసి ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు..