వెల్లింగ్టన్: న్యూజిలాండ్ పై జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్సులో 2 పరుగులు మాత్రమే చేసి అవుటైన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై నెటిజన్లు దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. నీ కన్నా స్టీవ్ స్మిత్ బెట్టర్ అంటూ ట్విట్టర్ లో పోస్టులు పెడుతున్నారు.

న్యూజిలాండ్ పై తొలి టెస్టు మ్యాచ్ తొలి ఇన్నింగ్సులో జమీసన్ వేసిన వైడ్ డెలివరీ విరాట్ కోహ్లీ బ్యాట్ ను ముద్దాడి వికెట్ కీపర్ రాస్ టైలర్ చేతుల్లోకి వెళ్లింది. న్యూజిలాండ్ పర్యటనలో విరాట్ కోహ్లీ టాప్ స్కోర్ 51 పరుగులు. ఐదోసారి విరాట్ కోహ్లీ కనీసం 20 పరుగుల స్కోరును దాటలేకపోయాడు. 

ఈ స్థితిలో విరాట్ కోహ్లీని స్టీవ్ స్మిత్ తో పోలుస్తూ వ్యాఖ్యలు చేస్తున్నారు. కేవలం ఏడు బంతులు ఆడి పెవిలియన్ కు చేరుకున్న విరాట్ కోహ్లీ గత 19 ఇన్నింగ్సుల్లో ఒక్క సెంచరీ కూడా చేయలేకపోయాడు. అంతకు ముందు రెండుసార్లు కోహ్లీ ఇంతకన్నా దారుణంగా తన ప్రదర్శనను కనబరిచాడు. 

 

స్టీవ్ స్మిత్ పోలిస్తే విరాట్ కోహ్లీ 70 అంతర్జాతీయ సెంచరీలు చేశాడు. స్మిత్ కేవలం 35 సెంచరీలు మాత్రమే చేశాడు. అయితే, టెస్టుల్లో మాత్రం ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. కోహ్లీ 27 టెస్టు సెంచరీలు చేయగా, స్మిత్ 26 సెంచరీలు చేశాడు. సగటు విషయానికి వస్తే స్మిత్ కోహ్లీ కన్నా చాలా బెటర్ అనిపించుకుంటున్నాడు. 

 

స్మిత్ సగటు 62.84 కాగా, కోహ్లీ సగటు 57.81. ఐసిసి టెస్టు ర్యాంకింగ్స్ లో మాత్రం 928 పాయింట్లతో కోహ్లీ అగ్రస్థానంలో ఉండగా, స్మిత్ 911 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు.