BCCI vs Virat Kohli: బీసీసీఐ చీఫ్ గంగూలీ, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లి మధ్య విబేధాలు తారా స్థాయికి చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ ప్రభావం జట్టుపై పడింది. బోర్డు పరువు కూడా గంగలో కలిసింది. ఈ నేపథ్యంలో.. 

కొద్దికాలంగా భారత క్రికెట్ ను కుదిపేస్తున్న సమస్యలలో ప్రధానమైనది బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లిల మధ్య విబేధాలు. గతేడాది సెప్టెంబర్ నుంచి మొదలైన వీరి మధ్య మొదలైన ఈ అంతర్గత గొడవలు.. దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు వరకు తారా స్థాయికి చేరాయి. ఒకరిమీద ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకోకపోనప్పటికీ అండర్ గ్రౌండ్ లో జరిగేదంతా జరుగుతున్నది. వీళ్ల వ్యక్తిగత గొడవల కారణంగా భారత క్రికెట్ ఆట పరంగానే గాక వ్యక్తిగత ప్రతిష్ట కూడా మంటగలిసింది. ఈ నేపథ్యంలో దీనిని చక్కదిద్దే ప్రయత్నాలు జరుగుతున్నట్టు కనిపిస్తున్నాయి. తాజాగా గంగూలీ ఆ దిశగా ఒక అడుగు వేసినట్టే కనిపిస్తున్నది. ఎలాగంటే..? 

వెస్టిండీస్ తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత శ్రీలంక జట్టు భారత్ లో పర్యటించనుంది. పర్యటనలో భాగంగా ఆ జట్టు టీమిండియాతో రెండు టెస్టులు, మూడు టీ20 లు ఆడనుంది. షెడ్యూల్ ప్రకారం.. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా ఈనెల 25న తొలి టెస్టు ఆరంభం కావల్సి ఉంది. ఇది కోహ్లికి వందో టెస్టు.. 

ఈ నేపథ్యంలో కోహ్లిని కూల్ చేసేందుకు గంగూలీ భారీ ప్లాన్ వేశాడు. కోహ్లికి ఇది కెరీర్ లో వందో టెస్టు.. దీనిని మరింత మరుపురాని జ్ఞాపకంగా మార్చేందుకు బీసీసీఐ ప్రయత్నిస్తున్నది. ఇందులో భాగంగానే గంగూలీ మాట్లాడుతూ.. ‘అవును.. బెంగళూరులో జరుగబోయే మ్యాచును పింక్ బాల్ (డే అండ్ నైట్) టెస్టుగా నిర్వహించాలనుకుంటున్నాం. శ్రీలంకతో సిరీస్ కు సంబంధించి ఇంకా వేదికలను ఫైనల్ చేయలేదు. త్వరలోనే ఆ వివరాలను వెల్లడిస్తాం...’ అని అన్నాడు. దక్షిణాఫ్రికా తో టెస్టు సిరీస్ ముగిశాక కోహ్లి సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ టెస్టుతోనే భారత జట్టుకు కొత్త టెస్టు సారథి రానున్నాడు. 

బెంగళూరు టెస్టుతో పాటు ఐపీఎల్, సెలెక్షన్ కమిటీ వివాదం, మహిళల ఐపీఎల్, పుజారా-రహానే ఫామ్ వంటి విషయాలపై గంగూలీ వ్యాఖ్యానించాడు.

పుజారా-రహానే ఫామ్ పై..

పుజారా-రహానే ఫామ్ పై స్పందిస్తూ.. ‘వాళ్లిద్దరూ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. రంజీ ట్రోఫీ వాళ్లకు మంచి అవకాశం. అక్కడ పరుగులు చేసి తమను తాము నిరూపించుకోవడానికి వాళ్లకు ఈ సీజన్ ఉపయోగపడుతుంది. ఇలాగే ఉంటే జట్టు సమతుల్యం కూడా దెబ్బతినే ప్రమాదముంది. వాళ్లిద్దరికీ ఇది నా సూచన మాత్రమే.. ఎందుకంటే టీమిండియా కు వాళ్లిద్దరూ ఎన్నో గొప్ప ఇన్నింగ్సులు ఆడారు. ఎవరికైనా గడ్డుకాలం వస్తుంది.నేను కూడా 2005లో ఇలాంటి పరిస్థితిని ఎదుర్కున్నా.. అప్పుడు రంజీలు ఆడి తిరిగి ఫామ్ అందుకున్నా...’ అని సూచించాడు. 

ఉమెన్స్ ఐపీఎల్ పై.. 

మహిళల ఐపీఎల్ గురించి మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది మే లో వుమెన్స్ టీ20 ఛాలెంజ్ ను నిర్వహిస్తాం. భవిష్యత్తులో మహిళా క్రీడాకారుల సంఖ్య పెరిగిన తర్వాత మహిళల ఐపీఎల్ ను నిర్వహించగలుగుతామని ఆశిస్తున్నాం.. అయితే ఈ ఏడాది పురుషుల ఐపీఎల్ ప్లే ఆఫ్స్ (మేలో) ఉమెన్స్ టీ20 ఛాలెంజ్ ఉంటుంది..’ అని చెప్పాడు. 

ఐపీఎల్ నిర్వహణపై.. 

ఇక ఈ ఏడాది ఐపీఎల్ వేదికలకు సంబంధించి మాట్లాడుతూ.. కరోనా పరిస్థితి చేయిదాటిపోతే తప్ప ఈసారి ఐపీఎల్ ను ఇండియాలోనే నిర్వహిస్తాం. గతంలో మేము స్పష్టం చేసిన మాదిరిగానే భారత్ లోనే ఐపీఎల్ ను నిర్వహించడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం. మహారాష్ట్ర లోని ముంబై, పూణెలలో మ్యాచులను నిర్వహించాలని భావిస్తున్నాం. లీగ్ మ్యాచులైతే ఇక్కడే నిర్వహిస్తాం. అహ్మదాబాద్ గురించి ఇంకా ఆలోచించలేదు. ఒకవేళ ఏప్రిల్-మేలలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. అప్పటి పరిస్థితుల ఆధారంగా దానిమీద నిర్ణయం తీసుకుంటాం..’ అని చెప్పాడు.