విరుష్క... ఈ పేరు క్రికెట్-బాలివుడ్ ల మధ్య సాగిన ప్రేమకు ప్రత్యక్ష సాక్ష్యం. క్రికెట్ తో విరాట్ కోహ్లీ...సినిమా షూటింగ్ లతో అనుష్క శర్మలు తీరికలేకుండా బిజీబిజీగా గడిపుతుంటారు. ప్రస్తుతం భార్యాభర్తలుగా మారిన తర్వాత కూడా వారిద్దరు ఇంట్లో కలిసుండే సందర్భాలు చాలా అరుదనే  చెప్పాలి. అలాంటిది వీరి మొదటి పరిచయం ఎలా  జరిగింది....అనుష్కను  కోహ్లీ ఎలా ఇంప్రెస్ చేయగలిగాడో... ప్రేమాయణం ఎలా సాాగిందని తెలుసుకునేందుకు అభిమానులు ఆసక్తి  కనబరుస్తుంటారు. అయితే తాజాగా కోహ్లీయే స్వయంగా తన లవ్ స్టోరీ ఎలా మొదలయ్యిందో వెల్లడించాడు. 

"క్రికెటర్ గా బిజీబిజీగా గడిపుతున్న సమయమది. అందువల్లే నేను ఎక్కువగా అమ్మాయిల జోలికి వెళ్ళేవాడిని కాదు. అలా చేస్తే క్రికెట్ పై ఫోకస్ తగ్గుతుందన్న అభిప్రాయం వుండేది. కానీ ఓ షాంపూ యాడ్ కోసం షూటింగ్ లో వుండగా సహనటి అనుష్క శర్మ నన్నెంతో ఆకట్టుకుంది. దీంతో ఆమెతో ఎలాగైనా పరిచయం పెంచుకోవాలన్న తాపత్రయంలో ఓ బ్యాడ్ జోక్ పేల్చాను. 

అనుష్కతో ఏదైనా ఒకటి మాట్లాడాలనుకుంటున్న సమయంలో నా దృష్టి ఆమె హైహీల్స్ పై పడ్డాయి. బాగా ఎత్తుగా వున్న వాటిని ఉద్దేశిస్తూ ''ఇంతకంటే ఎత్తైనవి నీకు దొరకలేవా'' అని  కామెంట్ చేశాను. నా ఆ జోక్ కు ఆమె నవ్వకపోగా కోపంగా అక్కడి నుండి వెళ్లిపోయింది. నా కుల్లుజోకే ఆమెను హట్ చేసి వుంటుందని అనుకున్నాను.

అయితే ఆ తర్వాత అనుష్కతో ఎలాగోలా పరిచయం పెంచుకోగలిగాను. అప్పుడు తెలిసింది నేను ఆ హైహీల్స్  జోక్ వేసినపుడు ఎందుకంత కోపంగా వెళ్లిపోయిందో. నేను కామెంట్ చేయడానికి ముందే అనుష్క మేనేజర్ కూడా అలాంటిదే చేశాడట. కోహ్లీ ఆరడుగుల ఆజానుబాహుడేమీ కాదు ఆ హైహీల్స్ వద్దని సూచించాడట. కానీ అతడి మాట వినకుండా ఆమె అవే హీల్స్ తో సెట్ కు రాగా నేనుకూడా అలాంటి కామెంటే చేశాను. అందువల్లే తనకు చిర్రెత్తుకొచ్చి కోపంగా వెళ్లిపోయిందట.'' అంటూ కోహ్లీ తన రొమాంటిక్ లవ్ స్టోరీ బిగినింగ్ గురించి వివరించాడు. 

ఇలా 2013లో మొదలైన వీరిద్దరి ప్రేమాయణం చివరికి 2017లో పెళ్లితో ముగిసింది. వీరిద్దరి పెళ్లి ఇటలీలో అత్యంత సన్నిహితుల సమక్షంలో వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ముంబైలో రిసెప్షన్ జరుపుకున్నారు. వీరిద్దరి పెళ్లి సమయంలోనే విరుష్క అనే పేరు సోషల్ మీడియాలో తెగ ట్రెండయ్యింది.