టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపాయి.  జట్టులో తనను సెలక్ట్ చేయడానికి తన తండ్రిని సెలక్టర్లు లంచం అడిగారంటూ తాజాగా కోహ్లీ పేర్కొన్నారు. ఇంతకీ మ్యాటరేంటంటే...

 కోహ్లీకి పరుగుల యంత్రం అనే పేరు కూడా ఉంది. మైదానంలోకి అడుగుపెట్టాడంటే ఎవరిదో ఒకరి రికార్డు బ్రేక్ చేయడమో.. లేదా కొత్త రికార్డు నమోదు చేయడమో జరగాల్సిందే. 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చిన కోహ్లీ ఇప్పటి వరకు 70 అంతర్జాతీయ సెంచరీలు చేసాడు. అలానే 21,901 పరుగులు చేశాడు. కోహ్లీ దెబ్బకు ఎందరో మాజీ దిగ్గజాల రికార్డులు ఇప్పటికే బద్దలయ్యాయి. 

దిగ్గజం సచిన్ టెండూల్కర్ క్రికెట్‌ నుంచి తప్పుకున్న తర్వాత విరాట్ ఆయన స్థానాన్ని భర్తీ చేశాడని నిపుణులు అంటారు. రన్ మెషిన్ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఇన్ని రికార్డులు తన సొంతం చేసుకున్న కోహ్లీకి కెరీర్ ఆరంభంలో ఓ చేదు సంఘటన నమోదు కావడం గమనార్హం.

ప్రస్తుతం కరోనా లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న కోహ్లీ సోషల్ మీడియా వేదికగా భారత స్టార్ ఫుట్‌బాల‌ర్ సునీల్ చెత్రితో ముచ్చటించాడు. ఆ సమయంలో.. ఢిల్లీ జట్టులో తన సెలక్షన్ కోసం అధికారులు లంచం అడిగితే.. త‌న తండ్రి ప్రేమ్ కోహ్లీ తిర‌స్క‌రించాడ‌ని విరాట్ పేర్కొన్నాడు.

'ఢిల్లీలో కొన్ని సమయాల్లో పనులు నిజాయితీగా జరగవు. ఉదాహరణకు సెలక్షన్ విషయంలో ఎవరో వ్యక్తి రూల్స్ ప్రకారం వెళ్లలేదు. అతను మా నాన్నతో మెరిట్ ప్రకారం సెలెక్ట్ అవ్వాలంటే.. లంచం ఇవ్వాలని అన్నాడట' అని విరాట్ తెలిపాడు. అయితే తన తండ్రి అందుకు ససేమీరా ఒప్పుకోలేదని కోహ్లీ వివరించాడు.

చాలా పేద కుటుంబం నుంచి వ‌చ్చిన త‌న తండ్రి ఎన్నో క‌ష్టాలు ప‌డి, లాయ‌ర్ అయ్యార‌ని తెలిపాడు. అంత‌కుముందు నేవీలో ప‌నిచేశార‌ని, త‌న‌కు ఆయ‌న‌ ఎప్పుడూ స్ఫూర్తిగా నిలుస్తార‌ని అభిప్రాయ‌ప‌డ్డాడు. నిజానికి కోహ్లీ టీమిండియాలోకి ఎంపిక కాకముందే అంటే 18వ ఏట చ‌నిపోయారు. ఆయ‌న చనిపోయిన త‌ర్వాతి రోజు రంజీ ట్రోఫీలో బ‌రిలోకి దిగిన కోహ్లీ.. త‌మ జ‌ట్టును ఓటమి బారి నుంచి తప్పించాడు.